సేల్స్ టాక్స్ డిపార్టుమెంటు అంటే కేవలం అమ్మకపు పన్ను మదింపు చేసే డిపార్టుమెంటు మాత్రమే కాదు. సేల్స్ టాక్స్ డిపార్టుమెంటు అన్నా కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంటు అన్నా రెండూ ఒకటే.
1957 లో ఆంధ్రప్రదేశ్ సాధారణ అమ్మకపు పన్నుల చట్టం అమలు చేసినప్పుడు కేవలం వ్యాపారులు అమ్మకం జరిపిన వస్తువులపైనే పన్ను వసూలు చేసారు. కానీ, కాలక్రమేణా, పెరుగుతున్న వ్యాపార లావాదేవీల సంక్లిష్టతను గమనించి, కేవలం అమ్మకం మీదనే కాకుండా, కొనుగోలు మీద కూడా పన్ను విధించవలసిన ఆవశ్యకత ఏర్పడింది.
అంటే ఉదాహరణకు, రైతు వరి పండిస్తాడు. ఆ తరువాత ఆ వరి ధాన్యాన్ని వ్యాపారులకు అమ్ముకుంటాడు. కానీ, ఆ లావాదేవీల పైన అమ్మకపు పన్ను చెల్లించాలంటే, రైతుకు కష్టమవుతుంది. అందుకని, ఆ లావాదేవీల పై, వ్యాపారి కొనుగోలు పన్ను (purchase tax) చెల్లించే విధంగా చట్టంలో మార్పులు చేసారు.
Ads
అలాగే, మరి కొన్ని వస్తువులపై కొనుగోలు పన్ను ఉంటుంది. ఎగుమతుల మీద పన్ను మినహాయింపు ఉంటుంది. ఇతర రాష్ట్రాల అమ్మకాలపై రెండు మూడు రకాల పన్నులు ఉంటాయి కాబట్టే, అమ్మకపు పన్ను చట్టవిరుద్ధం స్వభావాన్ని మార్చి, కమర్షియల్ టాక్సెస్ గా వ్యవహరించడం ప్రారంభించారు.
వస్తువుల అమ్మకం, కొనుగోలు మీదనే కాకుండా, ఇంతకు ముందు చెప్పినట్టుగా వినోదపు పన్ను, వృత్తి పన్ను (Profession Tax) వసూలు కూడా కమర్షియల్ టాక్స్ అధికారుల మీదనే ఉంటుంది. వృత్తి పన్ను బాధ్యత డీసీటీవోలకు అప్పగించబడింది.
నా బ్యాచ్ లో మొత్తం తెలంగాణ అంటే, 5, 6 జోన్లలో, మెరిట్ లిస్టులో నేనే మొట్టమొదటి స్థానంలో ఉన్నా నాకు డీసీటీవో ప్రమోషన్ ఇవ్వకుండా, క్లర్క్ స్థాయి నుండి వచ్చి, ఏసీటీవోలు అయిన వారికి ప్రమోషన్లు ఇవ్వడంతో నేను ట్రిబ్యునల్ కు వెళ్తే నాకు అనుకూలంగా తీర్పు రావడంతో, నాకు డీసీటీవో ప్రమోషన్ ఇవ్వాల్సి వచ్చింది.
నేను హన్మకొండ డీసీటీవో గా ఛార్జ్ తీసుకున్న తర్వాత, అన్ని ఫైళ్ళను పరిశీలించి, వృత్తి పన్ను విభాగంలో పన్నుల వసూలు చాలా నిరుత్సాహంగా ఉందని గమనించాను. అన్ని రికార్డులు పరిశీలించిన తర్వాత, నా పరిధిలో (jurisdiction) ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయం ఉద్యోగుల నుండి గత ఐదేళ్ళుగా వృత్తి పన్ను వసూలు చేయడం లేదని గమనించాను. ఎందుకు వసూలు చేయడం లేదని ప్రశ్నిస్తే, ఎవ్వరూ సరైన సమాధానం చెప్పలేదు.
నేను విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కు, వారం రోజుల్లో హాజరు కావాలని సమ్మన్స్ జారీ చేసాను. వృత్తి పన్ను అధికారిగా నేను ఎవ్వరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. నా సమ్మన్స్ కు ఎటువంటి సమాధానం రాలేదు. దాంతో నేను స్వయంగా వెళ్ళి, రిజిస్ట్రార్ గారిని కలిసి విషయం చెపుదామని ప్రయత్నించాను. కానీ, ఆ రిజిస్ట్రార్ గారు నన్ను కలవడానికి కూడా అనుమతి ఇవ్వలేదు.
నేను, చట్ట ప్రకారం, మరో రెండు సార్లు సమ్మన్స్ జారీ చేసాను. వాటికి కూడా సమాధానం రాలేదు. నేను, మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ వివరాల ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒక్కొక్క ఉద్యోగి చెల్లించ వలసిన మొత్తం లెక్క వేస్తే, యూనివర్సిటీ ఉద్యోగుల నుండి రావలసిన సుమారు 25 లక్షల డిమాండ్ నోటీసు తయారు చేసి, రిజిష్టర్డ్ పోస్టు మరియు అటెండర్ ద్వారా వ్యక్తిగత సర్వీసుకు పంపాను. మనం సర్వ్ చేసిన నోటీసు పైన అక్నాలెడ్జ్మెంటు తప్పని సరిగా ఉండాలి.
దానికి కూడా సమాధానం రాలేదు. మరొకసారి ఫైనల్ డిమాండ్ నోటీసు కూడా జారీ చేసాము. దానికి కూడా ఎటువంటి స్పందన లేదు. కాకతీయ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ విభాగం నిర్లక్ష్యానికి నాకు ఆశ్చర్యం వేసింది.
మరొక పక్క నాకు బాధ కూడా కలిగింది. ఎందుకంటే, అదే విశ్వవిద్యాలయంలో నేను చదువుకున్నాను. పన్నులు చెల్లించని వారిలో నాకు విద్యాబోధన చేసిన అనేక మంది ప్రొఫెసర్లు, రీడర్లు, లెక్చరర్లు ఉన్నారు. మాకు D. O. M లో మేనేజ్మెంటులో, అధికారులు నిర్వర్తించవలసిన బాధ్యతల గురించి చెప్పిన టీచర్లంతా ఉన్నారు.
యూనివర్సిటీ అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పరిశోధిస్తే, వారికి మా డిపార్టుమెంటు ఉద్యోగే, ‘ఏం కాదు, ఎవ్వరేమీ చేయలేరని’ హామీ ఇచ్చినట్టుగా తెలిసింది.
ఇంతకు ముందు ఎపిసోడులో చెప్పినట్టుగా, మా చట్టం పకడ్బందీగా పన్నులు వసూలు చేసే అధికారాలు ఇచ్చింది. కానీ, వాటిని వినియోగించాలంటే, చాలా మంది అధికార్లు భయపడతారు. కోర్టు కేసుల్లో ఇరుక్కుంటామని, పై అధికారుల కోపానికి గురవుతామని సంశయిస్తుంటారు. కొంత మంది ధైర్యంగా ముందుకు వెళ్తారు.
నేను కాకతీయ యూనివర్సిటీకి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసి చాలా మంది నన్ను హెచ్చరించారు. వెనుకకు లాగారు. ‘నువ్వు చదువుకున్న విశ్వవిద్యాలయానికే ద్రోహం చేస్తావా?’ అని నిందించారు. నేను వారిని పట్టించుకోలేదు. మరొక సారి డిమాండ్ నోటీస్ పంపించి 24 గంటల్లోపల, డిమాండ్ చేసిన వృత్తి పన్ను చెల్లించకుంటే, తీవ్రమైన, కఠినమైన చర్యలు ఉంటాయని తెలిపాను. దానికి కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు.
అందుకే, నేను ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాను. మనసులో భయమూ, బాధా కలుగుతున్నా ఆ పని చేయక తప్ప లేదు. వృత్తి పన్ను చట్టం ప్రకారం పన్నులు చెల్లించని వ్యక్తుల /సంస్థల నుండి RR Act (Indian Revenue Recovery Act) నిబంధనల ప్రకారం పన్నులు వసూలు చేసింది అధికారం మాకుంది.
నేను అతి రహస్యంగా, స్వయంగా నేనే బ్యాంకులకు గార్నిషియా (Garnicia) నోటీసులు తయారు చేసి, ఆ నెల ముప్ఫై ఒకటో తేదీ వరకు ఆగి, ఆ రోజు ఉదయమే, కాకతీయ విశ్వవిద్యాలయంకు ఖాతాలున్న అన్ని బ్యాంకుల మేనేజర్లకు, నోటీస్ నేనే స్వయంగా సర్వ్ చేసాను. మేనేజర్ సంతకం తీసుకుని, ఆ రోజు ఉదయం విశ్వవిద్యాలయం వారి ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని రాయించాము. నేను ఆ బ్యాంక్ ఖాతా సీజ్ చేసిన తర్వాత, సీజర్ నోటీసు ఉపసంహరించుకునేంత వరకు ఒక్క నయాపైసా కూడా విత్ డ్రా చేయడానికి వీలు లేదని, బ్యాంకు మేనేజర్లకు అర్థమయ్యేలా వివరించాను. దాదాపు ఐదు బ్యాంకులలోని, కాకతీయ విశ్వవిద్యాలయం ఖాతాలను స్థంభింప చేసాను.
ఒక్క అరగంటలో గగ్గోలు పుట్టింది. ఆ రోజు విశ్వవిద్యాలయ ఉద్యోగులకు జీతాలు పంచ వలసిన రోజు. కానీ, వైస్ ఛాన్సలర్ నుండి, ఆ విశ్వవిద్యాలయ పరిథిలో పనిచేసే అన్ని కాలేజీ ప్రిన్సిపాల్స్ తో పాటు నాల్గవ తరగతి ఉద్యోగుల వరకు జీతాలు ఆగిపోయాయి.
అప్పుడు, ‘ఆ డీసీటీవో ఎవడు? వాడికి మన జీతాలు ఆపే అధికారం ఏముంది?’ అని నన్ను బండ బూతులు తిట్టారు. మా ఉన్నత అధికారి, డిప్యూటీ కమీషనర్ దగ్గరకు వచ్చి ధర్నా చేసారు. ఆయన నన్ను పిలుస్తారని ముందే తెలుసు కాబట్టి నేను వెళ్ళి ఫైలు చూపించి ఆరు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని చెప్పడంతో ఆయన కూడా ఏమీ చేయలేక పోయారు.
తరువాత నన్ను యూనివర్సిటీకి రమ్మని రిజిస్ట్రార్, వీసీ ఫోన్ చేసారు. నేను రానని చెప్పాను. మినిస్టర్లు, ఎమ్మల్యేలు, పై అధికారుల నుండి ఫోన్లు వచ్చినా, నేను నిక్కచ్చిగానే నిలబడ్డాను. విధి లేక రిజిస్ట్రార్ నా ముందు హాజరయ్యారు. కొంచెం దర్పం ప్రదర్శించబోయాడు. విద్యా శాఖ మంత్రితో ఫోన్ చేయిస్తానని బెదిరించాడు. నేను, ‘చేయించండి! నేను మీ బండారమంతా బయట పెడ్తాను!’ అని ఘాటుగా సమాధానం చెప్పాను.
హైదరాబాదులోని మా హెడ్డాఫీసుకు కూడా ఫిర్యాదు చేసారు. కొంత మంది అధికారులు నోటీస్ విత్ డ్రా చేసుకోమని గద్దించారు. మా కమీషనర్ గారు మాత్రం, ‘యూ ప్రొసీడ్, ఐ విల్ టాక్ టు ది మినిస్టర్స్, ఇఫ్ నీడెడ్!’ అన్నారు. వారి అన్ని ప్రయత్నాలు వృధా కావడంతో సామరస్య ధోరణితో, పరిష్కరించమని అడిగారు. నేను వారికి,
“25 లక్షల బకాయిలలో, ఈ నెల పది లక్షలు, మిగతా పదిహేను లక్షలు తదుపరి రెండు నెలల్లో కట్టడానికి అనుమతించమని” ఒక లెటర్ రాయమని చెప్పాను. వారు తర్జనభర్జనలు చేసుకుని, ఒప్పుకున్నారు. నేను మా ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని, బ్యాంక్ అక్కౌంట్ల సీజర్ ను ఎత్తివేసాను. ప్రతీ నెల వెయ్యి రెండు వేలు వసూలయ్యే వృత్తి పన్ను మొత్తానికి అదనంగా, ఆ నెలలో, పది లక్షలు కలిసాయి. సంయుక్త రాష్ట్రంలో అదొక రికార్డు.
ఈ సంఘటనతో, నాకు మా డిపార్టుమెంటులోనే చాలా మంది శతృవులు ఏర్పడ్డారు. కానీ, నేను మాత్రం గొప్ప ఆత్మ సంతృప్తితో ఊపిరి పీల్చుకున్నాను. ఎందుకంటే, నెలకు 20 రూపాయల చొప్పున వృత్తి పన్ను చెల్లించడం పెద్ద కష్టం కాదు. కానీ, అడిగే వాడు లేకపోతే, అది కూడా ఎందుకు కట్టాలనే నిర్లిప్త ధోరణి…. డాక్టర్ ప్రభాకర్ జైనీ
Share this Article