అవార్డులు… వీటికి ఎంపికల విషయంలోనూ చాలా రాగద్వేషాలుంటాయి… వాణిజ్య అవసరాలుంటాయి… ప్రలోభాలు, పైరవీలు ఉంటాయి… కొన్ని సంస్థలు ఇచ్చే అవార్డులు ప్యూర్ దందాలు… స్కోచ్ అవార్డుల వంటివి… అంతెందుకు..? చివరకు ఆస్కార్ అవార్డులు కూడా లాబీయింగు ఆధారంగా ఇవ్వబడుతున్న ఉదాహరణలూ చెప్పుకున్నాం కదా…
సరే, అవార్డు ఎవరికి ఇవ్వాలో ఆయా సంస్థలు నిర్దేశిస్తాయి… పేరుకు ఏవో జ్యూరీల నిర్ణయం అని చెబుతాయి… ఆ అవార్డులు ఎవరి చేతుల మీదుగా ఇవ్వాలో కూడా ఆయా సంస్థల ఇష్టం… అవార్డులు ఇవ్వడానికి స్టేజీ మీదకు పిలవడంలో కూడా లెక్కలుంటాయి… అయితే సినిమా ఇండస్ట్రీలో కొన్ని పిచ్చి పంచాయితీలు తలెత్తుతుంటాయి, ఇలా అవార్డులు ఎవరి చేతుల మీదుగా తీసుకోవాలి అనే విషయంలో…
మనోరథంగళ్ ట్రెయిలర్ ఈవెంట్‌లో నటుడు ఆసిఫ్ ఆలీ నుంచి మ్యూజిక్ కంపోజర్ రమేష్ నారాయణ్‌కు ఓ మెమొంటో, ఏదో అవార్డు ఇప్పించాలని నిర్వాహకులు అనుకున్నారు… స్టేజీ మీదకు పిలిచారు… ఆసిఫ్ ఆలీ నుంచి తీసుకున్నాక కూడా సదరు రమేష్ నారాయణ్ ‘నాకు ఈ అవార్డును దర్శకుడు జయరాజ్ నుంచి తీసుకోవాలని ఉంది’ అన్నాడు బహిరంగంగానే… దీంతో జయరాజ్ స్టేజీ పైకి వచ్చాడు… తను అందచేశాడు, అది ఇచ్చే సమయానికి ఆసిఫ్ ఆలీ తనను అవమానించడంగానే భావించాడో ఏమో, వెళ్లిపోయాడు…
Ads
దీని మీద సోషల్ మీడియా సదరు మ్యూజిక్ కంపోజర్‌ను కుసంస్కారి, మేనర్స్ తెలియవంటూ ఓ ఆట ఆడుకుంది… నిజంగానే ఎవరికీ నచ్చలేదు… ఇచ్చినప్పుడు తీసుకుని వెళ్లిపోకుండా ఫలానా వ్యక్తి చేతుల మీదుగానే తీసుకుంటాను అనే పట్టింపు ఏమిటి..? ఇవ్వడమే ఎక్కువ…! తనపై సోషల్ మీడియా దుమారంతో నాలుక కర్చుకుని, అబ్బే, ఆసిఫ్ మంచి నటుడు, తనను హర్ట్ చేయాలని అనుకోలేదు, కానీ జయరాజ్ నుంచి తీసుకోవాలనే కోరికతో అలా చేశాను, సారీ’ అని సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నాడు రమేష్ నారాయణ్… చేతులు కాలాక..!!
ఇక సోషల్ మీడియా ఊరుకుంటుందా..? ఓ పాత వీడియోను తవ్వి తీసింది… వైరల్ చేసింది… నాడు నయనతార కూడా ఇలాగే అల్లు అర్జున్‌ను అవమానించింది అని మళ్లీ మొదలుపెట్టింది దాడి..! ఆ సందర్భం ఏమిటంటే..? అవి 2016 నాటి సైమా అవార్డులు… ఆ ఫంక్షన్‌లో నయనతారను ‘నానుమ్ రౌడీధాన్’ అనే సినిమాకు గాను ఉత్తమనటిగా ప్రకటించి, అవార్డు ఇవ్వాలని అల్లు అర్జున్‌ను వేదిక మీదకు పిలిచారు… ఆమె వచ్చింది, తీసుకుంది…
తరువాత మైకు తీసుకుని అవార్డును విఘ్నష్ శివన్ నుంచి తీసుకోవాలని ఉందని చెప్పింది… నిర్వాహకులు దానికేం భాగ్యం, అలాగే లేమ్మా అంటూ విఘ్నేష్‌ను వేదికపైకి పిలిచారు… తను వచ్చాడు, అప్పటికే ఆ అవార్డును అల్లు అర్జున్ చేతుల్లో పెట్టింది ఆమె… ఇక ఆ అవార్డును అల్లు అర్జున్ విఘ్నేష్‌కు ఇచ్చాడు, ఆయన నయనతార చేతుల్లో పెట్టాడు…
దీని మీద కూడా నయనతార మీద బోలెడు ట్రోలింగ్ సాగింది… కుసంస్కారి అని తిట్టిపోసింది సోషల్ మీడియా… నిజంగా ఆ సందర్భంలో అల్లు అర్జున్ చాలా హుందాగా, ఏమాత్రం సంయమనం కోల్పోకుండా అక్కడే నిలబడి అభినందించాడు… తను సంస్కారి కాబట్టి..! విఘ్నేష్, నయనతార బంధం తెలుసు కాబట్టి లోలోపల నవ్వుకుని, అలాగే అన్నట్టు సైలెంటుగా ఉండిపోయాడు… ఇప్పుడు ఆ పాత వీడియోను వైరల్ చేస్తూ, తాజా రమేష్ నారాయణ్- ఆసిఫ్ ఆలీ సంఘటనను కూడా జోడించి సోషల్ మీడియా మళ్లీ ఆడుకుంటోంది…!!
Share this Article