1975 వ సంవత్సరం శోభన్ బాబుకి కలిసొచ్చిన సంవత్సరం . ANR అనారోగ్య కారణాల వలన ఆయన నటించాల్సిన సినిమాలు కొన్ని శోభన్ బాబుకి వచ్చాయి . ఎనిమిది సినిమాలు రిలీజయ్యాయి ఈ సంవత్సరం . అన్నీ కలర్ సినిమాలే . రెండు సినిమాలు మినహాయించి మిగిలిన ఆరు సినిమాలు బాగా ఆడాయి . బాగా ఆడని రెండు సినిమాల్లో ఒకటి ఈ గుణవంతుడు సినిమా .
ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో , శోభన్ బాబు ద్విపాత్రాభినయం ఉన్నా బాగా ఆడలేదు . ఇద్దరు శోభన్ బాబుల్లో ఒక శోభన్ బాబుని చంపడం ప్రేక్షకులకు నచ్చలేదేమో ! మంజుల , జయమాలిని , అంజలీదేవి , కృష్ణకుమారి , ధూళిపాళ , ప్రభాకరరెడ్డి , రావి కొండలరావు , మాడా ప్రభృతులు నటించారు .
శోభన్ బాబు , మంజుల జంట అందంగా ఉంటుంది . ఇద్దరూ హుషారుగా నటించారు . కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలు బయట హిట్ కాకపోయినా థియేటర్లో శ్రావ్యంగా ఉంటాయి . ముఖ్యంగా చెప్పుకోవలసింది సీతమ్మ నడిచింది రాముని వెంట పాట . చాలా బాగా చిత్రీకరించారు . ఆదుర్తి పనితనం కనిపిస్తుంది .
Ads
మిగిలిన పాటలు కలుసుకున్న తొలి రోజులింకా కన్నులలోనే ఉన్నదిరా , నేను కాక ఇంకెవరు నిను కౌగిలిలో పొదిగేది , హేపీ గో లకీ లకీ లకీ , మందిస్తా మత్తెక్కిస్తా , కొడితే గోల్కోండ కొట్టాలిరా కూడా థియేటర్లో బాగానే ఉంటాయి .
జయమాలినిది చాలా సేపు ఉండే పాత్రే . ఒక శోభన్ బాబుకి జోడీగా నటించింది . ఓవరాల్ గా శోభన్ బాబు 1975 విజయయాత్రలో అపశృతి ఈ సినిమా . యూట్యూబులో ఉంది . శోభన్ బాబు , మంజుల అభిమానులు ఎవరయినా చూసి ఉండకపోతే చూడవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు………. [ By దోగిపర్తి సుబ్రహ్మణ్యం ]
Share this Article