నిన్న చక్రవర్తి జయంతి. మాస్ సినిమా పాటకూ చాలా కాలం పెద్ద దిక్కు ఆయన. జానపదం నీడల్లో నడిస్తేనే సినిమా పాటలు జనం హృదయాల్లోకి దూసుకెళ్లిపోతాయి అనే సూత్రం ఆయన నమ్ముకున్నారు…
చక్రవర్తికి ఈ నమ్మకం కలిగించినది మాత్రం బుర్రకథ నాజర్. నాజర్ దగ్గర చేరడానికి కాస్త ముందు మహావాది వెంకటప్పయ్య గారి దగ్గర ఓకల్ నేర్చుకునే ప్రయత్నం చేశారు గురువు గారు. మహావాది క్రమశిక్షణ తట్టుకోలేక ఇటొచ్చేసారు… అది వేరు సంగతి…
మహదేవన్ తో ట్రావెల్ అయ్యే కళాతపస్వి విశ్వనాథ్ తో ఆయన మూడు సినిమాలు చేశారు. శారద, అల్లుడు పట్టిన భరతం, ప్రెసిడెంట్ పేరమ్మ. శారదలో టైటిల్ సాంగ్ రాజేశ్ ఖన్నా ఆరాధనలో మేరీ సప్నోంకీ రాణీ కబ్ ఆయేగీతూ ప్రేరణతో సాగుతుంది. ఆ పాట మొత్తం వినండి… మీకలా అనిపించదు. కానీ చివర క్లోజింగ్ లో వచ్చే సంగీతం పట్టిచ్చేస్తుంది.
Ads
చక్రవర్తి తొలి చిత్రం మూగప్రేమలోనూ… ఓ అద్భుతమైన డ్యూయట్ వినిపిస్తుంది. ఈ సంజెలో… అంటూ సాగే పాట ఎప్పుడు విన్నా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. వేటాడే మెలోడీ అది. 960 సినిమాలకు సంగీతం అందించిన ఆయన… చాలాసార్లు ఒకే ట్యూన్ పక్క పక్క సినిమాల్లో కొట్టేసేవారు.
అది కేవలం హడావిడి వల్ల జరిగిన పొరపాటు తప్ప కాన్షస్ గా చేసింది కాదు… ప్రేమ తరంగాలు సిన్మా లో నవ్వేందుకే ఈ జీవితం అని ఓ పాట ఉంటుంది… అదే ట్యూన్ యధాతదంగా సర్దార్ పాపారాయుడు సిన్మా లో వాడేసారు. ఉయ్యాలకూ ఉపొచ్చింది అనే పాట అది. ఈ రెండు సిన్మాలూ వారం తేడాలో వచ్చినవి.
విచిత్ర జీవితంలో… బంగినపల్లి మామిడి పండు అనే పాట బాణి లోనే… వేటగాడులో కొండమీనా సందమామ పాట నడుస్తుంది. రెండూ హిట్టే… జనం పాడుకున్నవే… అది చక్రవర్తి అంటే…
ఓ రోజు చక్రవర్తి దగ్గరకు ఓ ప్రొడ్యూసర్ వచ్చాట్ట. ఈయన ట్యూను వినిపించాడు. బాలేదన్నాడట నిర్మాత. ఓ గంటాగి రమ్మని మరో ట్యూను వినిపించారట. అదిరిందన్నాడట సదరు నిర్మాత. అక్కడే ఉన్న వేటూరి … ఇప్పుడు నువ్వు చేసిన ట్యూను ఏ రాగం అని అడిగారట. తాడికొండ తాళం, గుంటూరు రాగం అని సమాధానం చెప్పారట చక్రవర్తి నిర్వేదంగా.
అదేంటని వేటూరి అడగగా… వాడికి పొద్దున అద్భుతమైన ట్యూనిచ్చాను గురూ… బాలేదన్నాడు. ఇది సూపరన్నాడు. మనమేం చేయగలమని పెదవి విరిచాట్ట.
మహదేవన్ అంటే ఇష్టపడే చక్రవర్తి ఆయన తరహాలో చేసిన ట్యూను చిరంజీవి సంఘర్షణలో వినిపిస్తుంది. కట్టుజారిపోతోందా… చీర కట్టు జారిపోతా ఉందా? అని. 960 చిత్రాలకు సంగీతం అందించిన చక్రవర్తి తెలుగు మాస్ ప్రేక్షకులకు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాడు.
క్లాస్ ఆడియన్స్ కూ ఆయన చేసిన చీకటి వెలుగులు,మల్లెపూవు తదితర సిన్మాలూ ఉన్నాయి… ఇండస్ట్రీ కి రెండు తరాల సంగీత దర్శకులను అందించిన చరిత్ర ఉంది ఆయనకు… ఏమైనా చక్రవర్తి అంటే చక్రవర్తే… డ్రైవర్ రాముడులో ఏమని వర్ణించనూ పాట.. ఏం పాటండి అబ్బబ్బ…
ఈ క్రింద తగిలించిన ఫోటో అల్లుడు పట్టిన భరతం సిన్మా రికార్డింగ్ ముహూర్తం సందర్బంగా…. (Bharadwaja Rangavajhala)
Share this Article