పాత ఒక రోత… కొత్త ఒక వింత… భక్తులకూ అంతే… సినిమా కొత్తగా ఉండాలి… పాత దేవుడు కూడా కొత్తగా కనిపించాలి… అప్పుడే భక్తులు పోటెత్తుతారు… యాదగిరిగుట్టకు వెళ్లే తోవలో కొత్తగా కట్టిన స్వర్ణగిరి గుడికి నిజంగానే జనం పోటెత్తుతున్నారు… సింపుల్‌గా ఒక్కరోజయితే ఆ యాదగిరిగుట్ట, తిరుమలను మించిన జనం వస్తున్నారు…
చూస్తుంటే… బ్యాగులు నెత్తిన పెట్టుకుని, ఆ అడ్డదారుల్లో నడుస్తూ… టూరిస్టు వ్యానుల్లో వస్తూ… జనం విరగబడుతున్నారు… కావచ్చు, ఇంత రద్దీని ఆ యాజమాన్యం కూడా ఊహించి ఉండకపోవచ్చు… దానివల్లే నిర్వహణ కాస్తా అదుపు తప్పి ఉండవచ్చు… దీన్నెలా స్ట్రీమ్ లైన్ చేయాలో తెలియక నెత్తికి చేతులు పెట్టుకుని ఉండవచ్చు…
కానీ ఓ ప్రైవేటు గుడికి ఇదే అసలైన చాలెంజ్… నిజంగానే అక్కడి గుడి నిర్వహణ పద్ధతుల మీద నాకు అభ్యంతరాలు, అసంతృప్తి ఉన్నాయి… రెండోసారి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాక కూడా… నా అభిప్రాయాల్లో మార్పేమీ రాలేదు… ఎంతటి స్టార్ హీరోనైనా సరే కొత్తకొత్తగా చూపిస్తేనే జనం చూస్తారు, థియేటర్‌కు వస్తారు, లేకపోతే పోవోయ్ అంటారు…
Ads
ఇక్కడ విగ్రహం బాగుంది… నీటి కొలను నడుమ ఆదిశేషుడిపై పవళించిన విగ్రహమూ బాగుంది… బోలెడు ఎత్తున్న ఆంజనేయుడి విగ్రహమూ బాగుంది… విచిత్రం ఏమిటంటే..? సెల్ ఫోన్లు అనుమతించబోం, ఇక్కడే డిపాజిట్ చేయండి అని రుసుం కట్టించుకుని మరీ కొన్ని కౌంటర్లలో పెడుతున్నారు కదా… మరి దర్శనానంతరం ఆంజనేయుడు, 360 డిగ్రీస్ వీడియో, ఆదిశేష విష్ణువు దగ్గర అన్ని వేల మంది సెల్ఫీలు ఎలా తీసుకుంటున్నారు..? మరెందుకు ఆ నిబంధన..?
కానీ ఏమాటకామాట… ఆ ఆవరణలో ఉన్నంతసేపూ స్పిరిట్యుయల్ వైబ్స్ ఏమీ కనెక్ట్ కావడం లేదు… అసలు జనం రద్దీని ఎలా నియంత్రించాలో తెలియక సతమతం అవుతున్నారు నిర్వాహకులు… 50 రూపాయల టికెట్టు అనేది అందరికీ లైట్… అక్కడ ఇచ్చే వీఐపీ పాసుల్లో కూడా తేడాలు… 1000 రూపాయలు కట్టిన ప్లస్ వీవీఐపీ వ్యక్తులకు లడ్డూ ప్రసాదం, శేషవస్త్రం ఇస్తారుట… మొహమాటం పాసుల వాళ్లకు జస్ట్, వీఐపీ దర్శనం మాత్రమే… దేవుడి వాకిలి దగ్గరకు కూడా పోనివ్వరు…
అసలు విషయానికి వస్తే… ఆర్టీసీ వాళ్లు ప్రత్యేకంగా అక్కడికి బస్సులు వేశారనేది పెద్ద వార్త కాదు… ప్రజల రవాణా అవసరాలు తీర్చడం, గిరాకీ ఎక్కడుంటే దాన్ని అందిపుచ్చుకోవడం ఓ సంస్థగా ఆర్టీసీకి తప్పదు, అవసరం… సో, అది తప్పుపట్టేదేమీ లేదు… కాకపోతే ఓ సందేహం కొట్టేస్తోంది చాన్నాళ్లుగా…
దేవాదాయ శాఖ అనబడే ఓ దరిద్రపు శాఖ ఉంటుంది ప్రభుత్వంలో… వేలాదిమంది ఉద్యోగులతో గుళ్లపై పెత్తనం చేస్తుంది, ఆ ఆదాయానికి మింగేస్తుంటుంది… రాజకీయ, బ్యూరోక్రటిక్ పెత్తనాలు… అవినీతి గట్రా సరేసరి… ఈ గుడికి వస్తున్న జనాన్ని చూసి, కళ్లు మంటెక్కి, ఎక్కడ దేవాదాయ శాఖ పరిధిలోకి లాగేస్తారేమోనని ఓ డౌట్… ఈ గుడికి కాస్త దూరంలో ఉన్న బంగారు లింగం, స్ఫటిక లింగం గుడికి సాయిబాబా పీఠం అని పేరు పెట్టి, ఎడాపెడా లింగాల నడుమ సాయిబాబా విగ్రహాలు పెట్టేశారు…
సాయిబాబా గుళ్ల జోలికి దేవాదాయ శాఖ వెళ్లదు… ఈ గుడిలో సాయిబాబా విగ్రహాలేమీ లేవు… మానేపల్లి వాళ్లు ఆర్య వైశ్యులే అనుకుంటా, కానీ వాసవీమాత విగ్రహం కూడా ఎక్కడా కనిపించలేదు… ఆ రెండు విగ్రహాలు ఉండి, వాళ్ల గుడే అని క్లెయిమ్ చేసుకుంటేనే ఫాఫం, ఈ మానేపల్లి వెంకటేశ్వరుడికి దేవాదాయ శాఖ కుటిల పడగ నీడ నుంచి రక్షణ దొరకొచ్చు బహుశా…
సరే, ఈ ప్రత్యేక బస్సులు ఎక్కడి నుంచీ అంటారా..? JBS బస్ స్టేషన్ నుంచి రెండు ఈ-మెట్రో ఎక్స్‌ప్రెస్ నాన్ ఏసీ బస్సులను స్వర్ణగిరి ఆలయానికి నడుస్తాయి… ఈ బస్సులు ప్రతిరోజూ ఉదయం 7, 8 గంటలకు జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి బయలుదేరి స్వర్ణగిరి ఆలయానికి చేరుకుంటాయి… మధ్యాహ్నం 2.50, 3.50 గంటలకు తిరిగి స్వర్ణగిరి ఆలయం నుంచి బయలుదేరుతాయి… ఇక ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి స్వర్ణగిరి ఆలయానికి ప్రతి రోజూ ఉదయం 7.30, 8.30, 10.35, 11.35 గంటలకు, మధ్యాహ్నం 3.20, 4.20 గంటలకు, సాయంత్రం 6.25, 7.25 గంటలకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి… భక్తుల సమాచారం కోసం…
Share this Article