ఈ సామాజిక పరిణామాన్ని ఎలా విశ్లేషించుకోవాలో… తదుపరి ప్రభావాల్ని ఇంకెలా అంచనా వేసుకోవాలో కూడా అర్థం కాని వార్త… కలిచివేసేదే… ఆలోచనల్లో పడేసేదే… ముందుగా వార్త చదవండి…
2024 మొదటి ఆరునెలల కాలంలో జపాన్‌లో 37,227 మంది ఒంటరి మరణాల పాలయ్యారు… ఒంటరి మరణం అంటే, వాళ్లు ఎవరూ తోడు లేకుండా ఒక్కొక్కరుగానే జీవిస్తున్నవాళ్లు… ఒంటరి మనిషి, ఒంటరి జీవితం… జీవన భాగస్వాముల్లేరు, కుటుంబసభ్యుల్లేరు, పిల్లల్లేరు…
వీరిలో 28,330 మంది 65 ఏళ్లు పైబడిన వారు, అంటే 76 శాతం… జపాన్ నేషనల్ పోలీస్ ఏజెన్సీ వెల్లడించిన అధికారిక లెక్కలే ఇవి… ఈ ఒంటరి మరణాల్లో 85 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 7,498… ఒంటరి మరణాల్లో 30 ఏళ్ల లోపు వయస్సున్న వాళ్లు కూడా ఉన్నారు, సంఖ్య 473…
Ads
ఈ ఒంటరి మరణాల్లో రెండొంతులు పురుషులవే… ఒక వంతు మాత్రమే మహిళలు… ఇదీ వార్త… అంటే మహిళలు తమ వృద్దాప్యంలో కుటుంబంతో గడపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ పురుషులే ఒంటరిగా బతకడానికి సాహసిస్తున్నారు… మరీ కలిచివేసేది ఏమిటంటే… మరణించిన చాలా రోజుల తరువాత బయట ప్రపంచానికి వెల్లడైనవీ వేలల్లోనే..!
1) సంతానవంధ్యత పెరుగుతోంది… 2) పెళ్లిళ్ల మీద యువతకు ఆసక్తి లేదు… 3) పెరిగిన జీవనవ్యయంతో ‘కుటుంబం’ అనే ఆసక్తికి, ఆ భావనకే దూరంగా బతుకుతున్నారు మెజారిటీ యువజనం… 4) ఉమ్మడి కుటుంబాలు అనే భావనే సమసిపోయింది… 5) దేశజనాభాయే తగ్గిపోతోంది… 6) మనిషి ఆయుఃప్రమాణం పెరుగుతోంది… జపాన్‌లో 80, 90 ఏళ్ల సగటు ఆయుష్షు దాటుతోంది… 7) పుట్టే పిల్లల సంఖ్య దారుణంగా పడిపోతుండగా, దేశజనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది…
8) ఎవరి బతుకు వారిదే… ఏ అర్ధరాత్రో, అపరాత్రో ఏదైనా ఐతే అప్పటికప్పుడు స్పందించి సాయపడేవాడు ఉండటం లేదు… ఫలితంగా మరణాలు… 9) ఈ మరణాల వెనుక కుటుంబసభ్యులు, బంధుమిత్రుల కన్నీళ్లుండవు, డాక్టర్ల వైద్యప్రయత్నాలుండవు… 10) ఆలస్యంగా బయటికి తెలుస్తుంది… అనామకంగా లోకాన్నే విడిచిపెట్టి వెళ్లిపోతారు… ఇంకా..?
రాబోయే రోజుల్లో ఈ సిట్యుయేషన్ మరింత విషమించబోతోంది… కొన్నేళ్ల తరువాత పనిచేసే, పనిచేయగలిగే వారి సంఖ్య బాగా పడిపోతుంది… ఎటుచూసిన ముసలోళ్లే… ఒంటరి జీవితాల సంఖ్య ఇంకా పెరగబోతోంది… ‘‘రేప్పొద్దున నేను నిద్రలేవకపోతే…’’ శీర్షికతో పౌర అధికారులు ఏమేం చేయాలో ‘ప్రపంచానికి సూచనల’తో ఓ వీలునామా రాసి ఎల్లప్పుడూ మంచం పక్కన టేబుల్ మీద ఓ కాగితం రాసిపెట్టి ఉంచాలేమో…
ఇది ఒక్క జపాన్ సమస్యే కాదు తూర్పు దేశాలన్నింటిలోనూ ఇదే దుస్థితి… పిల్లల్ని కనండర్రా అని ప్రభుత్వాలు ఎన్ని ప్రోత్సాహకాలు, పథకాలు ప్రకటిస్తున్నా సరే పరిస్థితిలో మార్పు రావడం లేదు… అసలు ఆ దేశాల జీవనవిధానాలే వేగంగా మారిపోతున్నాయి… మనిషి తన చుట్టూ గిరి గీసుకుని, రోజురోజుకూ దాన్ని మరింత లోలోపలకు గీసుకుంటూ… అన్ని బంధాలనూ బేఖాతరు చేస్తూ… చివరకు ఆ గిరిగీసుకున్న సర్కిల్‌లోనే అనామకంగా ప్రాణాలు విడుస్తున్నాడు…
ఎంతగా విలువలు వేగంగా పడిపోతున్నా సరే, ఇండియాలోనే ఇంకా సామాజిక, కుటుంబ, వృద్దాప్య జీవనం బాగున్నట్టుంది కదా..!! ఏమో మరి, పిల్లలు రెక్కలు కట్టుకుని విదేశాలకు వెళ్లిపోతే… ఇక్కడ వృద్దాప్యంలో ఒంటరిగా తల్లిదండ్రులు… మనవాళ్లు విశ్వమానవులు అయ్యారని ఆనందిద్దామా..? ఏదో బాష్యం చెప్పలేని ఒంటరితనం ఆవహిస్తూ, అలుముకుంటూ మన జీవితాలూ మరోరకం జపాన్ జీవితాలే అనుకుని నిట్టూరుద్దామా..!!
Share this Article