‘తాగడానికి నీరు పనికి రాదు కాబట్టే దానికి విస్కీ కలిపి కడుపులో పోసుకుంటాం’
…………………
ఈ మాటలు చెప్పిన వ్యక్తి అనామకుడు కాదు. రెండుసార్లు ఇంగ్లండ్ ప్రధానిగా పనిచేసిన ప్రపంచ ప్రఖ్యాత రాజనీతి దురంధరుడు విన్‌స్టన్ చర్చిల్ కొటేషన్ ఇది. బిరియానీ, బీర్లను మొదట చాలా కష్టపడి తిని, తాగి వాటి రుచిని అనేక మంది భారతీయుల ఆస్వాదించినట్టుగానే బ్రిటిష్ పాలనలో ఉన్న ఇండియాలో విస్కీ రుచిని చర్చిల్ గుర్తించారట.
అప్పటి వరకూ పొరుగు ప్రత్యర్ధి దేశం ఫ్రాన్స్‌లో మూలాలున్న మద్యం షాంపెయిన్ అంటే తెగ ఇష్టపడే చర్చిల్‌కు 19వ శతాబ్దం చివర్లో బ్రిటిష్ ఇండియాకు వచ్చినప్పుడు, విస్కీ తాగినాక దాని రుచి ఆయన నాలుకకు బాగా పట్టింది. బ్రిటిష్ కులీన కుంటుంబానికి చెందిన తండ్రి లార్డ్ రాన్డాల్ఫ్‌కి, అమెరికన్ తల్లి జెన్నీ జెరోమ్‌కి పుట్టిన సర్ విన్‌స్టన్ అప్పటి నుంచీ మద్యం తాగడానికి కూర్చున్నప్పుడు తన గ్లాసులోకి మొదట ప్రసిద్ధ స్కాచ్ విస్కీ బ్రాండ్ జానీ వాకర్ రెడ్ లేబుల్ తొంబయి మిల్లీ లీటర్లు నెమ్మదిగా దింపుకుని, దాని పైన సోడా పోయించేవారని చదివాను.
ఇలా తాగే తన ‘ప్రత్యేక కాక్‌టెయిల్’లో విస్కీ కాస్త పలచగా ఉండేలా కలిపితేనే చర్చిల్‌కు ఇష్టం. సోడాతో పోల్చితే గ్లాసులో విస్కీ కాస్త ఎక్కువ పడితే– బ్రిటిష్ యుద్ధకాల ప్రధాన మంత్రిగా ప్రపంచమంతటా పేరు మారుమోగిన చర్చిల్ అందుకు బాధ్యులను చీవాట్లు పెట్టేవారు. ఇండియాలో తాగడం అలవాటైన విస్కీ గురించి చర్చిల్ ఒక సందర్భంలో మాట్లాడుతూ, ‘‘ తాగడానికి నీరు పనికి రాదు. దానికి విస్కీ కలపాలి. విస్కీని ఇష్టంగా తాగడాన్ని నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను,’’ అని చెప్పారు. కానీ, అనేక మంది ప్రధానుల మాదిరిగా చర్చిల్ తాగుబోతు కాదు. సోడా ఎక్కువ, విస్కీ స్వల్ప మొత్తంలో కలిపి తాగే చర్చిల్ ఇంకా అనేక విషయాలపై చెప్పిన మాటలను ఇండియాలో గుర్తుచేసుకుంటూనే ఉంటాం.
Ads
‘ బ్రిటిషర్లు పోతే.. ఇండియాలో బ్రామ్మలదే పెత్తనం ‘
…………………..
‘‘ ఇండియాకు స్వాతంత్య్రం ఇస్తే బ్రాహ్మణుల పెత్తనం కింద అంటరానివారిగా పరిగణించేవారు, దిగువ కులాల జనం, ముస్లింలు, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు మగ్గిపోతారు. బ్రిటిష్ వారి పాలన ఉంటేనే బ్రామ్మల ఆధిపత్యం అదుపులో ఉంటుంది,’’ అనే హెచ్చరికను 1947 ఆగస్టు 15కు 13 ఏళ్ల ముందే లండన్ ఆల్బర్ట్ హాల్ సమావేశంలో చర్చిల్ తన ప్రసంగం ద్వారా చేశారు. అలాగే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తల్లిగా భావించే బ్రిటన్ డెమొక్రసీ అనుభవం గురించి 1947 నవంబర్ 11న లండన్‌లో మాట్లాడుతూ,
‘‘ పాపాలు, కష్టాలతో నిండిన ఈ ప్రపంచంలో అనేక రకాల వ్యవస్థలు, పాలనలతో ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నాలు చేశారు. అవేమీ మంచి ఫలితాలు ఇవ్వలేదు. ప్రజాస్వామ్యం ఉత్తమమైనదని, దానిలోనే అంతా ఉందని ఎవరూ గొప్పలు చెప్పుకోరు. అంతకు ముందు అనుసరించిన పాలనా వ్యవస్థలేవీ సక్రమంగా లేనందువల్లే ప్రజాస్వామ్యానికి ఇంత ఆదరణ లభిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యంత అధ్వాన్నమైన విధానమని తెలిసినా అదే దిక్కయింది,’’ అనే రీతిలో చర్చిల్ వ్యాఖ్యానించారు…… ( మెరుగుమాల నాంచారయ్య )
Share this Article