Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏటా లక్షకు 12 మంది… పెరిగిన ఆత్మహత్యలు మరో సామాజిక విపత్తు…

July 13, 2024 by M S R

జీవితం అంటే గెలుపు; జీవితమంటే సుఖం; జీవితమంటే శిఖరారోహణం… అని మన నరనరాన ఎక్కించుకున్నాం. జీవితమంటే ఎడతెగని ప్రయాణం. గెలుపోటములు, ఎగుడు దిగుళ్లు, కష్టనష్టాలు సహజం అని అర్థం చేసుకోవడం ఎప్పుడో మానేశాము.

దూరం బాధిస్తున్నా…పక్షి విశ్వాసం రెక్కలు విప్పుతూనే ఉంటుంది.
అలలను సవాలు చేసి…చేప పిల్ల ఈదుతూనే ఉంటుంది.
గ్రీష్మంలో ఎండిన కొమ్మే చైత్రంలో చిగురించి…ప్రకృతికి పట్టు చీరల సారె పెడుతుంది.
మావి చిగురుకోసం కోయిల నిరీక్షిస్తూ ఉంటుంది.
కోయిల పిలుపు కోసం మావి కొమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది.
చీకటి రాత్రి కొమ్మ మీదే రేపటి వెలుగుల సూరీడు ఎదురుచూస్తూ ఉంటాడు.
కష్టాల వెంట సుఖాలు; సుఖాల వెంట కష్టాలు; కష్టాల వెంట కష్టాలను తలచుకుని తలచుకుని బాధపడుతూ ఉంటే…గుండె మరింత బరువెక్కి దిక్కుతోచదు.

జీవితమంటే బరిలో గిరిగీసి నిలవడం.
జీవితమంటే బతికి…బతికించడం.
జీవితమంటే మనను మనమే నడిపించుకోవడం.
మన యుద్ధం ఇంకెవరో చేయరు.

Ads

అవతారమూర్తి అయిన సీతమ్మను కూడా ఇలాంటి కష్టాలే చుట్టు ముట్టాయి. ఆమెకూడా ఆత్మహత్య చేసుకుందామని జడను మెడకు కట్టుకుని కొమ్మకు బిగించుకోబోయింది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన మాట కష్టాలెదుర్కొనేవారికి శ్రీరామరక్ష.

వాల్మీకి రామాయాణం. సుందరకాండ. హనుమంతుడు సునాయాసంగా వందయోజనాల సముద్రం దాటి, చీకటి పడేదాకా ఆగి, పిల్లి పిల్లంత రూపంతో లంకంతా వెతికాడు. సీతమ్మ కనిపించలేదు. చాలా నిరుత్సాహపడ్డాడు. ఇంత దూరం ఎగిరివచ్చి ప్రయోజనం లేకుండా పోయిందే అని బాధపడ్డాడు.

లంకలో సీతమ్మ కనిపిస్తోంది అని జటాయువు సోదరుడు సంపాతి చెప్పాడు కదా! మరి నాకెందుకు కనిపించలేదు? అని మథనపడ్డాడు. వట్టిచేతులతో వెనక్కు వెళ్లి రాముడికి, సుగ్రీవుడికి ఎలా మొహం చూపించాలి అని విసుక్కున్నాడు. నిర్వేదంతో డీలా పడిపోయాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. నేను చూడగలను అనుకోవడం తప్పు. సీతమ్మే నన్ను కరుణించి…కనిపించాలి అని ప్రార్థించి తనను తాను ఉత్సాహపరుచుకున్నాడు. ఆ సందర్భంగా హనుమ అన్న మాట ఇది.

“అనిర్వేదః శ్రియో మూలమనిర్వేదః పరం సుఖమ్.
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః”

అర్థం:- నిర్వేదం లేకపోడమే శ్రేయస్సు. నిర్వేదం లేకపోవడమే అన్ని సుఖాలకు మూలం. నిర్వేదం లేనివారే అన్నివేళలా అన్నిపనులు చక్కబెట్టుకోగలరు.

ఇలా అనుకోగానే హనుమకు దూరంగా అశోకవనంలో శింశుపావృక్షం చెట్టు కింద బంగారు అరుగుమీద సీతమ్మ కనిపిస్తుంది. తీరా దగ్గరికెళ్లి ఆ చెట్టు కొమ్మ మీద కూర్చునేసరికి రావణాసురుడు తప్ప తాగి వచ్చి కారుకూతలు కూస్తూ ఉంటాడు. పది నెలలు ఓపిక పట్టాను. ఇంకో రెండు నెలలు గడువిస్తున్నా. మనసు మార్చుకుని నా అంతఃపురంలోకి వచ్చావా సరి. లేదంటే ఆ మరుసటి రోజు నిన్ను ముక్కలుచేసి ఉదయం ఫలహారంలో తింటా అంటాడు.

రావణాసురుడి మాటలకు సీతమ్మకు కన్నీళ్లు పొంగి వచ్చాయి. కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంది. పదినెలలుగా సీతమ్మ పడ్డ కష్టాలు, అవమానాలు అన్నీ ఇన్నీ కాదు. రావణాసురుడి మాటలు గుండెను రంపపుకోతలా కోస్తున్నాయి. దుఃఖం పొంగుకొస్తోంది. పది నెలలుగా ఊపిరి బిగబట్టుకుని…ఆశను ఉగ్గబట్టుకుని నిరీక్షించింది. ఇక ఆశ సన్నగిల్లింది.

రాముడు ఉన్నాడో లేడో, వస్తాడో రాడో ఎలాంటి సమాచారం లేదు. దేశం కాని దేశంలో అయిదు వందల మంది పరమ వికృతమయిన రాక్షస స్త్రీల మధ్య అన్నాళ్ళు ఉండడమే ఊహకందని విషయం. నా కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఇక బతికి ఉండి లాభం లేదనుకుని అంతులేని నైరాశ్యంలో సీతమ్మ తనువు చాలించాలని నిర్ణయం తీసుకుంది. కూర్చున్న చెట్టు కొమ్మకే ఉరి వేసుకోవాలనుకుంది. కనీసం మూడడుగుల తాడయినా కనిపించలేదు.

తన పొడవాటి జడనే కొమ్మకు వేసి మెడకు బిగించుకుందామనుకుంది. కొమ్మకు జడను చుట్టగానే ఆంజనేయస్వామి మెరుపువేగంతో స్పందించాడు.

“అయోధ్య రాజు దశరథుడు. ఆయన పెద్ద కొడుకు రాముడు. తండ్రి మాటకు కట్టుబడి రాముడు వనవాసానికి బయలుదేరితే సీతమ్మ, లక్ష్మణులు వెంట వచ్చారు. దండకారణ్యంలో ఉండగా రావణాసురుడు సీతమ్మను అపహరించుకుని వెళ్లాడు. రాముడు సుగ్రీవుడు సీతాన్వేషణలో భాగంగా హనుమనయిన నన్ను ఇక్కడికి పంపారు”

అని ఏమి చెబితే మరుక్షణం ఆమె ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకుంటుందో అంత స్పష్టంగా, పద్ధతిగా, వరుసగా, లౌక్యంగా, అనునయంగా చెప్పాడు. హనుమ మాటలతో సీతమ్మకు పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది. మెల్లగా కొమ్మ దిగిన హనుమ మిగతా తతంగమంతా వినయంగా, ఒక గొప్ప దౌత్యవేత్తలా చక్కబెట్టాడు.

సీతమ్మకు రామనామాంకిత ఉంగరమిచ్చాడు. సీతమ్మ శిరసు మాణిక్యం రాముడికి ఇవ్వడానికి తీసుకున్నాడు. ఆత్మ హత్యా ప్రయత్నం విరమించుకుని హనుమ మాటలతో కుదుటపడ్డ సీతమ్మ ఈ సందర్భంలో చెప్పిన గొప్ప మాట ఇది.

“కల్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతి మే,
ఏతి జీవంత మానందో నరం వర్షశతాదపి”

మనిషికి వందేళ్ల ఆయుష్షు. తొంభై తొమ్మిదేళ్లు కష్టాలున్నా వందో సంవత్సరమయినా బాగుంటుందని ఆశతో బతకాలి. ఆశను బతికించుకోవాలి. రేపటి మీద ఆశను వదులుకోకూడదు. ఆనందాన్ని వెతుక్కోవాలి.

గోరంత దీపం సినిమాలో సినారె రాయగా కె వి మహదేవన్ స్వరపరచగా బాలసుబ్రహ్మణ్యం- సుశీల పాడిన అసాధారణమయిన పాట ఇది.

“గోరంత దీపం… కొండంత వెలుగు
చిగురంత ఆశ… జగమంత వెలుగు

కరిమబ్బులు కమ్మే వేళ.. మెరుపు తీగే వెలుగూ
కారు చీకటి ముసిరే వేళ.. వేగు చుక్కే వెలుగు

మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు
దహియించే బాధల మద్యన సహనమే వెలుగు

కడలి నడుమ పడవ మునిగితే… కడదాకా ఈదాలి
నీళ్ళు లేని ఎడారిలో…
కన్నీళ్ళైనా తాగి బతకాలి..

ఏ తోడు లేని నాడు… నీ నీడే నీకు తోడు
జగమంతా దగా చేసినా… చిగురంత ఆశను చూడు
చిగురంత ఆశ… జగమంత వెలుగు”

“ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా

నొప్పి లేని నిమిషమేది జననమైన
మరణమైన జీవితాన అడుగు అడుగునా
నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
దేహముంది ప్రాణముంది నెత్తురుంది
సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను
దీక్షకన్న సారధెవరురా
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా
నిన్ను మించి శక్తి ఏది నీకె నువ్వు బాసటైతే

నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల
రెక్కముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైనా ఈదుతున్న చేపపిల్ల
మొప్పముందు చిన్నదేనురా
పిడుగువంటి పిడికిలెత్తి ఉరుమువల్లె
హుంకరిస్తే దిక్కులన్నీ పిక్కటిల్లురా
ఆశయాల అశ్వమెక్కి అదుపులేని
కదనుతొక్కి అవధులన్నీ అధిగమించరా
త్రి విక్రమా పరాక్రమించరా
విశాల విశ్వమాక్రమించరా
జలధిసైతమాపలేని జ్వాల ఓలె ప్రజ్వలించరా”

రచన : సిరివెన్నెల

ప్రాణం ఉన్నంతవరకూ పోరాడాలి. ప్రాణం పోయేంతవరకూ పోరాడాలి. ప్రాణం పోతున్నా పోరాడుతూనే ఉండాలి. పోరాడుతూనే పోవాలి. పొతే చరిత్రగా మిగిలిపోవాలి. నీళ్లు లేని ఎడారుల్లో కన్నీళ్లయినా తాగి…నిలబడాలి. కరి మబ్బులు కమ్మినవేళ వేగు చుక్కల వెలుగును వెతికి పట్టుకోవాలి. చిగురంత ఆశను బతికించుకుని జగమంత వెలుగులమవ్వాలి. జగతికి వెలుగులు పంచాలి.

పాత కథనం. పునర్ముద్రణకు సందర్భం:-

మన దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యలమీద సర్వోన్నత న్యాయస్థానం కలుగజేసుకుని…ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసింది. 2022 జాతీయ నేరాల చిట్టా విభాగం (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) ప్రకారం ఒక్క సంవత్సరంలో భారత్ లో ఆత్మహత్యల సంఖ్య అక్షరాలా లక్షా డెబ్బయ్ ఒక్క వేలు. ప్రతి లక్షకు సగటున 12 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కారణాలేవైనా ఇదివరకు పెద్దవారే ఆత్మహత్యలు చేసుకునేవారు. ఇప్పుడు పెద్దా చిన్న; రాజూ పేద తేడా లేదు. చివరికిదో పెద్ద సామాజిక సమస్య అయ్యింది. ప్రపంచంలోనే ఆత్మహత్యల పద్దులో ఇప్పుడు భారత్ మొదటి స్థానంలో ఉంది… – పమిడికాల్వ మధుసూదన్    9989090018    

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions