కొన్ని సక్సెస్ స్టోరీలు అనూహ్యంగా ఉంటయ్… అసలు నమ్మలేని రీతిలో… మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రస్థానం కూడా అదే… ఏదో చిన్నా చితకా సబ్ కంట్రాక్టులు చేసుకునే సంస్థ ఈరోజు ఆదానీ, అంబానీ, వేదాంత, టాటాలతో కూడా పోటీపడుతోంది… మేఘా ఓనర్లు ఆల్రెడీ టాప్10 ధనికుల్లో చేరిపోయారు… ఉజ్వలంగా వెలిగిపోతోంది కథ…
తాజాగా ఈ సంస్థ ఏకంగా ఓ అణు విద్యుత్తు ప్లాంటు నిర్మాణం కంట్రాక్టు చేజిక్కించుకుంది… న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్నాటకలోని కైగా వద్ద నిర్మించే 1400 వందల మెగావాట్ల ప్లాంటు నిర్మాణానికి 12,780 కోట్లతో బిడ్ వేసి, లీస్ట్ బిడ్డర్‌గా నిలిచి, ఆ కంట్రాక్టు కైవసం చేసుకుంది…
అవునూ, అదసలే అణువిద్యుత్తు ప్లాంటు కదా, మరి ఆ రంగంలో అనుభవం లేని ఓ సంస్థకు అలా తక్కువ బిడ్ వేస్తే నిర్మాణ బాధ్యత అప్పగించవచ్చా..? ఇదొక పెద్ద ప్రశ్న… కాకపోతే కంట్రాక్టులో పేర్కొన్న స్పెసిఫికేషన్ల మేరకు నిర్మిస్తేనే డబ్బులు ఇస్తారనేది వేరే సంగతి… ఇదీ ఈపీసీ పద్ధతిలో నిర్మిస్తారు… అంటే, ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ బాధ్యత సంస్థదే…
Ads
నమ్మొచ్చా..? అదంతా వేరే టెక్నికల్ డిబేట్… ఈ సంస్థ ఓనర్లు కృష్ణారెడ్డి, పిచ్చిరెడ్డిల నడుమ విభేదాలు, ఎన్ని వేల కోట్లు కావాలో అడుగు, ఇస్తా, వదిలేసి వెళ్లిపో అని కృష్ణారెడ్డి సదరు పిచ్చిరెడ్డిని బయటికి పంపించే ప్రయత్నాలు తీవ్రతరం చేశాడనే వార్తలు కూడా చదివాం వాట్సప్ గ్రూపుల్లో… అంతేనా..? నడమంత్రపు సిరితో ఇదే సంస్థకు చెందిన ఒకామె కోట్లకుకోట్ల విలువ చేసే నగలతో, డ్రెస్సులతో అవేవో ఫ్యాషన్ షోలలో పాల్గొంటున్నదీ అనే విమర్శలనూ చదివాం… అవన్నీ వదిలేస్తే..?
కీలకమైన డిఫెన్స్, న్యూక్లియర్ పవర్ అంశాల్లో కమర్షియాల్ యాస్పెక్ట్స్ మాత్రమే చూస్తారా..? ఇతరత్రా క్రెడిబులిటీ అంశాలు కూడా చూస్తారా..? ఇది సమాధానం లేని మరో ప్రశ్న… సరే, వాళ్ల దగ్గర డబ్బుంది… చిన్నాచితకా కంట్రాక్టులు చేసే దగ్గర నుంచీ పలు రంగాల్లోకి వేగంగా డైవర్సిఫై అయ్యారు… ఆయా రంగాలకు సంబంధించిన వాళ్లను హైర్ చేసుకోవడం, అన్ని రంగాల్లోకి అడుగుపెట్టడం… ఇదే కథ…
పలు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలకు ఎడాపెడా అధిక కమీషన్లు ఇవ్వడం, ఆ డబ్బుతో కేసీయార్, చంద్రబాబు కాంగ్రెస్, మిత్రపక్షాలకు వందల కోట్ల డబ్బును సర్దుబాటు చేశారని బీజేపీకి గుర్రుగా ఉండేది… బీజేపీని డిస్టర్బ్ చేశారనేది కోపం… కానీ ఏమైంది..? ఏమీ కాదు… బీజేపీకి సరెండర్… ఇంకొన్ని రంగాల్లోకి విస్తరణ… అంతేకదా… బీజేపీ స్ట్రాటజీలు, ప్రయారిటీలు వేరు కదా…
సో, ఏతావాతా అర్థమైంది ఏమిటి..? డబ్బుండాలి, ఉన్న డబ్బును భిన్నరంగాల్లోకి పెట్టుబడి పెట్టాలి, అవసరమున్న వాళ్లను హైర్ చేసుకోవాలి ఏదో రేటుకు… అధికారంలో ఉన్నవాళ్లను అనగా నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, డబ్బుతో కొట్టేయాలి… అంబానీలు, ఆదానీలు చూపిన బాటలోనే వాళ్లకే దీటుగా ఎదగాలి… అదేనా..? అవునేమో, అదే మేఘా ఆచరణ సూత్రమేమో..!!
Share this Article