Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లిపి హత్యా నేరం…! తెలుగును తెలుగులో రాస్తే నేరమా…?

August 29, 2024 by M S R

 

మాతృ భాష. అమ్మ భాష. మదర్ టంగ్. ఎలా చెప్పినా, ఏ భాషలో చెప్పినా సొంత భాష ప్రాధాన్యం ఉండి తీరుతుంది. తెలుగు తల్లి / తెలంగాణా తల్లి అనగానే భావోద్విగ్నంగా ముడిపడతాం. పడాలి కూడా. భాసించేది భాష. అంటే వెలిగేది, వెలుగును పంచేది. అంటే నిజమయిన వెలుగుగురించి చెప్పాలన్నా కాంతిమంతంగా వెలిగే భాష లేకపోతే సాధ్యం కాదన్నమాట. అందుకే మండే సూర్యుడి వెలుగును సంకేతిస్తూ భాస్కరుడు అంటున్నాం. మాట కూడా అంతటి సూర్యుడికి తక్కువేమీ కాదని భాష అంటున్నాం.

మాట్లాడే భాష ;
రాసే భాష,
మాండలిక భాష ;
ప్రామాణిక భాష;
భాషా భేదాలు;
భాషా భాగాలు ;
బాషా శాస్త్రం ;
భాషోత్పత్తి శాస్త్రం;
మెదడు- భాష;
భాష- ఆలోచనలు;
భాష- సృజనాత్మకత;
భాష- అభివృద్ధి…
ఇవన్నీ చాలా లోతయిన అంశాలు. ఏ కొద్ది మందికో తప్ప ఎవరికీ పట్టవు. భారత దేశంలో మాతృభాష పరిరక్షణలో తమిళుల స్ఫూర్తి, పట్టుదల ఇంకెవరికీ అబ్బలేదు. అది వారి రక్తంలో అణువణువునా ఉంది. మన రక్త పరీక్షలో లేదని తేలింది. ఇంకొన్నేళ్ళకు తెలుగుభాష అంతరించిపోతుందని కొందరు అనవసరంగా భయపెడతారు. ఇంత ప్రామాణికమయిన లిపి, వాడుక ఉన్న తెలుగు భాష అంతరించిపోదు. ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణ మూర్తి లాంటివారు 50 ఏళ్ల కిందటే అంచనా వేసినట్లు కనీసం చివర క్రియాపదం ఒంటికాలి మీద అయినా తెలుగు బతికి ఉంటుంది.

Ads

ట్రెయిన్ లేట్ గా వచ్చింది.
బ్యాంక్ బ్యాలెన్స్ అయిపొయింది.
డోర్ ఓపెన్ కాలేదు.
కార్ స్పీడ్ గా వెళ్ళింది. ఇలా మనం రోజువారీ వ్యవహారంలో అద్భుతమయిన తెలుగు మాట్లాడుతున్నాం అనుకుంటున్న తెలుగులో ముప్పాతిక భాగం తెలుగు కాదు.
ట్రయిన్ ఈజ్ లేట్.
దేర్ ఈజ్ నో బ్యాలెన్స్.
డోర్ ఈజ్ నాట్ ఓపెనింగ్…అని మాట్లాడితే బాధపడాలికానీ- చివర క్రియా పదంలో అయినా తెలుగుభాష వాడుతున్నందుకు అసలు మనల్ను మనమే అభినందించుకోవాలి. ముప్పాతిక భాగం భాష చచ్చి, పాతిక భాగమే బతుకుతోందని బాధపడ్డం దండగ. ఆమాత్రం అయినా బతికిస్తున్నాం కదా అనుకుంటే పండగ.

తెలుగు భాషలో ఒత్తులు నేటితరానికి పెద్ద సమస్య. భాషా పండితులు, మేధావులు, శ్రేయోభిలాషులు అందరూ అలోచించి అసలు ఒత్తులే లేని తెలుగు భాషను ఆవిష్కరించడానికి ప్రయత్నించాలి. ఒత్తులు పలకలేని యాంకర్లను సానుభూతితో అర్థం చేసుకోవాలేగాని, వారిని సంస్కరించడానికి ప్రయతించకూడదు. ఒత్తులు రాయలేనివారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పూర్తిగా ఇంగ్లీషులో రాయడంతో పోలిస్తే ఒత్తుల్లేకుండా అయినా తెలుగులో రాస్తున్నవారు దేవుళ్లతో సమానం. ఒత్తలేని జాతిని పొత్తిళ్లలో పెట్టుకుని కాపాడుకోవాలి. భావం ప్రధానం కానీ భాష ప్రధానం కాదు- అన్న ఆధునికుల సిద్ధాంతాన్ని భాషా శాస్త్రవేత్తలు నిండుమనసుతో, నిర్మాణాత్మక దృష్టితో, వాస్తవ స్థితిగతుల నేపథ్యంలో అంగీకరించాలి.

తెలుగు భాష అంతరించకపోవచ్చు కానీ, తెలుగు లిపి మాత్రం కచ్చితంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. దానికి మనమే కారణం. కానీ మనం ఒప్పుకోము.

సినిమా పాటలు ఏవి విడుదల చేసినా-
భాష తెలుగే అయినా ఇంగ్లీషు లిపిలోనే ఉంటాయి. నెమ్మదిగా తెలుగు భాషను ఇంగ్లీషు లిపిలో రాయడం ఆచారం, పధ్ధతి, ఫ్యాషన్ గా అలవాటు చేశారు.

మొన్నటివరకు ఈ లిపి హత్యా నేరాలు సినిమావారే చేసేవారు. ఇప్పుడు వారికి వాణిజ్య ప్రకటనలు కూడా తోడయ్యాయి. “మా తాజా కూరలే కొనండి” అన్న తెలుగు పిలుపును
“Ma taja kurale konandi”
అని ఇంగ్లిష్ లిపిలోనే అఘోరించాలి. పొరపాటున తెలుగు లిపిలో రాస్తే…పాతరాతియుగపు గుహల్లో చెకుముకి రాళ్లను రాజేసి వంట చేసుకునే ఆదిమ మానవులు అనుకుంటారన్న పరమ నాగరిక ఆలోచన అయినా ఉండి ఉండాలి! లేదా వెంటనే పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని జైల్లో పెడతారన్న భయమైనా ఉండి ఉండాలి!

మాయాబజార్లో పింగళి మాట-
“పెళ్లి చేయమంటే కష్టం కానీ; చెడగొట్టమంటే చిటికెలో పని”-
అన్నట్లు భాషను ఉద్ధరించాలంటే కష్టంకానీ, నాశనం చేయాలంటే చిటికెలో పని. రండి బాబు రండి!
రండి తల్లీ రండి!
తలా ఓ చెయ్ వేసి తెలుగు లిపిని నామరూపాల్లేకుండా చేద్దాం.
తిలాపాపం తలా కడివెడు పంచుకుందాం.

వారం, పది రోజుల వ్యవధిలో కొన్ని కోట్లమందిని ప్రభావితం చేయగల సినిమా అతి పెద్ద మాధ్యమం. మాస్ మీడియా. అలాంటి సినిమాల్లో ఏటికి ఎదురీదుతూ…పట్టుమని నలుగురయినా తెలుగు భాషను, వ్యక్తీకరణను, సంస్కృతిని, మొత్తంగా తెలుగుతనాన్ని పట్టుకుని వేలాడుతున్నందుకు వారికి ప్రత్యేకంగా నమస్కరించాలి.

ఏనాడో భాషా శాస్త్రవేత్తలు లెక్కకట్టినట్లుగా-
తెలుగు సినిమాల్లో ముప్పాతిక శాతం ఇంగ్లీషును విధిగా వాడాలి.
అర్థంలేని ఆరు పాటల్లో అర్థమున్న రెండుపాటలయినా పూర్తిగా ఇంగ్లీషు భాషలోనే పెట్టాలి. దీనికి హాలీవుడ్ కు వెళ్లాల్సిన పనేలేదు. మనవాళ్లెవరయినా అందమయిన తెలుగు రాయమంటే వణికిపోతారుకానీ, ఇంగ్లీషులో రాయమన్నా, పాడమన్నా అది మనకు వెన్నతో పెట్టిన మిథ్య. ఎలాగూ డిజిటల్ మీడియా అవసరాలు బాగా పెరిగాయికాబట్టి పాటలకే కాకుండా మాటలకు కూడా ఇంగ్లీషులిపిలో అక్షరాలు సినిమా మొత్తం వేయాలి. అసలు తెలుగు సినిమా మొత్తానికి ఇంగ్లీషు లిపిలో అక్షరాల్లేకపోతే సెన్సారు వారు అనుమతించకూడదు. తెలుగు భాషను ఇంగ్లీషు లిపిలోకి దించుతున్న పుణ్యపురుషులకు ఉత్తమ transliteration/ లిప్యంతరీకరణ అవార్డులను ఇబ్బడి ముబ్బడిగా ఇవ్వాలి!

మన పొరుగున కర్ణాటక సముద్రతీరం మంగళూరు-ఉడిపి ప్రాంతాల్లో తుళు మాట్లాడతారు. తుళు ప్రత్యేక భాషే అయినా, కోటి మందికి పైగా తరతరాలుగా మాట్లాడుతున్నా ఇప్పుడు లిపి లేదు. కన్నడ లిపిలోనే తుళు భాషను రాయాలి. నిజానికి ఆరు వందల సంవత్సరాల క్రితం వరకు తుళుకు ప్రత్యేక లిపి ఉండేది. అనేక కారణాల వల్ల లిపి అంతరించిపోయింది. కృష్ణదేవరాయల మాతృభాష తుళు. తుళు తన సొంత లిపిని మరచిపోయి, కన్నడ లిపిలోకి కుచించుకుపోయినట్లు- మన తెలుగు లిపి కూడా ఇంగ్లీషులోకి కుచించుకుపోయి సొంత లిపిని పూర్తిగా మరచిపోయే రోజులు ఎంతో దూరంలో లేవు.

ఒక లిపి ఏర్పడడానికి వేల ఏళ్ల సమయం పడుతుంది. మొనదేలిన రాయి ప్రవాహంలో ఒరుసుకుని, ఒరుసుకుని నున్నగా, గుండ్రంగా తయారయినట్లు తెలుగు లిపి కూడా గుండ్రంగా, అందంగా ఏర్పడింది. నవ్వుతున్నట్లు ‘అ’అక్షరం ఎంత అందంగా ఉంటుంది? పురి విప్పిన నెమలిలా ‘ఖ’ఉంటుంది. కీర్తికి పెట్టిన కిరీటంలా ‘గ’ ఉంటుంది. బుగ్గన సొట్టలా ‘ఠ’ ఉంటుంది. రాయంచలా ‘హ’ ఉంటుంది. తెలుగు వర్ణమాల అచ్చులు, హల్లుల అందం, అవి ఏర్పడ్డ పద్ధతి మనకు పట్టని పెద్ద గ్రంథం. భాషకు శాశ్వతత్వం ఇచ్చేది, తరతరాలకు భాషను అందజేసేది లిపి. మాట్లాడే మొత్తం భాషకు ఒక్కోసారి లిపి చాలకపోవచ్చు. తెలుగులో దాదాపుగా మాట్లాడే భాషకు తగిన, బాగా దగ్గరయిన వర్ణమాల ఉంది. అంత నిర్దుష్టమయిన, నిర్దిష్టమయిన లిపి తెలుగుకు ఉంది. ముత్యాల్లాంటి, రత్నాల్లాంటి తెలుగు అక్షరాలు మనకెందుకో వికారంగా కనిపిస్తాయి. అసహ్యించుకోవాల్సినవిగా అనిపిస్తున్నాయి. వాడకూడనివిగా అనిపిస్తాయి.

తెలుగు భాష అవసరాలకే అయినా తెలుగు లిపిలో రాయడం తక్కువతనంగా అనిపిస్తుంది. తెలుగుకు తెలుగు లిపే అంటరానిదిగా అవుతోంది. తెలుగును ఇప్పుడు ఇంగ్లీషులో రాయడం ఫ్యాషన్. మర్యాద. ట్రెండ్.

…అన్నిటికీ మించి తెలుగు భాషను తెలుగు లిపిలోనే రాసే మైనారిటీ జాతి మీద భవిష్యత్తులో దాడులు జరగకుండా గట్టి భద్రత కల్పించాలి!

(నేడు ఆగస్టు 29- తెలుగు వాడుక భాషోద్యమ కీర్తి పతాక గిడుగు రామమూర్తి పంతులు పుట్టిన రోజును తెలుగు భాషా దినోత్సవంగా అధికారికంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నెమరువేతగా- అందమైన తెలుగు లిపి గుండెకోత గురించి రెండు మూడు పాత వ్యాసాల కలబోత)  -పమిడికాల్వ మధుసూదన్   9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions