‘‘ద్వాపర యుగాంతంలో ఒక రోజున పంచపాండవులలో చివరివాడైన సహదేవుడు గుర్రాల సంతలో ఒక అందమైన గుర్రాన్ని చూశాడు. దాని ధర ఎంత అని యజమానిని అడిగాడు. ‘గుర్రాన్ని ఎవరికీ అమ్మను. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెబితే వారికి ఉచితంగా ఇస్తాను’ అని యజమాని చెప్పాడు. దీంతో సహదేవుడు ఏ ప్రశ్న అయినా సమాధానం చెప్తానని ధీమాగా అన్నాడు. దీంతో యజమాని… పెద్ద బావి ఉంది. అందులోని నీటితో ఏడు చిన్న బావులను నింపవచ్చు. కానీ, ఆ ఏడు బావులలోని నీటితో పెద్ద బావిని నింపలేం. ఎందుకు? అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక సహదేవుడు సంతలోనే ఉండిపోయాడు.
దీంతో సహదేవుడిని వెతుక్కుంటూ నకులుడు కూడా సంతకు చేరుకున్నాడు. ఏం జరిగిందో తెలుసుకున్నాడు. ఆ గుర్రం యజమానిని పిలిచి మరో ప్రశ్న అడిగితే తాను సమాధానం చెబుతానని అన్నాడు. దీంతో యజమాని తన రెండో ప్రశ్న సంధించాడు. అది… మనం బట్టలు కుట్టడానికి ఉపయోగించే సూది రంధ్రంలోకి పెద్ద ఏనుగు దూరగలిగింది. కానీ, ఏనుగు తోక మాత్రం సూది రంధ్రం దాటి వెళ్లలేకపోయింది. అలా ఎందుకు జరిగింది? అని గుర్రం యజమాని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు నకులుడు కూడా సమాధానం చెప్పలేక సంతలోనే ఉండిపోయాడు.
దీంతో తమ్ముళ్లను వెతికి తీసుకురావలసిందిగా భీముడిని ధర్మరాజు ఆదేశించాడు. తమ్ముళ్ల నుంచి విషయం తెలుసుకున్న భీమసేనుడు మరో ప్రశ్న అడిగితే తాను సమాధానం చెబుతానని అన్నాడు. దీంతో యజమాని… ఒక పొలంలో ధాన్యం బాగా పండింది. ధాన్యం చుట్టూ పెద్ద గట్లు కూడా ఉన్నాయి. అయితే, పంట కోసే సమయానికి ధాన్యం మాయమైపోయింది. అలా ఎందుకు జరిగింది అని అడిగిన ప్రశ్నకు భీముడు కూడా సమాధానం చెప్పలేక, తమ్ముళ్లను తీసుకొని ధర్మరాజు దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పాడు. ఆ ప్రశ్నలు విన్న ధర్మరాజుకు భయంతో చెమటలు పట్టాయి.
Ads
ఇది గమనించి, మీరు కూడా సమాధానం చెప్పలేక భయపడుతున్నారా? అని తమ్ముళ్లు ప్రశ్నించారు. ‘‘నేను సమాధానం చెప్పలేక భయపడటం లేదు. మిమ్మల్ని ఆ ప్రశ్నలు అడిగిన వ్యక్తి కలిపురుషుడు. కలియుగంలో జరగబోయే సంఘటనలను అతడు ప్రశ్నల రూపంలో మిమ్మల్ని అడిగాడు’’ అని ధర్మరాజు వివరించాడు. మొదటి ప్రశ్నకు సమాధానం… పెద్ద బావి అంటే తల్లిదండ్రులు, ఏడు చిన్న బావులు వారి పిల్లలు. పిల్లలు ఎంత మంది ఉన్నా తల్లిదండ్రులు ప్రేమ, ఆప్యాయతలతో పెంచి పోషిస్తారు. కానీ, అదే తల్లిదండ్రులు వృద్ధులు అయ్యాక పిల్లలు వారిని భారంగా చూస్తారు. రెండో ప్రశ్నకు సమాధానం… ఏనుగు అంటే పెద్ద అవినీతిపరులు, తోక అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. భారీ అవినీతికి పాల్పడే వారు చట్టానికి దొరక్కుండా తప్పించుకుంటారు. చిల్లర దొంగలు మాత్రం దొరికిపోతారు. మూడో ప్రశ్నకు సమాధానం… ధాన్యం అంటే ప్రజలు, చుట్టూ ఉన్న పెద్ద గట్లు అంటే అధికారులు. ఎంత మంది అధికారులు ఉన్నప్పటికీ ప్రజలకు దక్కాల్సిన ఫలాలను వారే స్వాహా చేస్తారు. అంటే, ధాన్యం మాయమైనట్టే… ప్రజలకు దక్కాల్సిన ఫలాలు కూడా మాయమవుతాయి. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలనే కలిపురుషుడు మీకు ముందుగా తెలియజేశాడని ధర్మరాజు తన తమ్ముళ్లకు వివరించాడు. మహాభారతంలో భాగంగా చెప్పే ఈ కథ ఇప్పుడు మనకు నిత్యం అనుభవంలోకి వస్తోంది కదా………………..’’
చదివారు కదా… ఎక్కడో చదివినట్టు అనిపిస్తోందా..? అవును, ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కొత్తపలుకు అనే ‘‘సంపాదకీయ వ్యాసకథనం’’లో రాశాడు… నిజానికి అప్పట్లో… అంటే తన మామను వెన్నుపోటు పొడిచి, అధికారాన్ని కబ్జా చేసి, ఆ తరువాత చంద్రబాబు అధికారాన్ని అనుభవిస్తున్న ఆ రోజుల్లోనే… నేను రాయాలనుకున్న సేమ్ డిట్టో డిట్టో వ్యాసం ఇది… మనకు పత్రిక లేదు కదా… చాన్స్ రాలేదు… ఇప్పుడు సేమ్, అదే అచ్చుగుద్దినట్టు రాధాకృష్ణ రాసేశాడు… కాకపోతే జగన్కు వర్తింపచేశాడు… అంతే తేడా… నిజానికి తేడా ఏముంది..? దేశంలో ప్రతి నాయకుడూ ప్రతినాయకుడే కదా… రాజకీయ అవినీతిలో కాస్త ఎక్కువతక్కువ గ్రేడ్లు తప్ప ఎవరూ అతీతులు కాదు… ఎవరి పాలన కలిధర్మానికి భిన్నంగా ఉంది చెప్పండి… (నవీన్ పట్నాయక్ వంటి ఒకరిద్దరు మినహా… వ్యక్తిగతంగా మోడీ కూడా… చివరకు అంతటి పినరై విజయుడు కూడా బంగారం, విదేశీద్రవ్యం స్కాముల్లో ఉన్నాడట…) ఇంతకీ జగన్ కలియుగ ధర్మానికి కట్టుబడ్డాడనే అక్కసా ఇది..? లేక పంట మొత్తం తనే కోసుకుంటున్నాడు అనే ఈర్ష్యా..? మనకెందుకు చేతకాలేదు ఇది అనే ఆత్మవిమర్శా..?!
Share this Article