లీకు పరీక్షల కాలంలో అందరూ పరాజిత పరీక్షిత్తులే! అగ్ని పరీక్ష
అప్పుడు సీతమ్మకు ఒకసారే అగ్నిపరీక్ష. ఇప్పుడు చదువుకునే పిల్లలకు రోజూ అగ్ని పరీక్షలే. వారి తల్లిదండ్రులకు ప్రతిక్షణం విషమ పరీక్షలే.
సహన పరీక్షకు పరీక్ష
Ads
వెయ్యి ఉద్యోగాలకు పది లక్షల మంది పోటీపడే నోటిఫికేషన్ల కోసం పడిగాపులు పడడం సహన పరీక్షకు పరీక్ష.
స్వీయ పరీక్ష
అప్పులు చేసి కోచింగులకు వెళ్లడం; నిద్రాహారాలు మాని దీక్షగా చదవడం మనకు మనమే పెట్టుకునే స్వీయ పరీక్ష.
శల్య పరీక్ష
పరీక్ష కేంద్రం గేటు ముందు నఖశిఖపర్యంతం చేసే తనిఖీ శల్యపరీక్ష.
ధైర్య పరీక్ష
రాస్తున్న పరీక్ష లీకయి రద్దు కాకుండా ఉండాలని కోటి దేవుళ్లకు మొక్కుకుంటూ రాయడం మనో ధైర్యానికి పరీక్ష.
కాపీ పరీక్ష
పాతిక లక్షలు డబ్బుంటే నీటుగా ‘నీట్’ లీకు పేపర్లు కొనుక్కుని…వందకు వంద మార్కులు సాధించి అత్యుత్తమ ర్యాంకులతో ఎయిమ్స్ లో వైద్య విద్యార్థి అయి…దేశం తిక్క కుదర్చలేకపోయానే! అని నైతికంగా బాధపడుతూ పరీక్ష రాయడం అసలు పరీక్ష.
వేదనా పరీక్ష
ఎంపిక చేసిన రాష్ట్రాల్లోనే పరీక్ష పేపర్లు లీక్ కావడం; కొన్ని రాష్ట్రాల నుండే కొన్ని పరీక్షల్లో అత్యధికంగా అభ్యర్థులు ఎంపిక కావడం వెనుక ఉన్న ఇతరేతర వ్యవహారాలపై పరీక్షా పే చర్చలు జరగకపోవడం వేదనా పరీక్ష.
సమాధానం లేని ప్రశ్నల పరీక్ష
బయట ప్రపంచంలో భారత్ ఒక వెలుగు వెలగడానికి దీపాల్లో చమురు తామే పోశామని భుజకీర్తులు తగిలించుకునే పెద్దలు…ఇంట్లో లీకుల ఈగల మోతలకు పెదవి విప్పకపోవడం సమాధానంలేని ప్రశ్నల పరీక్ష.
ప్రజాస్వామ్య పరీక్ష
ఒక సమస్య చర్చకు రాకుండా మరో సమస్యను సృష్టించి పబ్బం గడుపుకునే పాలకులు…తగలబడే రోమ్ ముందు వాయించే ఫిడేళ్లకు ప్రతిరూపాలైనప్పుడు ప్రజాస్వామ్యానికి పాస్ మార్కులు కూడా రాని పరీక్ష.
శవ పరీక్ష
ఒక పరీక్షకు తయారు కావడానికి మరో పరీక్ష పెట్టే కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టి…గొలుసుకట్టు దోపిడీకి శత్రు దుర్భేద్యమైన ‘కోటా’ కోట గోడలు నోట్ల కట్టలతో నిర్మించగలిగినప్పుడు…ఆ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు హాస్టల్ గదుల్లో ఫ్యాన్ల రెక్కల గాలిలో గాలిగా కలిసిపోతున్నప్పుడు…వారి తల్లిదండ్రుల కళ్లల్లో విషాదచారికలుగా మిగులుతున్నప్పుడు- చదువు ఒక శవ పరీక్ష.
ఆధునిక పరీక్షిత్తుల పరి పరి పరీక్ష
ద్వాపర యుగం ముగింపు, కలి యుగం ప్రారంభంలో అర్జునుడి మనవడు, అభిమన్యుడు- ఉత్తరల కొడుకు అయిన పరీక్షిత్తు ఒకడే. ఉత్తరా గర్భంలో, పుట్టగానే శ్రీకృష్ణుడి కోసం పరీక్షగా వెతకడంతో పరీక్షిత్తుకు ఆ పేరొచ్చింది. ఇప్పుడు తల్లి గర్భంలో, పుట్టగానే ఎన్నెన్ని విషమ పరీక్షలను ఎదుర్కోవాలో అన్న భయంతో పుట్టిన, పుడుతున్న, పుట్టి పెరుగుతున్న, పుట్టబోయే ప్రతి ఒక్కరూ పరీక్షిత్తులే! విధి వంచితులు కాకుండా…లీకు కాని పరీక్ష రాయడం ఒక యోగమే!! – పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article