కౌబాయ్ పాత్రల్లో , డిటెక్టివ్ పాత్రల్లో , ఢిష్యూం ఢిష్యూం పాత్రల్లో ప్రేక్షకులను అలరించిన కృష్ణ ఈ సినిమాలో విభిన్న పార్శ్వాలు ఉన్న హీరో పాత్రను చాలా గొప్పగా నటించారు . ఈ సినిమాలో ముగ్గురిని ప్రధానంగా మెచ్చుకోవాలి . ఒకరు కృష్ణ . రెండో వారు బాలయ్య . ఇంజనీరింగ్ చదివి సినిమా రంగంలోకి వచ్చి నటుడిగా , నిర్మాతగా , దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్నారు . జగ్గయ్య లాగానే కంచు కంఠం . డైలాగులు చెప్పటంలోని స్పష్టత , స్వరం అద్భుతం .
మూడో వారు విశ్వనాథ్ . కళాతపస్విగా మారే క్రమంలో తనను తాను చెక్కుకుంటున్న కాలంలో దర్శకత్వం వహించిన సినిమా 1973 లో వచ్చిన ఈ నేరము శిక్ష సినిమా . ఈ సినిమా కధను బాలయ్యే తయారు చేసుకున్నారు . 1866 లో రష్యన్ మెస్సెంజర్ అనే ఒక సాహిత్య పత్రికలో సీరియల్ గా వచ్చిన Crime & Punishment ఆధారంగా ఈ సినిమా కధను తయారు చేసుకుంటే , దానికి తగ్గ స్క్రీన్ ప్లేని దర్శకత్వాన్ని విశ్వనాథ్ అందించారు . వీరందరికి తగ్గట్లుగానే సముద్రాల , మోదుకూరి జాన్సన్ సంభాషణలను వ్రాసారు .
గారాబంగా , ఆకతాయిగా పెరిగిన ఓ డబ్బు చేసిన యువకుడు తన వలన నష్టపోయిన కుటుంబాన్ని ఆదుకోవటమే కాకుండా , చట్టానికి లొంగిపోవటం ఈ సినిమా కథాంశం . కృష్ణ తనకొచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని మరోసారి చెప్పక తప్పదు . ఇలాంటి కథాంశంతో శోభన్ బాబు ఖైదీ బాబాయ్ , తరుణ్ శ్రియలతో ఎలా చెప్పను వంటి మంచి సినిమాలు వచ్చాయి . ఇవి కూడా సక్సెస్ అయ్యాయి .
Ads
యస్ రాజేశ్వరరావు శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు . రాముని బంటునిరా అనే పాట ఎంత బాగుంటుంది అంటే పాట చివర్లో ప్రేక్షకులు కూడా భజన చేస్తారు . దేవులపల్లి వారు వ్రాసిన చేసిన పాపం నీది చితికిన బ్రతుకు ఇంకొకరిది మనసుకు హత్తుకునేలా ఉంటుంది . మిగిలిన ఏమండీ సారూ ఓ బట్లరు దొరగారూ , వేసావు భలే వేషాలు , దాగుడుమూతలు దండాకోర్ , వన్ టు వన్ టూ పాటలు శ్రావ్యంగా ఉంటాయి .
కృష్ణ , బాలయ్య , భారతి , సత్యనారాయణ , కాంతారావు , శబరి పండరీబాయి , కృష్ణకుమారి , ఆర్జా జనార్ధనరావు , పి ఆర్ వరలక్ష్మి , శంకరాభరణం నిర్మాత ఏడిద నాగేశ్వరరావు , రావు గోపాలరావు ప్రభృతులు నటించారు . ఎర్ర నటుడు నారాయణమూర్తి ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా నటించారు . సాంకేతికంగా ఇదే ఆయన మొదటి అప్పియరెన్స్ .
నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ఆడిన ఈ సినిమా తమిళంలోకి నీతిక్కు తలైవనంగు టైటిల్ తో MGR , లతలతో రీమేక్ అయింది . శిక్ష టైటిల్ తో హిందీలోకి రీమేక్ అయింది . అన్ని భాషల్లోనూ సక్సెస్ అయింది .
మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసా . టివిలో కూడా చూసా . యూట్యూబులో ఉంది . ఈతరంలో చూడనివారు ఎవరయినా ఉంటే మీ వాచ్ లిస్టులో తప్పక పెట్టుకోండి . A worth-watching , sentimental , drama filled , thought provoking movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …. (By… డోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Share this Article