ఈ మాట దాదాపు అందరూ అంగీకరిస్తారు… ఈసారి బిగ్‌బాస్ ఎంపికలు దరద్రంగా ఉన్నాయి అని..! ప్రత్యేకించి నాగమణికంఠ అనే కేరక్టర్… నిన్న మొన్న ఎపిసోడ్స్ చూస్తుంటే తను తీవ్రమైన ఏదో మానసిక వ్యాధితో ఉన్నాడని తెలుస్తుంది… ఈ మాట నిర్ధారించడానికి సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు కూడా అవసరం లేదు…
ఒక కంటెస్టెంట్‌ను ఎంపిక చేసేటప్పుడు ఇకపై ఆరోగ్యపరీక్షలతోపాటు మానసికారోగ్య పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుందేమో… ఈ మాట అనడానికి కారణం… మణికంఠ బిహేవియర్… చివరకు ఒక దశలో బిగ్‌బాస్ తనను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వాల్సి వచ్చింది… భయంభయంగానే… ఎందుకంటే, ఇప్పటికిప్పుడు తనను బయటికి పంపించేస్తే ఏ అఘాయిత్యం చేసుకుంటాడో అన్నట్టుగా ఉంది సిట్యుయేషన్…
ఆట మొదట్లోనే తనతో ఓ ప్రాంక్ ఎలిమినేషన్ ఆట ఆడిన బిగ్‌బాసే మొదటి దెబ్బకొట్టాడు తనను… ఆ తరువాత ఇక ఔటాఫ్ కంట్రోల్… పదే పదే సింపతీ కార్డు, విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నాడు… ఏడుస్తున్నాడు… తనే ఒంటరిగా పడుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు… ఇక నావల్ల కాదు అంటున్నాడు… అసలు హౌజులోకి వచ్చే ముందే ఇలాంటి బ్యాగేజీ (ఫ్లాష్ బ్యాకులు, తన సొంత కథలు) బయట పెట్టేసి రావాలి…
Ads
ఒక గేమర్‌గా… పోటీపడాలి, అంతే తప్ప తన విషాదాన్ని పదే పదే చెబితే… అదంతా ప్రేక్షకులకు దేనికి..? ప్రేక్షకుడు ఆట కోరుకుంటాడు… ఒక్కొక్కరి సైకలాజికల్, ఫిజికల్, ఇంటెక్చువల్, స్పాంటేనిటీల స్ట్రెంత్ చూస్తారు… అంతే తప్ప… ఇదయితే అస్సలు తన గేమ్ ప్లాన్‌లాగా లేదు…
‘‘నా చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు, తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది, ఆయనతో కష్టాలు పడ్డాను, అవమానాలు, కొన్నాళ్లకు ఆ తల్లి కూడా చనిపోయింది, ఆమె శవాన్ని దహనం చేయడానికి కట్టెలు కొనే స్థోమత కూడా లేక అడుక్కున్నాను, నాకెవరూ లేరు… నా మెంటాలిటీ మార్చుకోవడానికి ఈ గేమ్‌కు వచ్చాను, ఇక్కడా మొదటి వారమే ఎలిమినేట్ అయితే నెగెటివ్ ముద్ర పడుతుంది… ఇంకెలా బతికేది..?’’
… అంటూ సింపతీ ప్లే చేస్తే అది బిగ్‌బాస్ ఆట ఎలా అవుతుంది..? ప్రతి ఒక్కరికీ ఏదో విషాదగతం ఉంటుంది… అందుకే కంటెస్టెంట్లకు చిరాకెత్తి ఎలిమినేషన్ రౌండ్‌లో తననే అధికంగా టార్గెట్ చేశారు… తరువాత తనలోతనే ఏడుస్తూ… ఇంతకన్నా ట్రాన్స్‌పరెంట్ ఉండలేను బిగ్‌బాస్ అంటూ విగ్గు తీసేశాడు… చూస్తున్న ప్రేక్షకులు కూడా షాక్… కన్ఫెషన్ రూమ్‌లో తను కూర్చున్న తీరు, తన బాడీ లాంగ్వేజీ తన మానసిక స్థితిని ఇట్టే పట్టించేశాయి…
ఈ మూడురోజులు తనతో క్లోజ్‌గా ఉండటానికి మణికంఠ చెప్పిన కారణాలు విని విష్ణుప్రియ షాక్ తింది… నిజానికి ఆమె మాస్కులినిటీ, ఫెమినిటీ పదాల్ని సరళత్వం, దృఢత్వం తత్వాలకు వర్తింపజేసి ఏదో చెప్పింది… నిజంగా ఆమె సరిగ్గా చెప్పలేకపోయింది తెలుగులో గానీ… తన భావం కరెక్టే… మణికంఠ అవి అర్థమయ్యే మానసిక స్థితిలో లేడు కదా… విష్ణుప్రియను నామినేట్ చేశాడు, ఇదే కారణంతో… ఇప్పుడు తను ఎలిమినేట్ అయిపోతే, ఏమైనా చేసుకుంటే ఎవరిది బాధ్యత బిగ్‌బాస్..?!
ఎప్పటిలాగే ఆకుల సోనియా పర్‌ఫెక్ట్ పాయింట్లతో దాడి చేస్తోంది… ఉండాల్సిన కేరక్టర్ ఆమె… బేబక్క కూడా పర్లేదు, కానీ ఏజ్ ఆమెకు నెగెటివ్ అవుతుందేమో… శేఖర్ బాషా పర్లేదు, క్లారిటీ ఉంది తనకు… నిఖిల్ వోకే… ఎటొచ్చీ ప్రేరణ, యష్మి ఎందుకు అరుస్తున్నారో వాళ్లకే తెలియదు..!!
Share this Article