చాన్నాళ్లయింది ఒక సినిమా మీద సోషల్ మీడియా ఇంతగా చర్చకు పెట్టడం..! అమితాబ్, నాగ్ అశ్విన్ సినిమా కల్కి మీద సోషల్ మీడియా పోస్టుల్లో రకరకాల విశ్లేషణలు, అభిప్రాయాలు, విమర్శలు, ప్రశంసలు హోరెత్తిపోతున్నాయి…
కల్కి సినిమా ఓ మంచి పని చేసింది… ఏకంగా ప్రజెంట్ జనరేషన్ నడుమ మహాభారతం మీద డిబేట్ రన్ చేస్తోంది… అశ్వత్థామ శాపం, తలపై మణి దాకా అనేక అంశాలు జనం చర్చిస్తున్నారు… మరీ ప్రత్యేకించి కర్ణుడి కేరక్టర్ మీద అందరి దృష్టీ ఫోకసైంది… ఎవరి అవగాహనను బట్టి వాళ్లు… కర్ణుడు విలనా..? హీరోనా..? చర్చను తలెకత్తుకున్నారు…
మహాభారతంలోని దాదాపు ప్రతి పాత్ర విశిష్టమైందే… కథలో దేని ప్రాధాన్యం దానిదే… నెగెటివ్‌గా, పాజిటివ్‌గా కూడా కనిపిస్తుంటాయి అనేక పాత్రలు… కర్ణుడి పాత్రనే తీసుకుంటే మహావీరుడు, దానశీలి, మిత్రధర్మానికి కట్టుబడినవాడు, కుంతి వదిలేసుకోవడం వల్ల బాధితుడు వంటి భావాలు చాలా కలుగుతాయి… అదే సమయంలో కర్ణుడికి మరోకోణం కనిపిస్తుంది… దుష్టచతుష్టయంలో చేరి చెడ్డవాడయ్యాడు…
Ads
ద్రౌపది వస్త్రాపహరణం వంటి సందర్భాల్లో చెడు నడతను ప్రదర్శించాడు… అనేకసార్లు చాలామందితో ఓడిపోతాడు… అబద్ధాలతో విద్య నేరుస్తాడు… కానీ సాక్షాత్తూ కుంతి నేను తల్లిని అని చెప్పినా, కృష్ణుడే రాయబారం నడిపినా మిత్రధర్మానికే కట్టుబడి మరణిస్తాడు తప్ప స్వార్థానికి తలొగ్గలేదు… తనను దుర్యోధనుడు తప్ప భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, ధృతరాష్ట్రుడు వంటి కురుపెద్దలందరూ కర్ణుడిని ఇష్టపడరు… ద్వేషిస్తారు…
ప్రభాస్ కేరక్టర్ కాబట్టి కర్ణుడి పాత్ర మీద ఇంత చర్చ సాగుతోంది… ఎందుకో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ మీద నెగెటివ్ ట్రోల్ సాగుతూ ఉంటుంది… ఈ సినిమాలో అర్జునుడి పాత్రను విజయ్ దేవరకొండ వేయడంతో దాని మీదా చర్చ సాగుతోంది… అంతేకాదు, సినిమాలో ఈ పార్టులో అశ్వత్థామ పాత్ర వేసిన అమితాబే హీరోగా కనిపిస్తాడు…
దీంతో అశ్వత్థామ పాత్ర తీరూతెన్నూ, మంచీచెడు గుణాలూ సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నాయి… అన్నింటికీ మించి అసలు కల్కి ఎవరు..? పురాణాలు కల్కి గురించి ఎలా ప్రస్తావించాయి అనేది మరో చర్చ… ఇలా మొత్తానికి మహాభారత పాత్రల మీద చర్చ సాగుతున్న తీరు మాత్రం కాషాయ క్యాంపుకి నచ్చింది… కొత్త జనరేషన్‌లో ఆ గ్రంథం మీద అనురక్తి, ఆసక్తి ఏర్పడుతున్నాయి కదానేది ఆ సంతోషం…
మహాభారత కాలాన్ని రాబోయే భవిష్యత్ కాలానికి ముడిపెట్టి, లంకెలు పెట్టి నాగ్ అశ్విన్ రాసుకున్న కథ మీద గానీ… భూమ్మీద సాగుతున్న రకరకాల విధ్వంసాన్ని, వాటి ప్రభావాల్ని ఈ కథ ద్వారా దర్శకుడు ప్రజెంట్ చేసిన విధానం మీద గానీ పెద్దగా చర్చ జరగకుండా… ఆయా పాత్రలు పోషించిన నటుల మీద రాగద్వేషాలతో ఆ పాత్రల గురించి మాత్రమే సోషల్ మీడియా బహుళ చర్చకు తెర లేపడమే ఒకింత ఆశ్చర్యం…
Share this Article