మిలియనీర్స్ స్లమ్… సంపన్నుల మురికివాడలు
కొత్తొక వింత పాతొక రోత అని సామెత. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే పాతొక వింత అని సామెతను తిరగరాయలేమో! ఏ దేశమైనా అభివృద్ధి సాధించాక ముందుకే వెళ్తుంది గానీ పాత రోజులు తల్చుకుంటూ ఉంటుందా ? అదీ పేదరికాన్ని అంగట్లో పెట్టి అమ్ముతుందా?
దక్షిణాఫ్రికాలో ‘షాన్ టీ టౌన్’ అనే రిసార్ట్ ఉంది. ఇది బ్లోమ్ ఫాంటేయిన్ అనే చోట అత్యంత విలాసవంతమైన ఏమోల్య ఎస్టేట్ లో ఉంది. ఈ రిసార్ట్ చూడటానికి మురికివాడలా ఉంటుంది. కానీ అన్ని సౌకర్యాలు ఉంటాయి. డబ్బున్న టూరిస్టులకు పేదరికం రుచి చూపించడానికి ఈ మురికివాడ రిసార్ట్ ఏర్పాటు చేశారు. రేకులతో నిర్మించిన గుడిసెల్లాంటి వాటిలో టూరిస్టులు బస చేయాలి. కాకపోతే వైఫై, వేడినీరు, హీటింగ్ సదుపాయాలుంటాయి.
Ads
పేదవాడి కోపం పెదవికి ఎంత చేటైతే మాత్రం ధనికులకు ఇంత కండకావరమా? అని కొందరు కన్నెర్ర చేస్తున్నారు. పేదరికంతో బాధపడుతూ జీవించేవారిని ఈ విధంగా అనుకరించడం వారి కష్టాలని తక్కువ చేసి వెక్కిరించడమేనని మండి పడుతున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం సామాజిక వాస్తవాల్ని కళ్ళ ముందుంచే మంచి ప్రయత్నం చేశామని అంటున్నారు.
ఈ సందర్భంగా నాకు మరో విషయం గుర్తొచ్చింది. ఈమధ్య మా అంకుల్ భండారు శ్రీనివాసరావు అమెరికా వెళ్లారు. జర్నలిస్ట్ కుతూహలం కొద్దీ అక్కడ మురికివాడలు ఉంటే చూడాలని బయలుదేరారు. మనదేశంలో అయితే ఎక్కడపడితే అక్కడ ఉంటాయి. కానీ అమెరికాలో అలా కాదు. ఎక్కడో రోడ్ పైన ఓ పక్కగా గుడారాలు వేసుకుని కనిపిస్తారంతే. అలా వెతుక్కుంటూ వెళ్లిన శ్రీనివాసరావు గారికి ఎక్కడో ఒకచోట ఒక అతను కనిపించాడు.
అతనికి ఆహారం ఇచ్చి మాట్లాడిస్తే… అందరూ తనంత మంచిగా ఉండరని, త్వరగా అక్కడినుంచి వెళ్లిపొమ్మని చెప్పాడట. ధనిక దేశాల్లో పేదరికం కూడా అరుదే. అందుకే వాళ్ళు మన దేశానికొచ్చి స్లమ్ డాగ్ మిలియనీర్ వంటి చిత్రాలు తీస్తూ ఉంటారు. చూస్తుంటే పేదరికానికీ మార్కెట్ బాగానే ఉన్నట్టుంది. ఇంతకూ నిజమైన స్లమ్ డాగ్ మిలియనీర్ ఎవరో! – కె.శోభ
Share this Article