చిన్న వార్తే అంటారా..? వోకే… అబ్బే, సముద్రంలో కాకి రెట్ట అంటారా..? వోకే… కొడుకు పెళ్లి భారీ ఖర్చును మన మీద రుద్దేందుకు జియో టారిఫులు పెంచాడు తెలుసా అంటారా..? వోకే… అంత వరల్డ్ టాప్ టెన్ రిచ్చు… సొసైటీకి ఏమిచ్చాడు అంటారా..? వోకే…
ఏం చెప్పినా సరే, ఎంత చిన్న ఔదార్యమైనా సరే, స్వాగతిద్దాం… అంతకుమించి మనం అడిగినా ఆయనేమీ చేయడు, పక్కా వ్యాపారి, పక్కా గుజరాతీ వ్యాపారి… కొన్ని ఫోటోలు, ఆ వార్త చూశాక అనిపించింది ఇదే… దక్కిందే మహాభాగ్యం, సమాజానికి ఆయన చేసిందే ఔదార్యం అని మురిసిపోవడమే…
విషయం ఏమిటంటే..? ఈమధ్య బాగా ట్రోలింగ్ సాగుతోంది కదా… కొడుకు పెళ్లికి మస్తు ఖర్చు పెట్టి, ఆ ఖర్చంతా జియో టారిఫ్ పెంచడంతో వసూలు చేసుకుంటున్నాడని… (నిజానికి పరమ అధ్వాన్నంగా సర్వీస్ ఉండే ఎయిర్‌టెల్ కూడా టారిఫ్స్ పెంచింది… అంటే జియో మేలిరకం అని సర్టిఫికేట్టేమీ కాదు…)
Ads
ఈ విమర్శలకు విరుగుడు ఏమిటో, దిష్టి తీయడం ఏమిటో ముఖేష్ అంబానీకి బాగా తెలుసు… అందుకే ఏం చేశాడు..? సామూహిక వివాహాలను తన ఖర్చుతో జరిపించాడు… ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే పాల్ఘర్ ఏరియాలో 50 పేద జంటలకు తనే పెళ్లిళ్లు జరిపించాడు… రిలయెన్స్ కార్పొరేట్ పార్కులోనే నిర్వహించిన ఈ ఉత్సవానికి (?) ఆ జంటల బంధువులు, దగ్గరి స్నేహితులు దాదాపు 800 మంది హాజరయ్యారు…
ఈ తరహా సామూహిక వివాహాలు ఇకపై ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని ముఖేష్ అంబానీ కుటుంబం ప్రతిన బూనింది… ఈ ఫంక్షన్‌కు ముఖేష్ అంబానీ, భార్య నీతా అంబానీ, ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు… ఒక్కొక్క జంట దగ్గరకు వెళ్లి మరీ ఆశీస్సులు అందచేశారు… అన్ని జంటలకూ బంగారు ఆభరణాలు (మంగళసూత్రాలు, ఉంగరాలు, ముక్కుపుడకలు ప్లస్ వెండి మెట్టెలు, వెండి పట్టాగొలుసులు) ఇచ్చారు… అంతేకాదు, స్త్రీధనం కింద వధువులకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు ఇచ్చారు…
అవే కాదు, ఒక ఏడాదికి సరిపడా వంట సరుకులను కూడా ఇచ్చారు… అందులో 36 రకాల వంటపాత్రలు (గ్యాస్ స్టవ్, మిక్సర్, ఫ్యాన్, పరుపులు, దిండ్లతో పాటు)… పెళ్లికి వచ్చిన బంధుగణం, స్థానిక స్వచ్చంద కార్యకర్తలకు పెద్ద విందును కూడా ఏర్పాటు చేశారు… స్థానిక సంప్రదాయ తర్ప డాన్స్ ఏర్పాటు చేశారు… అవును, బాగానే చేశారు అంటారా..? అంతే కదా… దిష్టి తీయడానికి పెద్ద ఖర్చేం ఉంటుందని..!!
Share this Article