హఠాత్తుగా కొందరు సోషల్ మీడియాలో స్టార్లు అయిపోతారు… కొన్నాళ్లుగా చూస్తే బర్రెలక్క, పల్లవి ప్రశాంత్, కుమారి ఆంటీ ఇలా… సరే, బర్రెలక్కకు ప్రచారం నిరుద్యోగం అనే సమస్యను ఫోకస్ చేయడానికి ఉపయోగపడింది… ప్రముఖులు కొందరు ఆమె వెంట నిలిచారు… ఎన్నికలయ్యాక అయిపోయింది…
పల్లవి ప్రశాంత్… బిగ్‌బాస్‌లో రైతు బిడ్డను, గెలిచిన డబ్బు రైతులకు పంచుతాను వంటి మాటలతో వోట్లు పొంది, గెలిచి, తరువాత శాంతి భద్రతల సమస్యలకు కారకుడై, కేసులకు గురై… వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నాడట… సరే, ఈ కేరక్టర్ కూడా కనుమరుగైనట్టే ఇక… సోషల్ మీడియా హైప్ ఎలా ఎగిసిపడి, ఎలా విరిగిపడుతుందో చెప్పడానికి ఒకటీ రెండు ఉదాహరణలు…
కుమారి ఆంటీ… అలియాస్ దాసరి సాయి కుమారి… హఠాత్తుగా వెలుగులోకి వచ్చింది… పోలీసులు ఆమె ఫుడ్ స్టాల్ ఆపేయడం, తరువాత సీఎం జోక్యం ఎట్సెట్రా అందరికీ తెలిసిందే… ఈ ప్రచారంతో టీవీ షోలకు వెళ్లి, ఎన్నికల ప్రచారాలకు వెళ్లి కొన్నాళ్లు హడావుడి… నిజానికి ఆమెలాగా బోలెడుమంది స్త్రీలు ఫుడ్ స్టాళ్లు పెట్టుకుని కష్టపడుతున్నారు, కుటుంబాల్ని పోషిస్తున్నారు… మరి ఆమెకే ఎందుకు ఈ ప్రయారిటీ, పబ్లిసిటీ…? ఏమో, కొన్నింటికి జవాబులు దొరకవు…
Ads
తీరా ఆరా తీస్తే… ఫుడ్ పెద్ద చెప్పుకోదగిన టేస్టీ ఫుడ్ కాదని చాలామంది చెబుతున్నారు… రేట్లు ఎక్కువ… హైజినిక్ వాతావరణం కాదు… ఆమె ప్రభుత్వానికి ఏమీ చెల్లించదు… పెరిగిన గిరాకీకి తగినట్టు ఓ రెస్టారెంట్ తరహా ఎస్టాబ్లిష్‌మెంట్ వైపూ వెళ్లడం లేదు ఆమె… అదే రోడ్డు పక్కన స్టాల్… ఇదంతా ఎందుకు చెప్పడం అంటే…
నటుడు సోనూ సూద్ ఆమె స్టాల్ వద్దకు వెళ్లాడు, సెల్ఫీ దిగాడు… ఏవో నాలుగు మాటలు సరదాగా మాట్లాడి కుమారి ఆంటీకి మరింత పబ్లిసిటీ తీసుకొచ్చాడు… సోనూ సూద్ ఔదార్యం రేంజ్ ఏమిటో కరోనా టైమ్‌లో చూశాం… అలాంటిది తను ఈ స్టాల్ దగ్గరికి వెళ్లినట్టు..? ఆమె ఎందులో గొప్ప సోనూ సూద్..? ఏదో స్త్రీ శక్తికి తార్కాణం, సొంతంగా ఎదిగింది అంటాడు… ఎస్, సొంతంగా ఓ ఫుడ్ స్టాల్ పెట్టుకుని తన కాళ్ల మీద తను నిలబడి, కుటుంబాన్ని పోషించుకోవడం వరకూ వోకే…
కానీ..? ఆ కుమారి ఆంటీ స్టాల్‌కే ఎందుకు వెళ్లడం..? ఆల్రెడీ ఆమె పాపులర్ కదా, ఇంకా హైప్, పబ్లిసిటీ వల్ల సొసైటీకి ఏం ఫాయిదా..? సోనూ సూద్‌కున్న దానకర్ణుడు అనే ఇమేజీకి ఈ అనవసర హంగామాకు లంకె కుదరదు… పైగా సోనూ సూద్ వెజిటేరియన్, ఆ ఫుడ్‌నే ప్రమోట్ చేస్తుంటాడు… ఈ ఫుడ్ స్టాల్ నాన్ వెజ్ ఫుడ్‌కు ఫేమస్…
ప్చ్, ఏమిటి సోనూ సూద్ భాయ్..? తప్పు అని కాదు, కాకపోతే నిరర్థకం… అందుకే నీ సందర్శన జీర్ణం కావడం లేదు… ఆంటీ ఫుడ్‌లాగే..!! ఆమె స్టాల్‌కు వెళ్లడం ద్వారా నువ్వు ఒకరోజు వార్తల్లోకి రావడం మినహా మరేమీ లేదు… చూడబోతే వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఏదైనా పార్టీ టికెట్టు ఇచ్చేట్టు కనిపిస్తోంది ఆమెకు..!! అన్నట్టు, అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమె స్టాల్ దగ్గరకు వస్తానని ఏదో ట్వీట్ చేసినట్టు గుర్తు… రేవంతన్నా, నీ సందర్శన బాకీ ఉంది..!!
Share this Article