It’s a musical and visual feast . కె యస్ ప్రకాశరావు మార్క్ సినిమా . వాణిశ్రీ-కృష్ణ జోడీలో కూడా చాలా మంచి సినిమాలు ఉన్నాయి . బ్లాక్ & వైట్ కాలంలో నుంచే ఉన్నాయి . వాటిల్లో ముందు వరుసలో ఉండే సినిమా 1975 లో వచ్చిన ఈ చీకటి వెలుగులు సినిమా .
ప్రేమనగర్ , సెక్రటరీ సినిమాల్లో లాగా కె యస్ ప్రకాశరావు వాణిశ్రీని అజంతా బొమ్మలాగా చూపిస్తారు . సినిమాలో సింహభాగం కులూలో తీసారు . కాశ్మీర్ ప్రకృతి సౌందర్యాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు . వాణీశ్రీతో పాటు మరో అందమైన హీరోయిన్ని చూపారు . పద్మప్రియను హేమమాలినితో పోల్చేవారు . తెలుగు , కన్నడ , తమిళ చిత్రాలలో ఎక్కువగా నటించింది . ఈ సినిమాలో బాగా అల్లరి చేస్తుంది .
(ఈమె బెంగుళూరు బేస్డ్. అసలు పేరు పద్మలోచని… కానీ తమిళంలో చాలా సినిమాలు చేసింది. కన్నడ, తెలుగు, మలయాళ సినిమాలు కూడా చేసినా తమిళంలో పేరొచ్చింది. పెళ్లయిన ఏడాదికే విడాకులు… వసుమతి అనే బిడ్డ, ఆమెను సినిమాల్లోకి తీసుకురావడానికి ట్రై చేసి ఫెయిలైంది… ఈమె ఫోటోలు, వివరాలు అరుదు…)
Ads
యుధ్ధభూమిలో గాయపడ్డ హీరో తన గతాన్ని మరచిపోతాడు . హీరోయిన్ తో పెళ్లి అయిపోతుంది . గతం గుర్తుకొచ్చాక జరిగిన పెళ్ళిని మరిచిపోతాడు . గతాన్ని గుర్తుకు తెచ్చి , మరలా జీవితం కొనసాగించటం సినిమా కధ టూకీగా . అక్కినేని నటించిన పవిత్ర బంధం సినిమా గుర్తుకొస్తుంది . ప్రముఖంగా మెచ్చుకోవలసింది సంగీత దర్శకుడు చక్రవర్తినే . ఆయన హవా నడుస్తున్న కాలంలో వచ్చిన సినిమాల్లో ఇదీ ఒకటి .
దేవులపల్లి వారు వ్రాసిన చీకటి వెలుగుల కౌగిలిలో చిందే కుంకుమ వన్నెలు పాట సినిమాకే హైలైట్ . ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఆత్రేయ గారి మీటి చూడు నీ హృదయాన్ని పలుకుతుంది ఒక రాగం పాట . మిగిలిన పాటలు ఊరు పేరు లేనివాడిని ప్రేమించానమ్మా , సెలవు మీద రావయ్యా సిపాయి బావా , చూసాను పొద్దంతా వేచాను రాత్రంతా , ప్రేమంటే ఏమనుకున్నావ్ , హరి హరి నారాయణా చూడరా నాయనా బాగుంటాయి .
సత్యనారాయణ , రాజబాబు , రమాప్రభ , సూరేకాంతం , గుమ్మడి , ప్రయాగ నరసింహ శాస్త్రి , అల్లు రామలింగయ్య ప్రభృతులు నటించారు . యూట్యూబులో ఉంది . An entertaining , musical and feel good movie . చూడనివారు తప్పక చూడతగ్గ సినిమా . వాణిశ్రీ , పద్మప్రియ , కాశ్మీర్ లొకేషన్స్ , సాంగ్స్ ఎట్రాక్షన్స్ . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ……. [ By దోగిపర్తి సుబ్రహ్మణ్యం ]
Share this Article