ఒక సింగిల్ కాలమ్ వార్త… ఆంధ్రజ్యోతిలో… దాన్ని వార్త అనొచ్చా..? వాణిజ్య ప్రకటన అది… దాన్ని వార్తలా రాసుకొచ్చారు, పబ్లిష్ చేశారు.., అది తమను నమ్మే పాఠకులను ఒకరకంగా చీట్ చేయడం… ఐతే ఆశ్చర్యం ఏమీ అనిపించలేదు… ఎందుకంటే, పడిపోయిన యాడ్స్ ఆదాయాన్ని పూడ్చుకోవడానికి ఇలాంటివి ఇంకా ఇంకా చేయబోతున్నాయి పత్రికలు…
రాజకీయ వార్తలు, పార్టీలకు ఉపయోగపడే వార్తలు… కొన్ని చాన్నాళ్లు నుంచీ వస్తున్నాయి… అడ్వర్టోరియల్స్ అంటారు… అంటే వాటి ఉద్దేశం వార్తల్లా కనిపించేలాగా రాయబడిన ప్రకటనలు, జోకుడు రాతలు… అరె, పత్రికల పొలిటికల్ లైన్స్‌ను డిసైడ్ చేసేవే పార్టీలు, నాయకులు, ప్రలోభాలు, ఒత్తిళ్లు ఎట్సెట్రా… ఆ లైన్స్ ఆధారంగానే కథలు, కథనాలు రాయబడుతున్నాయి కదా, ఆఫ్టరాల్ ఈ చిన్న వార్తదేముంది అంటారా..? అదీ నిజమే…
Ads
గతంలో కూడా ఇలాంటి వార్తలు బోలెడు… కాకపోతే ఎక్కువగా కార్పొరేట్ కాలేజీలవి… రకరకాల పోటీపరీక్షల ఫలితాలు వచ్చినప్పుడు అవి మేం తోపులం, మేం తోపులం అని రిలీజు చేసే ప్రకటనలనే పత్రికలు వార్తలుగా రాసేవి… అలాంటిదే ఈ జీఆర్టీ జువెలర్స్ వార్త, సారీ, ప్రకటన… అచ్చంగా ఒక యాడ్ మెటీరియల్ ఎలా ఉంటుందో, దాన్నే వార్తగా రాసేశారు… సరే, వీళ్లు రాయగానే, నమ్మేసి, జనం ఆ దుకాణాలకు పరుగులు తీయరు, కానీ ప్రకటనకూ, వార్తకూ నడుమ తేడా చూపించకపోవడం మాత్రం ఏరూపంలో ఉన్నా అనైతికతే…
వాళ్లు బోలెడు యాడ్స్ ఇస్తారు, ఇలాంటి యాడ్ వార్తలు రాయమని అడుగుతారు, కాదనలేం కదా, మార్కెటింగ్ విభాగం కూడా ఒత్తిడి తెస్తుంటుంది, పైగా పత్రికకు రెవిన్యూ కూడా ముఖ్యమే కదా అంటుంటారు ఈ ధోరణిని సమర్థించే జర్నలిస్టులు… ఎడిటోరియల్, మార్కెటింగ్ వింగ్స్ నడుమ ఓ రేఖ ఉంటుంది… పత్రిక పూర్తిగా మార్కెటింగ్ సిబ్బంది చేతుల్లోకి, విచక్షణలోకి వెళ్తే దాని ప్రభావం తదుపరి వచ్చే ఏబీసీ రిపోర్టులో కనిపిస్తుంది…
అఫ్‌కోర్స్, ఇప్పుడు తెలుగులో ఈ మూడు ప్రధాన పత్రికలు మినహా మిగతా ఏ పత్రిక కూడా ఏబీసీ జోలికి పోవడం లేదు… తమ అసలు సర్క్యులేషన్ ఎంతో బయటపడిపోతుంది కదా… అందుకేనన్నమాట..! (ఏబీసీ ఖర్చు కూడా ఓ కారణమే, చిన్న పత్రికలు అందుకే ఆవైపు చూడవు)… అవునూ, ఈలెక్కన, ఈ మొహమాటాలకు ఆ గుండు బాస్ జువులర్స్ కోసం ఎన్ని వార్తలు రాయాలి..? తను ఇచ్చే యాడ్స్ సొమ్ము భారీయే కదా… అలాగే జాకెట్ యాడ్స్ ఇచ్చే రిటెయిల్ మార్కెటింగ్ సంస్థలు ఎట్సెట్రా… అందరూ తమకు ఇలాంటి వార్తలు కావాలని ఒత్తిళ్లు మొదలుపెడితే, ఒక పత్రికలో ఒక పేజీ మొత్తం ఇలాంటి వాటికే కేటాయించాల్సి వస్తుందేమో… ఆలోచించండి…!!
(మన తెలుగు న్యూస్ చానెళ్లలో గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఉండేవి… రంగురాళ్లు, రుద్రాక్షలు, కార్పొరేట్ హోమియా తదితర యాడ్స్ అరగంట చొప్పున వచ్చేవి, ఓ యాంకర్, ఓ ప్రసిద్ధుడు ప్రశ్నోత్తరాలు, ప్రేక్షకుల ప్రశ్నలు పేరిట సాగేవి… జీఆర్టీ జువెలర్స్ వార్త కూడా దాదాపు అదే తరహా… కాకపోతే కాస్త నయం, కనీకనిపించనట్టుగా ఏదో స్పేస్ ఫిల్లింగ్ తరహాలో ఎక్కడో పెట్టారు…)
Share this Article