మధ్యప్రదేశ్.., బుర్హాన్‌పూర్ జిల్లా.., నచన్‌ఖేడా ప్రాంతం… ఓ బోర్డు వెలిసింది… అందులో ఏముందీ అంటే… దిన్‌దహాడే ఇంగ్లిష్ బోల్నే సీఖే అని రాసి ఉంది… అంటే పగటి వేళల్లో ఇంగ్లిషులో మాట్లాడటం నేర్చుకొండి అని… ఆ పదాల కింద ఓ బాణం గుర్తు, టేఖా అని మరో పదం…
అంటే, దుకాణం అని… బాణం గుర్తు సూచిస్తున్నది ఓ మద్యం షాపు వైపు… సదరు బోర్డు అర్థం అదే అయినా అందులోని మర్మార్థం ఏమిటని చాలామంది చాలారకాలుగా సోషల్ మీడియాలో బాష్యాలు చెప్పసాగారు… ఆ ఫోటో కాస్తా వైరల్ అయిపోయింది… నిజమే కదా, రాత్రిళ్లు ఇంగ్లిషు తాగినోని నోట ఆటోమేటిక్‌గా తన్నుకొస్తుంది… ఎటొచ్చీ పగటిపూట ఇంగ్లిషు విడిగా నేర్చుకోవాలి కదా… ఆమధ్య వైరల్ అయిన ఓ దుకాణదారుడి బోర్డు గుర్తొచ్చింది…
అందులో ఆడవాళ్లకు ఓ సూచన… మీ మగాళ్లను ఇక్కడ వదిలేయండి, మీరు తాపీగా షాపింగ్ చేసుకొండి, మీ మగాళ్లను మేం ఎంగేజ్ చేస్తాం, వాళ్ల బిల్లు మీరు కడితే చాలు అని ఉంటుంది బోర్డులో… సరదాగా, క్రియేటివ్‌గా బాగుంది… పైన చెప్పిన బోర్డు కూడా సరదాగానే ఉంది… కానీ అధికారులు అలా సరదాగా తీసుకోలేదు… ఎక్కడ ఏం దొరుకుతుందా అని చూస్తేనే కదా, నాలుగు డబ్బులు రాలేది, అసలు కిక్కు తలకెక్కేది…
Ads
ఠాట్, ఇది మద్యపానాన్ని ప్రోత్సహించేలా ఉంది… తప్పు కదా, మీరేం చేస్తున్నారు అంటూ సదరు జిల్లా కలెక్టర్ భవ్య మిట్టల్ ఆబ్కారీ అధికారులకు క్లాస్ పీకింది… వాళ్లు వెంటనే సదరు షాపు ఓనర్‌కు తక్షణం పదివేలు జరిమానా కట్టు అని తాఖీదులు పంపించారు… దుకాణదారుడు లబోదిబో… పది వేలు సమస్య కాదు, నన్ను తప్పుపట్టారు, అన్యాయం అంటూ…
(భవ్య మిట్టల్)
అది ప్రైవేట్ భూమి, నాది కాదు, అక్కడ బోర్డు పెట్టింది నేను కాదు, ఎవరో కుట్రపూరితంగా పెట్టారు… దాంతో నాకు పెరిగిన ఆదాయం కూడా ఏమీ లేదు, ఒక్క క్వార్టర్ సీసా కూడా ఎక్కువ అమ్ముడుపోలేదు అని జవాబు ఇచ్చాడు… తనే పెట్టుకుని ఉంటాడు, ఏదో కథ చెబుతున్నాడు గానీ, తన షాపులో అమ్మకాలు పెంచాలని ఇంకెవడో ఎందుకు ప్రయత్నిస్తాడు…?
నిజానికి సేల్స్ ఏమీ పెరగలేదట… ఎందుకు పెరుగుతాయి..? మద్యం అమ్మకాలు పెరగాలంటే జనం దగ్గర డబ్బు పెరగాలి, అంతే… ఈ బోర్డులు చూసి మరో క్వార్టర్ ఎక్కువగా ఎక్కించడు… ఐనా మద్యపానాన్ని నానా పద్ధతుల్లో ప్రోత్సహించేది ప్రభుత్వమే కదా… మద్యపానాన్ని నిరుత్సాహపరచకపోవడం కూడా ఒకరకంగా ప్రోత్సహించడమే… కనీసం హైదరాబాదులో హిందూ పండుగల రోజుల్లో తెలంగాణ ఎక్సయిజు వాళ్లలాగా డ్రైడేస్ ప్రకటించాలి…
ఊరూరా బెల్టు షాపులు వర్ధిల్లుతున్నా సరే, ఏ చర్యలూ తీసుకోకపోవడం కూడా పరోక్షంగా మద్యపానాన్ని ప్రోత్సహించడమే కదా… హైదరాబాదులోనే మొన్నొకచోట దాదాపు అయిదారు వందల మంది కూర్చుని సేదదీరేలా పర్మిట్ రూం కట్టాడు ఒకాయన… ఐనా సరే, రాత్రిళ్లు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్, వందల వాహనాలతో కిటకిట… మరి బాధ్యులకు ఎవరు జరిమానా వేయాలి..? వేస్తారా..? నో, ఎక్కడ మద్యం అమ్మకాలు బాగా ఉన్నాయో, అక్కడి అధికారులకు రివార్డులు ఇవ్వకుంటే చాలు..!!
Share this Article