ఆ నలుగురాడాళ్లూ కలిసి చేసిన పెళ్లి … భారతీయ సినిమాలు (ముఖ్యంగా దక్షిణాది సినిమాలు) పెళ్లిని చాలా రొమాంటిసైజ్ చేశాయి. పందిళ్లు, పసుపు కుంకుమ పళ్లేలు, అగ్నిహోత్రం, ఏడడుగులు, తలంబ్రాలు, అరుంధతి నక్షత్రం.. అబ్బో ఎన్నని! నిండా నవ్వుతూ, తుళ్లుతూ ఆడిపాడే ముఖాలు. అవి చూసి, వాటిని మళ్లీ మళ్లీ చూసి, ఇంకా ఇంకా చూసేసి తమ పెళ్లీ అలాగే కావాలని ఆశపడటం మనకొక Traditional Fantasy. కానీ నిజంగా పెళ్లి అలా జరుగుతుందా? అంత హాయిగా అయిపోతుందా? అంత ఆనందంగా ముగిసిపోతుందా? “A Wedding Album consists of Hundred Political Stories’ అన్నారు రచయిత, నటుడు గిరీష్ కర్నాడ్.
… పట్టుబట్టలు కట్టుకున్న పెళ్లికూతురు లోలోపల జరిగే మథనం ఎవరైనా గుర్తెరిగారా? వధువు మెళ్లో తాళి కట్టేందుకు నిల్చున్న పెళ్లి కొడుకు మనసులో ఏం అలజడి రేగుతుందో ఎవరైనా గ్రహించారా? మండపంలో అందరి ముందూ తిరుగుతున్నా లోలోన అనేక విషయాల గురించి కకావికలం అవుతున్న పెళ్లి కూతురు తండ్రిని ఎప్పుడైనా గమనించారా? బిడ్డ ఎడబాటు కన్నా కూడా, ఆ బిడ్డ అత్తారింట్లో ఎలా ఉంటుందోనని క్షణక్షణం ఆలోచించే పెళ్లికూతురి తల్లి ముఖంలో భావాలు చదవగలరా?
పెళ్లి ఇంట అందరూ ఆనందంగా గడుపుతున్న వేళ ఎక్కడో మూలన వంటింట్లో కాఫీ కాస్తున్న పనిమనిషి మనోగతంలో ఏముందో ఎవరు చూడొచ్చారు? గాడిపొయ్యి దగ్గర చెమటతో నిలువునా తడిసిన వంటవాడి ఆలోచన ఏమిటో ఎవరు ఊహించారు? పెళ్లిలో ఇవన్నీ ఉంటాయి. కానీ చాలాసార్లు మన గమనింపులోకి రావు. చుట్టూ కెమెరాలు ఉంటాయి. అవి మనుషుల ముఖాలు ఫోటో తీస్తాయి కానీ లోపలి వెలితినీ, వేదననీ చిత్రించలేవు, చెప్పలేవు. మరి ఎవరు చెప్పాలి?
Ads
… మీరా నాయర్ తెలుసునా? ప్రముఖ సినీ దర్శకురాలు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన పదేళ్ల తర్వాత ఒరిస్సాలో పుట్టారామె. తండ్రి ఐఏఎస్ అధికారి. తల్లి సామాజిక కార్యకర్త. ఇద్దరు అన్నలు. చిన్న కుటుంబం. 18 ఏళ్లపాటు భువనేశ్వర్‌లో పెరిగిన మీరా, ఆ తర్వాత సిమ్లా, ఆపై దిల్లీలో చదివారు. సోషియాలజీలో మాస్టర్స్ చేశారు. ఆపై స్కాలర్‌షిప్‌పై హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు.
అక్కడ చదువుకుంటూనే రంగస్థల నటిగా మారి, ‘ఈడిపస్’ నాటకంలో నటించి ఉత్తమ నటిగా అవార్డు పొందారు. ఆ తర్వాత సినీరంగంలో ప్రవేశించి తొలుత డాక్యుమెంటరీలు, ఆపై సినిమాలు తీశారు. భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన రెండో సినిమాకి దర్శకురాలు మీరానే!
అదే 1988లో వచ్చిన ‘సలాం బాంబే’. అది ఆమె తొలి చిత్రం. ముంబయి నగరంలోని మురికివాడల్లో పెరిగే చిన్నారుల కథను తెరకెక్కించారు. ఇలాంటి సినిమాలు ఏం ఆడతాయి అని అందరూ పెదవి విరిచారు. కానీ 4.5 లక్షల డాలర్లు ఖర్చయిన ఆ సినిమాకి 75 లక్షల డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో రెండు అవార్డులు అందుకుంది. ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. అవార్డు రాలేదనుకోండి!
… ఆ తర్వాత మరో రెండు సినిమాలు. ‘మిసిసిపి మసాలా’, ‘ది పెరేజ్ ఫ్యామిలీ’, ఇంకొన్ని డాక్యుమెంటరీలు. హైదరాబాదీ ఉర్దూ రచయిత్రి వాజీదా తబస్సుమ్ రాసిన ‘ఉత్రన్’ కథ ఆధారంగా ‘కామసూత్ర: ఎ టేల్ ఆఫ్ లవ్’ సినిమా తీశారు. ఆ సినిమాకి సంగీతం అందించమని ఎ.ఆర్.రహమాన్‌ని అడిగితే, నాకు ఈ సినిమా టైటిల్ నచ్చలేదు అన్నారట. I don’t want International Audiences to Brand me as ‘The Composer of Kama Sutra fame’ అని ఈ ఆఫర్‌ని వదులుకున్నారు.
ఆ తర్వాత మీరా వేరే వాళ్ళతో సంగీతం చేయించుకున్నారు. అద్భుతమైన చిత్రంగా పేరొందినా బోలెడంత వివాదాన్నీ మూటగట్టుకుంది. సినిమాలోని శృంగార సన్నివేశాలు మితిమీరాయని నిషేధాన్నీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆపైన తీసిన సినిమా ‘మాన్సూన్ వెడ్డింగ్ (Monsoon Weeding)’ అంటే ‘వర్షాకాలపు పెళ్లి’. మీరా తీసిన సినిమాల్లో తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.
… ఏంటి కథ? దిల్లీలో ఉంటున్న పంజాబీ హిందూ కుటుంబంలోని అమ్మాయికి పెళ్ళి. అది ఎలా జరిగిందనేది కథ. సింపుల్! దీన్నే ఏ నిర్మాతకైనా చెప్తే “జోక్ బాగుంది! ఇప్పుడు కథ చెప్పు” అంటారని మీరాకి తెలుసు. అందుకే అమెరికన్ సినీ నిర్మాత Caroline Baronతో కలిసి తనే ఈ సినిమాని నిర్మించారు. నసీరుద్దీన్ షా, షెఫాలి షా, తిలోత్తమా షోమ్, రజత్‌కపూర్ లాంటి గట్టి నటులు ఇందులో ఉన్నారు.
గాయని వసుంధరాదాస్ పెళ్లి కూతురు పాత్ర పోషించారు. అందరూ చక్కగా నటించారు. 1.2 మిలియన్ డాలర్లతో ఈ సినిమా తెరకెక్కిస్తే, 30.8 మిలియన్ డాలర్లు వసూలైంది. కాసేపు వసూళ్లు, నటులు అనే అంశాలను పక్కన పెట్టి కథగా ఈ సినిమాని చూద్దాం! ఏంటి అందులో ముఖ్యమైన విషయం?
… నలుగురు ఆడవాళ్లు. నాలుగు రకాల బాధలు. చుట్టూ పెళ్లి జరుగుతోంది. కాబట్టి అందరికీ కనిపించేలా నవ్వాలి. అతిథులకు అన్నీ అందించాలి. ఎక్కడా లోటు రాకుండా చూడాలి. పడాల్సిన హింస అంతా లోలోపలే పడాలి. బయటకు మామూలుగా ఉండాలి. పెళ్లికూతురు తల్లికి సిగరెట్ తాగడం ఇష్టం. కానీ అందరి ముందూ ఎలా తాగేది? ఎవరూ చూడకుండా బాత్రూంలోకి వెళ్ళి తలుపులు మూసి సిగరెట్ తాగి, రూమ్ ఫ్రెష్‌నర్ కొట్టి బయటకు వస్తుంది.
పెళ్లికూతురికి తన బాస్ అంటే ప్రేమ. అతనికి పెళ్లయింది. అయినా ప్రేమించింది. అతనితో శారీరకంగా కలిసింది. కానీ అది ముగిసిపోయిన కథ. ఈ విషయంలో పెళ్లికొడుకును మోసం చేయడం ఇష్టం తనకి లేదు. ఇదంతా చెప్పేయాలి. కానీ ఎలా? ఏమంటాడో?
… మరో అమ్మాయి. పెళ్లి కూతురి పెదనాన్న కూతురు. ముప్పై ఏళ్లు వచ్చాయి. పెళ్లి మీద ఆసక్తి లేదు. కారణం ఇదీ అని చెప్పలేదు. లోలోపల ఏదో మథనం. విదేశాల నుంచి వచ్చిన తన మేనత్త భర్తను చూస్తే ఏదో కలవరం. కళ్లలో అతని మీద అసహ్యం. అతని చూపు సోకితే కంపరం. ఏనాటి చేదు అనుభవమో ముల్లులా గుచ్చుతూ ఉంది. ముగ్గురు అయిపోయారు. మరి నాలుగో మనిషి ఎవరు? ఎక్కడుంది?
ఆ పెళ్లి ఇంట దాసీలా పనులు చేస్తోంది. ఇరవై ఏళ్ల ప్రాయం. కోరికలెన్నో చెలరేగే వయసు. కానీ అన్నీ తీరేవా? చాలావాటికి డబ్బు కావాలి. డబ్బే కావాలి! అది లేనప్పుడు దక్కిన దాంతో సంతృప్తి పడటమే మేలు. ఈ నలుగురు కలిసి చేసిన పెళ్లే ఈ ‘Monsoon Wedding’.
… మనకు ప్రతిభ ఉండటం గొప్ప కాదు. దాన్ని ఎక్కడ ఎంతమేరకు వాడాలో అంతే వాడి, ఏమాత్రం తక్కువా ఎక్కువా కాకుండా చూసుకోవడం గొప్ప. మీరాకి ఈ సంగతి బాగా తెలుసు! అందుకే ఈ కథను నేల విడిచి సాము చేయనీయక పద్ధతిగా నడిపారు. పెళ్లింట జరిగే అతి సూక్ష్మమైన విషయాలనూ కథలో చూపించారు. ఇందులో Pre-Marital s- x, Child Abuse అంశాల మీద సున్నితమైన చర్చ ఉంది. వాటి వెనుక స్త్రీలు పడే హింసను చూపిన కోణం ఉంది. అయినా ఎక్కడా వాదోపవాదాలు, భారీ డైలాగులు లేకుండా హాయిగా కథ నడిపిన చాకచక్యం మీరాది.
2001 నాటికి బాలీవుడ్ సినిమాలింకా ప్రేమకథల సక్సెస్ ఫార్ములా చుట్టూనే తిరుగుతున్నాయి. అందమైన డ్యూయెట్లు, విదేశాల లొకేషన్లు, కళ్లు చెదిరే కాస్ట్యూమ్స్‌కు పెద్ద పీట వేస్తున్నాయి. అవేవీ అంటక, తను నమ్మిన కథకు ఏం కావాలో, ఎంత కావాలో అంతలోనే సమర్థవంతంగా నడిపారు. ఆమెకు తోడుగా నటరాక్షసుడు నసీరుద్దీన్ షా. ఇంక చెప్పేదేముంది?
… ఈ సినిమాలో పెళ్లి కూతురు తండ్రిగా షా నటన మీరు చూసి తీరాలి. భారీ డైలాగులు, బరువైన హావభావాల నటన చాలామందికి వచ్చు. అతి మామూలుగా నటించడమే చాలా మందికి రాదు. ఆ విద్య తెలిసినవాడు నసీరుద్దీన్ షా. అప్పటికి రెండు సార్లు జాతీయ ఉత్తమ నటుడు. 37 ఏళ్లకే పద్మశ్రీ అవార్డు పొందినవాడు.
తనకిచ్చిన పాత్రను భయభక్తులతో పోషించే నటుడు. అతి మామూలుగా మొదలైన ఆ పాత్ర అంచెలంచెలుగా ఎదిగి సినిమా చివరికొచ్చేసరికి ఒక గొప్ప పాత్రగా మారుతుంది. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని తన నటనలో అద్భుతంగా పలికించారు షా.
… మీరు ఈ సినిమా చూడండి. ఏమాత్రం హడావిడి లేకుండా, మితిమీరిన ఎమోషన్స్ లేకుండా సినిమా స్క్రిప్ట్ ఎలా రాయాలో తెలుసుకునేందుకు చూడండి. పెళ్లిలో అప్పటిదాకా ఎవరూ చూపించని అంశాలను చూపిన విధానం కోసం చూడండి. మనకున్న మేలైన నటీనటుల నటనావైదుష్యం కోసం చూడండి. అన్నింటినీ మించి, ప్రతి పెళ్లీ సజావుగా సాగేందుకు స్త్రీలు పడే హింసను అర్థం చేసుకునేందుకు చూడండి.
PS: కూతురు పెళ్లికి డబ్బు చాలక స్నేహితులను అడిగేందుకు వెళ్తాడు నసీరుద్దీన్ షా. “హమ్మయ్యా! నాకు ఆడపిల్లలు లేరు” అని అంటాడో మిత్రుడు. 2001 నాటి సినిమాలో డైలాగ్ ఇది. ఇప్పుడు 2023 వచ్చింది. ఆ మాట ఇంకా వినిపిస్తూనే ఉంది. (ఈ చిత్రం యుట్యూబ్‌లో English Subtitlesతో అందుబాటులో ఉంది.) (విశీ – సాయివంశీ)
Share this Article