కేసీయార్‌ను అలా చూడాలని ఉంది… ఎలా..?
విద్యుత్తుపై ఏర్పాటు చేయబడిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఏర్పాటే చట్టవిరుద్దమని హైకోర్టుకు వెళ్తే, కోర్టు కొట్టేసింది కదా… ఇప్పుడిక సుప్రీంకోర్టుకు పోతాడేమో… అదీ భిన్నంగా చెబుతుందని అనుకోను… కేసీయార్ ప్రయత్నాలు వృథా అని మనం కూడా ఆల్రెడీ ఓసారి చెప్పుకున్నాం… (మరోవైపు కవిత పిటిషన్‌ను కూడా ఢిల్లీ కోర్టు కొట్టేసింది… మహిళ అని సానుభూతి చూపలేం, నిందితురాలు అనేందుకు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి, పైగా సాక్షుల్ని ప్రభావితం చేసే పలుకుబడి ఉందని వ్యాఖ్యానించింది… సరే, అదంతా వేరే కథ…)
ఇప్పుడు విద్యుత్తు కమిషన్ మళ్లీ నోటీసులు ఇస్తుంది… లేదా లేఖ రాస్తుంది… ఎవరైతే కేసీయార్ నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ తమ వాదనలు వినిపించారో వాళ్లను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కేసీయార్‌కు పర్మిషన్ ఇస్తారని వార్త… వాళ్ల వాదనల్ని కమిషన్ పరిగణనలోకి తీసుకుని, స్వీకరించి, వాటిల్లో మెరిట్, డీమెరిట్ తనే ఓ నిర్ణయానికి వస్తే సరిపోతుందేమో, కానీ మామూలు కోర్టు కేసుల్లో సాక్షుల్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిట్ చేసినట్టే… ఇక్కడా కేసీయార్‌కు ఓ అవకాశం ఇవ్వడం అన్నమాట… వోకే… అది కమిషన్ ఇష్టం… ఆ చర్చ లోతుగా ఇక్కడ అనవసరం…
Ads
ఎవరెవరు కేసీయార్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వాదనలు వినిపించింది..? ట్రాన్స్‌కో ఇంజనీర్ రఘు, ఎం.తిమ్మారెడ్డి, ఎం.వేణుగోపాలరావు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం… తిమ్మారెడ్డి, కోదండరాంలను వదిలేసినా… రఘు, వేణు విద్యుత్తు అంశాలపై సాధికారంగా, అన్నికోణాల్లో అధ్యయనాలు చేసి, సొసైటీ పక్షాన నిలిచేవారే, గతంలో అనేకసార్లు రెగ్యులేటరీ కమిషన్ ఎదుట నిశిత వాదనలు వినిపించినవారే…
కేసీయార్ గనుక ఈ క్రాస్ ఎగ్జామిన్ చాన్స్ వాడుకోదలిస్తే… తను అడుగుతుంటే, వీళ్లిద్దరూ జవాబులు చెబుతూ, ఎదురు ప్రశ్నలు వేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది… ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే..? గుర్తుందా…
కాళేశ్వరం మార్పుల మీద… నేనే రీడిజైన్ చేస్తున్నా, నేనే విశ్వేశ్వరయ్య స్థాయి ఇంజినీర్‌ను అన్న రేంజులో అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చాడు కదా… ఎవరినీ మాట్లాడనివ్వడం లేదు కదా… సాగునీటి శాఖ ఇంజినీర్లలాగే కాంటూరు లెవల్స్ నుంచి బ్యారేజీల పటిష్టత, డిజైన్ల దాకా ప్లాన్ చేసిన ఈ ఇంజినీర్… యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లు, చత్తీస్‌గఢ్ కరెంటు, పవర్ గ్రిడ్ కారిడార్ దాకా ఓ పెద్ద విద్యుత్తు ఇంజనీర్‌గా ఏం జవాబులు చెబుతాడో చూడాలని ఉంది… పిట్ హెడ్ ప్లాంట్లకు బదులు గనులకు దూరంగా ప్లాంటు దేనికి..? సూపర్ క్రిటికల్ యుగంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ దేనికి..? ఈ ప్రశ్నలు మొదలుకొని అనేక ప్రశ్నలపై తను క్రాస్ ఎగ్జామిన్ ఎలా చేయగలడో చూడాలని ఉంది…
ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయలోపాల మీద కూడా ఓ కమిషన్ ఇలాగే పిలిస్తే… అక్కడ కూడా ఏం ప్రజెంటేషన్ ఇస్తాడో కూడా చూడాలని ఉంది… సీఎం హోదాలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు, నామమాత్ర ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా చేసి, దబాయించి తన వాదనలు కరెక్టే అనే చిత్రాన్ని ఆవిష్కరించిన కేసీయార్… ఓ చట్టబద్ధమైన విచారణ కమిషన్ ఎదుట ఓ ‘బాధ్యుడిగా’ నిపుణుల ప్రశ్నలకు ఎలా జవాబు చెబుతాడో చూడాలని ఉంది…! దేశంలో ఏర్పడిన చాలా విచారణ కమిషన్లు, విచారణల తీరుకు భిన్నంగా, విశిష్టంగా ఈ క్రాస్ ఎగ్జామిన్ జరిగితే చూడాలని ఉంది…!!
Share this Article