నూతన ఆలోచనలు చేయాలి…. టీటీడీ లడ్డు నాణ్యత విషయంలో, ప్రభుత్వం, దర్యాప్తు కంపెనీల మీద, ఇతరుల మీద, కఠినమైన చర్యలతో పాటు మరో ముఖ్యమైన చర్చ నేడు మనం చేయాల్సిన అవసరం ఉంది.
తమిళ్ నాడు, కర్నాటక, గుజరాతీ రాష్ట్రాల్లోని పాల ఉత్పత్తి, ఆవు పాల నుండి సేకరించిన నెయ్యి ఉత్పత్తిలో, జాతీయ స్థాయిలో మన రాష్ట్రం కూడా పోటీ పడగల శక్తి మన రైతులకు ఉంది .
మన రాష్ట్రంలో 50 లక్షలకు పైగా, పాలు ఉత్పత్తి చేస్తున్న కుటుంబాలు ఉన్నాయి. వారిలో చాలామంది చిన్నకారు రైతు కుటుంబాలు. జాతీయ స్థాయిలో 7.4% పాల ఉత్పత్తి మన రాష్ట్రంలో జరుగుతున్నది. జాతీయ స్థాయిలో తలసరి, రోజుకు పాల ఉత్పత్తి 355 గ్రాములు అయితే, మన రాష్ట్రం లో సగటు ఉత్పత్తి 522 గ్రాములు. అదే కాకుండా, నెయ్యి ఉత్పత్తిలో కూడా మన రాష్ట్రం ముందు వరసలో ఉంది.
Ads
గతంలో మన రాష్ట్రంలో సహకార రంగంలో, “విజయ ఘీ” రాష్ట్రవ్యాప్తంగా ప్రఖ్యాతి గణించడం అందరికీ తెలిసిన విషయం. సహకార రంగంలో పాల ఉత్పత్తి జరిగితే, రైతుల భాగస్వాములుగా ఉండి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారు. ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలో పాల ఉత్పత్తి జరిగితే, లాభనష్టాలను ఆ కంపెనీల యజమానులు చూసుకోని ఉత్పత్తి చేస్తారు.
ఈ రోజు, టీటీడీతో పాటు ఇతర దేవాలయాల్లో లడ్డూల కోసం, నెయ్యి పెద్ద ఎత్తున సేకరిస్తున్నారు. ఈ సేకరణ మన రాష్ట్రంలో రైతులకు అడ్వాన్స్ నగదును ప్రభుత్వం లేదా ఆలయాలు ఇస్తే మన రైతులు పాల ఉత్పత్తులు దేవాలయాలకు ఇవ్వడానికి ముందుకు వస్తారు.
టీటీడీ ఇతర ఆలయాల్లో నేతి సేకరణ కార్యక్రమం వలన మన పాడి పరిశ్రమకు, ఆ పరిశ్రమ మీద ఆధారపడే లక్షలాదిమంది కుటుంబాలకు, లాభం కలిగిస్తుంది. టీటీడీ లడ్డూలకు కావలసినది, ఆవు పాల నుంచి తయారు చేసిన నెయ్యి. అటువంటి నెయ్యి రాయలసీమ ప్రాంతంలో అధికంగా లభిస్తుంది. గిట్టుబాటు ధరను ఇస్తే వారే ఇస్తారు, మన రాష్ట్రం స్వయం సమృద్ధిని మన రైతులు సాధించగలరు.
మన రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న మిగిలిన దేవాలయాల్లో కూడా ప్రభుత్వం రైతులకు చక్కటి ధర ఇచ్చి కొనుగోలు చేయాలి. మన రాష్ట్ర అభివృద్ధికి, పాడి పరిశ్రమే కాకుండా, వ్యవసాయం, వెన్నెముక లాంటివి- ప్రకృతి ఇచ్చిన అటువంటి విలువైన వనరులను సద్వినియోగం చేసుకోవాలి.
వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గడానికి ఒక ముఖ్యమైన కారణం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం. నేడు ప్రకృతి వ్యవసాయం ఆలోచనతో గోఆధారిత ప్రకృతి వ్యవసాయ రైతుల పరస్పర సహకార సంఘం (క్రిష్ణా జిల్లా) ఆధ్వర్యంలో కల్తీ లేని అనేక రకాల వస్తువులు లభిస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఉత్పత్తులను స్వచ్ఛంద సంస్థలు చేయగలిగినప్పుడు ఇంత పెద్ద దేవాలయ వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచిస్తే కచ్చితంగా సాధ్యమవుతుంది.
ఇది రాష్ట్రానికి ఆదాయం అవుతుంది, రైతులు జీవన ప్రమాణాలు పెరుగుతాయి, దేవాలయాల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనం కాపాడుకునే చక్కటి అవకాశం ఉంటుంది, ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి!
ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి
భాజపా, ఆంధ్రప్రదేశ్.
Share this Article