తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, తెలుగును పేరులో నింపుకున్న తెలంగాణ ముందుగా గుర్తురావాలనే విషయం రాహుల్‌కు చెప్పలేదా, రేవంత్ గారూ?
…………………………………
పదేళ్ల క్రితం రెండు రాష్ట్రాలుగా అవతరించాక రెండు తెలుగు ప్రాంతాల మెజారిటీ జనం తల్లి భాష తెలుగు విషయం వచ్చే సరికి చాలా మందికి సమస్యే. అంతర్జాతీయ స్థాయిలో ఈ రెండు రాష్ట్రాల వ్యక్తులు ఎవరైనా ఎంతో కొంత సాధిస్తే తెలుగు దినపత్రికలు… తెలుగోళ్లు, మనోళ్లు అంటూ శీర్షికల్లో, వార్తల్లో రాసేస్తున్నాయి.
ఈమధ్య తెలంగాణకు చెందిన తెలుగు రచయితలు కొందరు తెలుగు భాషకు సంబంధించిన అన్ని విషయాల్లో ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మూలాలున్నవారే పెత్తనం చేస్తూ వస్తున్నారని ఫేస్‌బుక్ ప్రకటన ద్వారా వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు బాగా ముసురుపట్టిన సమయంలో ‘ తెలుగు జనంతో సజీవ బంధంలేని తెలుగు సాహిత్య సంపద’ ‘‘ మీది మీదే–మాది మాదే ’’ అని లేవదీసిన చర్చ ఇప్పుడెందుకు పుట్టుకొచ్చింది? తెలుగు నేలంతా రొచ్చురొచ్చుగా ఉన్న రోజుల్లో.. ఎండావానా పట్టని అతి చిన్న ప్రపంచంలో నివసించే తెలుగు రచయితలు, కవులకు బయటి వాతావరణంపై స్పహ లేకపోవడంలో వింతేముంది? అనుకుంటూ మాలాంటోళ్లు సర్దుకుపోయారు.
Ads
అయితే, ఎందుకోమరి తెలుగు అనగానే ఆంధ్రప్రదేశ్ అనే తెలుగు ప్రాంతం ఒక్కటే మహామహా నేతలు సహా ఎక్కువ మందికి గుర్తుకొస్తుందని సోమవారం అమెరికాలో రుజువైంది. అమెరికా అనధికార పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌కసభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ భారతదేశంలో ‘హిందీ ఆధిపత్యాన్ని’ బాగా ఎండగట్టే క్రమంలో, ‘‘ హిందీ కంటే తెలుగు తక్కువ అని మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో అంటే మీరు ఆంధ్రప్రదేశ్ జనాన్ని అవమానించినట్టు లెక్క. అలాంటి పోలికతో తెలుగు చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి, వారి పూర్వీకులు ముఖ్యం కాదని మీరు చెప్పినట్టే,’’ అని రాహుల్ అమెరికాలోని టెక్సస్ స్టేట్ నగరం డాలస్‌లో విద్యార్ధులతో ముచ్చటిస్తూ అన్నారు.
ఈ వార్తను ప్రచురించిన ఈనాడు దినపత్రికలో మాత్రం రాహుల్ ఉచ్చరించిన ఆంధ్రప్రదేశ్ అనే మాట లేకుండా వార్తను ‘అతి జాగ్రత్తగా’ ప్రచురించారు. వరుసగా మూడు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీని తుడిచి తొక్కిపెట్టేసినాగాని…తెలుగు భాష అంటే– ఆంధ్రప్రదేశే ఒక్కటే అనే భావన రాహుల్ గాంధీలో ఎందుకు బలంగా నాటుకుని ఉందో అర్ధంకాని విషయం. తమకు 2014లో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పుడు కేంద్రంలోని ప్రభుత్వాన్ని కాంగ్రెసే కదా నడుపుతున్నది అనే సానుభూతితో పదేళ్ల తర్వాతైనా 2023 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీని గెలిపించిన తెలంగాణ ప్రజలు కూడా తెలుగువారే అనే సోయి లేకుండా మాట్లాడిన రాహుల్ భయ్యాను ఏమనుకోవాలి? (మెరుగుమాల నాంచారయ్య)
Share this Article