కథారాజమోళీయం — రాజమౌళి గొప్ప దర్శకుడంటారు గానీ నిజానికి గొప్ప మార్కెటీర్. తన కథను అంచలంచెలుగా పైకి నెట్టుకోవడంలో అతనొక మహా సిసిఫస్.
ముందుగా తనొక కథ అనుకుంటాడు. దాని గురించి పదిమంది ప్రముఖులతో చర్చిస్తాడు. దీన్ని మార్కెటింగ్ లో api అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫెస్ అంటారు. స్క్రిప్ట్ బౌండ్ తయారయ్యాక ఆ పదిమందికి మరో పదిమందిని కలిపి అందరికీ దాన్ని పంపి అభిప్రాయం అడుగుతాడు .
కొందరు చదివీ చదవనట్టుగా చదివి బాగుందంటారు. కొందరు బాగుందని అనిపించకున్నా బాగుందంటారు. కొందరు చదవకుండా బాగా ఉందంటారు. దీన్ని మార్కెటింగ్ లో wom వర్డ్ అఫ్ మౌత్ అంటారు. అప్పుడిక ప్రెస్ మీట్ పెట్టి కథను బహిరంగం చేస్తాడు. కథలో ఏమీ లేకున్నా ఇలా చెప్పేయ్యడమ్ ఒక ట్రిక్. దీన్ని SSE సింపుల్ షాక్ ఎలిమెంట్ అంటారు.
Ads
సినిమా రెడీ. ఇందాకటి ఇరవై మందికి మరో ఇరవై మందిని కలిపి వాళ్లకు ప్రదర్శన పెడతాడు. పెద్దవాడు కదా అని వాళ్ళు వహ్వాలు కొడతారు. తాను పెద్దవాడినని వాళ్లకు భ్రమ కల్పించడం కూడా అమ్మకం మోళీ లో భాగమే. విడుదల రోజు మార్నింగ్ షో రెస్పాన్స్ చూసి బెడిసి కొట్టంగానే ప్లాన్ E లోకి దిగిపోతాడు. దీన్ని CTA కాల్ టు యాక్షన్ అంటారు.
ఇందాకటి నలభై మందితోపాటు ఇంకొందరికి ఫోన్లు చేస్తాడు. తన సినిమా ఎంత గొప్పదో ఫోన్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాడు. ఓ మంచిమాట లోకానికి చెప్పండి రేపటి కోసం అని హెచ్చరిక్వెస్ట్ చేస్తాడు. వాళ్ళందరి ముందుకు లోగోలు వెళ్ళిపోతాయి. పెద్దోడనే భ్రమ అలాగే ఉంది కదా. ప్రశంసలు కుప్పలు తెప్పలొస్తాయి. నో అన్నవారి నోళ్లకు తాళాలేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఇదే అవకాశంగా ఎడా పెడా పొగిడించేసుకుంటాడు. దీన్ని SEO సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటారు.
500 కోట్లతో 2000 కోట్లు చేసే బాహుబలికైనా 25 కోట్లతో 100 కోట్లు చేసే మర్యాదరామన్నకైనా ఇదే మార్కెట్ మంత్ర. ఇదే రాజమోళీయం. ఇంత చేసినా పదో తొమ్మిదో సూపర్ డూపర్ హిట్లివ్వగలిగాడు కానీ గొప్ప సినిమా మాత్రం తీయలేకపోయాడు. ఆ రాయిని పైదాకా నెట్టలేనప్పుడు వచ్చేదాన్నే సిసిఫస్ట్రేషన్ అంటారు. అదే మార్కెటింగ్ అనే మాటకున్న నెగెటివ్ అర్ధం.
….
అస్వీకరణ. …………… తెలుగు సాహిత్యలోకంలోనూ కథారాజమోళీలున్నాయి మరి!……… ( By ప్రసేన్ బెల్లంకొండ )
ఈ చివరి వాక్యం ఎవరికి తగలాలని రాయబడిందో మాకు మాత్రం తెలియదు, ఎవరు భుజాలు తడుముకున్నా మాకు సంబంధం లేదు… ముచ్చట
Share this Article