నిన్న రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేస్తూ కొన్ని వివరాలు చెప్పాడు కదా… ఈరోజు ఆంధ్రజ్యోతిలో తప్ప వేరే పత్రికల్లో రిపోర్ట్ అయినట్టు కనిపించని కొన్ని అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి…
సరే, రాజకీయంగా బీఆర్ఎస్ నుంచి తమ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను సమర్థించుకున్నాడు… తప్పదు… అలాంటోళ్ల మీద వెంటనే అనర్హత వేటు వేయాల్సిందేనని బీఆర్ఎస్ ఎంత గాయిగత్తర చేస్తున్నా ఆ ప్రయాసకు, ఆ డిమాండ్లకు అసలు విలువ లేదు… ఎందుకంటే..? నిజంగానే తెలంగాణలో మునుపెన్నడూ లేని రీతిలో కేసీయారే ఈ ప్రలోభాలు, చేరికలు, చీలికలను ఓ రేంజుకు తీసుకుపోయాడు…
Ads
ఇదే కాంగ్రెస్ కేసీయార్ దెబ్బకు కుదేలైంది… చివరకు ఆ కేసీయార్ పాలన తీరు, అహం, కుటుంబ పెత్తనం కారణంగా జనంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చి… అదే కాంగ్రెస్‌ను జనం గద్దెనెక్కించారు… అలా కాలం చెప్పింది తీర్పు… తమ పాత తప్పిదాలన్నీ మరిచి ఇప్పుడు ఎంత గొంతు చించుకున్నా జనంలో పెద్దగా స్పందన కనిపించదు…
అదేమంటే, అప్పట్లో ఏమన్నాడు కేసీయార్..? రాజకీయ శక్తుల పునరేకీకరణ అన్నాడు… మరి ఇప్పుడూ అంతే కదా… బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీ వైపు రాజకీయ శక్తులు పునరేకీకరణ జరుగుతోంది… పైగా నువ్వు నేర్పిన విద్యయే కదా నీరజాక్షా..?
జగన్ ఇంటి దగ్గర నిర్మాణాల కూల్చివేతకు ఓ మంత్రి తొందరపడ్డాడని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు… ఎవరు..? జనానికి తెలియాలి… కానీ ఒక్క మీడియా కూడా దానిపై దృష్టి పెట్టలేదు… అంతేనా..? ఒక ఎస్పీ స్థాయి అధికారిణి పత్తాలాటను తమ కుటుంబసభ్యుల ద్వారా ప్రోత్సహిస్తోందట… ఏపీకి సంబంధించిన ఓ కీలక కుటుంబం మద్దతు అట… ఒక ఐఏఎస్ అధికారిణి భర్త అక్రమాలకు పాల్పడితే వెంటనే తనకు సమాధుల బాధ్యత అప్పగించాడట… ఎవరు వీళ్లు..? తెలంగాణ సొసైటీకి తెలియాలి కదా…
సరే, మళ్లీ తనే అంటున్నాడు, ఎంతమంది మీద చర్య తీసుకుంటాం అని… నిజమే… కానీ ఇప్పటికే ఉన్నతాధికారులు మాట వినడం లేదు… ఇంకా కేసీయార్ పాలనలో ఉన్నట్టే అరాచకంగా ఉండొచ్చు అనుకుంటున్నారు… ఒకరిద్దరు నొటోరియస్ అధికారులపై చర్య లేకపోతే అది అలుసు అయిపోదా..? మరింత రెచ్చిపోరా అందరూ..? అదెందుకు ఆలోచించకూడదు రేవంత్ రెడ్డి..?
చాలా అంశాల్లో ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారును బదనాం చేశారు, చేస్తున్నారు… బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు… ఈ గవర్నమెంట్ వేరు అనే సంకేతం కింది వరకూ వెళ్లాలంటే ఒకరిద్దరు నొటోరియస్ అధికార్లపై యాక్షన్ ఉండాలి కదా… మరీ ఇబ్బందికరంగా ఉంటే డీవోపీటీకి సరెండర్ చేయవచ్చు… అప్పుడే కదా అందరూ తొవ్వలోకి వచ్చేది… తెలంగాణ సొసైటీకి వీళ్లు నష్టకారకులు గాకుండా ఉండాలంటే… తక్షణం ‘‘ఎంతమందిని తీసేస్తాం’’ అనే భావజాలం నుంచి బయటపడాలి రేవంత్ రెడ్డి..!!
Share this Article