ఒక విభ్రమం, ఒక ఉత్సవం… ‘సావిత్రి సూపర్ క్లాసిక్స్’
…………………………………
నటి సావిత్రి సినిమాలు , జీవితం పై సంజయ్ కిషోర్ తెచ్చిన తాజా పుస్తక పరిచయం ఇది
Ads
………………………………………………..
అవి సావిత్రి సినిమాలకు జనం గోడలు దూకి వెళ్తున్న రోజులు.
1960వ దశకం. ఒక స్వర్ణయుగం.
కాలం సావిత్రి వెంటనడుస్తున్న కాలం అది.
ఒక్క సావిత్రి చూపు, ఒక్క సావిత్రి నవ్వు ఆంధ్రప్రదేశ్ ని, తమిళనాడుని మల్లెల ఊయలలూపుతన్న రోజులవి.
ఆ నాటి వెండితెర భాగ్యదేవత సావిత్రి.
మార్కస్ బార్ట్లే (Marcus Bartley) అనే సినిమాటో గ్రాఫర్ చేస్తున్ మాయాజాలంలో
ఏది వెన్నెలో… ఏది సావిత్రో
తెల్చుకోలేక జనం తికమక పడుతున్నారు. మద్రాసులోని పెద్ద సినీ స్టూడియోలన్నీ సావిత్రికోసం ఎర్రతివాచీలు పరిచి ఉంచిన
కాలం అది!
ఎల్వీ ప్రసాద్, కెవి రెడ్డి, బిఎన్ రెడ్డి, వేదాంతం రాఘవయ్య లాంటి టాప్ క్లాస్ దర్శకులు సావిత్రిని చూసి మురిసిపోతున్న కాలమది. ఎన్టీ రామారావు అయినా అక్కినేని నాగేశ్వరరావు అయినా డబ్బు సంచుల నిర్మాతలయినా, సూర్యకాంతమయినా, ఎస్ వరలక్ష్మి, కన్నాంబ, రేలంగి ఎస్వీరంగారావు అయినా, విజయవాడలో రిక్షావాళ్లయినా, శ్రీకాకుళంలో కూరగాయలమ్మేవాళ్లయినా… అందరి నిరీక్షణ ఒకే ఒక్క అందాల హీరోయిన్ కోసం!
ఎదురు తెన్నులన్నీ సావిత్రి కోసం …
సావిత్రి సినిమా విడుదల కోసం.
***
ఒక ఇన్నోసెంట్ బ్లాక్ అండ్ వైట్ తెలుగు సినీ సామ్రాజ్యాన్ని చిరునవ్వుతో ఏలిన చిత్రాంగి కోసం, మధురవాణి కోసం, లక్ష్మీకోసం, పార్వతి కోసం, ద్రౌపది కోసం, శశిరేఖ కోసం-
ఏం సినిమాలవి! ఏం పాటలవి!
వాటికి ప్రాణం పోసిన సంగీతం ఎలాంటిది!
సుసర్ల దక్షిణామూర్తి, ఎస్ రాజేశ్వరరావు,
మాస్టర్ వేణు, కోదండపాణి, ఘంటసాల,
సి, మోహన్ దాస్…ఎలాంటి బాణీలు కట్టారు.
ఒక జీవిత కాలం వెన్నాడే పాటలు కదా అవి!
వినిపించని రాగాలే… కనిపించని అందాలే
కలలే అలలై… ఆపాటని ఎన్ని సార్లు అయినా వినగలం.
సావిత్రి అభినయాన్ని ఎన్నివందల సార్లయినా చూడగలం!
‘మిస్సమ్మ’ ఎన్నిసార్లు చూసుంటాం?
నలుపు తెలుపు రంగుల్లో కలిపి మాయాబజార్ ఎన్ని సార్లు చూసుంటాం?
గేట్లు దూకెళ్లి, ‘దొంగరాముడు’ చూసిన అనుభవాన్ని మరిచిపోగలమా?
‘దేవదాసు’లో ‘అంతా భ్రాంతియేనా…’ అని పాడుతున్న పార్వతి కళ్లలో నిరాశకీ, వేదనకీ
తల్లడిల్లి ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నామో కదా…
దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు, కీచకుడు, ఘటోత్కచుడు, అర్జునుడు లాంటి మహావీరులకు దీటుగా నిలబడి…
నిర్లక్ష్యంగా డైలాగు చెప్పగల ఒకే ఒక్క నటి కదా సావిత్రి!
“నా భర్తలు, నటులు, జూదరులు” అని ద్రౌపది హేళన చేసి…
నిండుసభలో పాండవుల్ని అవమానించినపుడు,
సినిమా థియేటర్లు ఫెటిఫెటేల్మని పేలిన నాటిచప్పుళ్లు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి కదా!
సావిత్రి అంటే సమ ఉజ్జీ, గొప్ప సమయస్ఫూర్తి.
ఒక స్పెక్టాక్యులర్ స్పాంటేనిటి.
***
‘అరకోడి కూరన్నదీ… రొయ్యపొట్టు చారున్నదీ’ అని అర్ నాగేశ్వరరావు లాంటి జైగాంటిక్ విలన్ని ముగ్గులోకి దింపుతూనే, “ నిన్ను సాగనంప వల్లకాడు దిబ్బున్నది,” అని సావిత్రి అంటేనే
ఆ సీను పండుతుంది.
ఎంత విలనైనా ‘ అవ్వల్ రైట్ ‘అనాల్సిందే!
మాటున్నది… మంచి మాటున్నది- అని కొన్ని తరాలు పాడుకోవాల్సిందే!
***
మనకున్న అనేక మంది పెద్ద హీరోయిన్లలో అత్యంత ప్రమాదకరమయిన నటి సావిత్రి.
ఆ మెరుపు కళ్లతో నవ్వుతుంది.
ఆ వొంపు కెంపు పెదవులతో చూస్తుంది.
ఒక్క మాటతో , ఒక్క విరుపుతో, ఒక్క భావోద్వేగపు విన్యాసంతో- ఏక కాలంలో హీరోని ప్రేక్షకుల్ని కలిపి చంపిపాతేయగల అరుదైన శక్తి స్వరూపిణి సావిత్రి!
ఆమె కృష్ణ శాస్త్రి అక్షరాల్లో పరిమళించిన భావుకత…
తెలుగు వెండితెర మనకి ప్రసాదించిన దేవత.
46 యేళ్ల చిన్నవయసులో, 43 సంవత్సాల క్రితం చనిపోయిన సావిత్రి గురించి ఇపుడెందుకు మాట్లాడుకోవడం?
ఎందుకింత ఆవేశపడటం? కారణం ఉంది. సంజయ్ కిశోర్ అనే తెలుగు సినీ పరిశోధకుడు, సూపర్ స్పెషలిస్టు ఒకాయన ఉన్నాడు. శ్రమకోర్చి, సావిత్రి సినిమాల సకల వివరాలు ఒక చోట చేర్చి “ సావిత్రి క్లాసిక్స్” అనే ఒక అందమైన పుస్తకం తెచ్చారు.
ఎన్నెన్ని విశేషాలో…
ఎన్ని మరుగున పడిన సంగతులో…
ఎంత ఆశ్చర్యపరిచే సమాచారమో!
సంజయ్ కిశోర్ చేసింది చాలా పెద్ద పని.
ఆయన లాంటి ఒక పరిశోధక రాక్షసుడు
మాత్రమే ఈ పనిచేయగలడు.
స్టన్నింగ్ కవర్ పేజీతో, అంతే సమ్మోహమైన 310 పేజీల పుస్తకం తేవడం మాత్రం ఎవరికైనా తలకు మించిన పని!
***
సావిత్రి సినీ జీవితాన్నిసాధికారికంగా రికార్డు చేసిన, దాచుకోదగిన ఈ పుస్తకం ఒక పిక్టోరియల్ వండర్.
మనసు దోచే బ్లాక్ అండ్ వైట్ ఫోటో అల్బమ్. సావిత్రి గురించి ఒకరు చెప్పేదేమిటి?
మనకు తెలియందేమిటి?
అనుకునే వాళ్లు కొందరు ఉంటారు. క్లాసిక్స్ అని 47 మంచి సినిమాలని ఎంపిక చేసి వాటికి సంబంధించిన సమస్త వివరాలు అందించారు. సావిత్రి నటించిన 129 సినిమాల సమాచారం ఇచ్చారు. ఇది కాకుండా ఆమె తమిళలో తొంభై ఐదు చిత్రాలు, హిందీ లో నాలుగు, కన్నడంలో మూడు, మలయాళంలో రెండు సినిమాల్లో నటించారు. ఫోటోలు, వివరాలు సేకరించి, ఒక ఆర్డర్ లో పెట్టి, తప్పులు లేకుండా జాగ్రత్త పడి, ముచ్చటైన లేఅవుట్ చేసి- ఈ పుస్తకం ప్రచురించడానికి సంజయ్ కిశోర్ కి రెండు సంవత్సరాలు పట్టింది. సావిత్రి పాటలు 90 శాతం పాడిన తేనె గొంతు సుశీల ఈ పుస్తకానికి ఆప్యాయంగా ముందుమాట రాశారు.
సంజయ్ కిశోర్ అనే సినిమాపిచ్చోడు గతంలో అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీరంగారావుల సినీజీవితం పై ఎన్నటికీ మర్చిపోలేని రెండు ఛాయాచిత్ర మాలికలు తెచ్చారు.
‘కిమ్స్’ ఆస్పత్రి వ్యవస్థాపకుడు బొల్లినేని కృష్ణయ్య ఈ మంచి పుస్తకాలకు ఆర్థిక సహాయం చేశారు.
***
1950 డిసెంబర్ 29న విడుదలయిన ‘సంసారం’ సావిత్రి తొలిసినిమా. ఎన్టీఆర్, అక్కినేని, రేలంగి, లక్ష్మీరాజ్యం, పుష్పలత, సావిత్రి నటీనటులు. సావిత్రిది అతి చిన్న పాత్ర అయ్యుంటుంది.
1980 మార్చి ఒకటో తేదీన విడుదలయిన
దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘సర్కస్ రాముడు’ ఆమె చివరి సినిమా.
ఎన్టీఆర్ , జయప్రద, సుజాత నటించారు.
చిన్న గెస్ట్ రోల్ లో సావిత్రి.
మహానటి టాప్ టెన్:
1953 దేవదాసు-వేదాంతం రాఘవయ్య
1955 కన్యాశుల్కం- పి పుల్లయ్య
1955 మిస్సమ్య- ఎల్వీ ప్రసాద్
1957 మాయాబజార్- కెవిరెడ్డి
1957 తోడికోడళ్లు- ఆదుర్తి సుబ్బారావు
1959 అప్పుచేసి పప్పుకూడు – ఎల్వీ ప్రసాద్
1962 గుండమ్మ కథ – కమలాకర కామేశ్వరరావు
1963 నర్తనశాల – కమలాకర కామేశ్వరరావు
1964 మూగమనుసలు – ఆదుర్తి సుబ్బారావు
1965 పాండవ వనవాసం – కమలాకర కామేశ్వరరావు
ఈ సినిమాలన్నీ..కెరటాలమీద కదిలే అరటి దొప్పల్లో వెలిగే కార్తీకదీపాల్లా, మన యాంత్రిక జీవితాన్ని కాంతిమయం చేస్తుంటాయి.
***
ఈ విలువైన పుస్తకంలో సావిత్రి సినిమాలని పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు అని విభజించారు.
సావిత్రి మంచి మనసుకి, సంస్కారానికి, బిహేవియర్ కి సంబంధించి ఎంతో ఆసక్తికలిగించే వ్యక్తి గత వివరాలు, సంఘటనలు చాలా ఉన్నాయి ఈ క్లాసిక్స్ లో.
‘దేవదాసు’ కి షావుకారు జానకిని తీసుకోవడం, మిస్సమ్మకి భానుమతిని బుక్ చేయడం… చివరికి ఆ రెండు సినిమాల్లోనూ సావిత్రి హీరోయిన్ కావడం గురించి వివరంగా తెలియచేశారు.
***
ఈ పుస్తకంలో సినిమాటోగ్రాఫర్లని
పట్టించుకోకపోవడం ఒక లోపం. ఇంత పెద్ద పుస్తకంలో మార్కస్ బార్ట్లే గురించి ఒక్క వాక్యం మాత్రమే ఉంది.
సినిమాలకు ఛాయచిత్ర గ్రాహకుల పేర్లను కూడా ఎక్కడా రాయలేదు. దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుల పేర్లు మాత్రమే రాశారు. సుసర్ల దక్షిణామూర్తి లాంటి మహానుభావుని గురించి
ఒక్క పేరా రాస్తే నీ సోమ్మేం పోయింది?
ముందు తరాలకు తెలుగు సినీ చరిత్రని అందించడానికి ఇంతపెద్ద కృషి చేసినపుడు, సావిత్రే ప్రధానం అయినా కొందరు ఇతర ప్రసిద్ధుల వివరాలు కొద్ది మాత్రంగా అయినా ఇవ్వకలిగితే బాగుండేది. లే అవుట్, డిజైనింగ్ వల్ల 300 పేజీల్లో చాలా స్పేస్ మిగిలి ఉంది, ‘ఇతరుల’ కోసం ఆ స్పేస్ లో కొంత భాగాన్ని వాడినా మరింత నిండుదనం వచ్చేది. అలాగే భాషకు సంబంధించి, ప్రతిసారీ శ్రీమతి సావిత్రి, శ్రీ ఎన్టీ రామారావు అనక్కర్లేదు. 2024లో వచ్చిన పుస్తకంలో సావిత్రి కాలం నాటి పాత తెలుగు డిక్షన్ వాడటం సరికాదు. ఆ పురాతన తెలుగు వల్ల వాక్యాల్లో బిగువు సడలిపోయింది. సంఘటనలు, సినిమాలు ముఖ్యం గనక అలాంటి లోపాలు సహజంగానే మరుగున పడిపోతాయి.
***
సినీ నిర్మాణ రంగం ఒక భారీ పరిశ్రమగా మారినందువల్ల దాని విస్తృతి, ప్రభావశీలతను చూసినపుడు- ఆ గ్లామర్ ఫీల్డ్ గురించి మరిన్ని పుస్తకాలు రావలసిన అవసరం ఉంది. ఎవరో కొద్ది మంది హీరోలు, హీరోయిన్ల గురించి మాత్రమే కాకుండా, 24 విభాగాల్లో ప్రతిభా సంపన్నులయిన వాళ్ల గురించి ఫోటోలతో ఇంటరెస్టింగ్ డిటైల్స్ తో మరిన్ని బుక్స్ రావాలి. అలాగే నటీనటుల మీద, సాంకేతిక నిపుణుల మీద చక్కని డాక్యుమెంటరీలు ఎందుకు తీయరో అర్థం కాదు…
సత్యజిత్ రే లాంటి అతి కొద్దిమంది మహనీయుల మీద మాత్రమే గొప్ప డాక్యుమెంటరీలు ఉన్నాయి. బయోపిక్స్ తీయడం భారీ ఖర్చుతో కూడిన కమర్షియల్ బిజినెస్ కనుక… సినిమాకి జీవితాన్ని అంకితం చేసిన కళాకారులు గురించి డాక్యుమెంటరీలు తీసి భద్రపర్చాల్సిన అవసరం ఉంది.
వందల కోట్లతో సినిమాలు తీయడం, వేలకోట్ల టర్నోవర్ అంటూ మీసాలు మెలేయడం కాదు, మన అపూరూపమయిన కళా చరిత్రని కొన్ని లక్షల ఖర్చుతో రికార్డు చేయాలన్న ఆలోచన పెద్దలెవరికీ రాకపోవడం అతి పెద్ద విషాదం.
మనవన్నీ వ్యాపార లెక్కలు. తెలుగులో ఒక్క సావిత్రి మీద మాత్రమే ‘మహానటి’ బయోపిక్ వచ్చింది. అది ఇష్టంతోనే ప్రేమతోనే తీసినా కమర్షియల్ గా వర్కవుట్ అవుతుంది గనకే తీయడానికి సాహసించారు. అంజలి, జమున, విజయనిర్మల, కృష్ణ కుమారి, భానుమతి లాంటి మంచి హీరోయిన్లు, ఎస్ వరలక్ష్మీ, రావు బాల సరస్వతీ దేవి, జిక్కి, సుశీల, ఎస్ జానకి, ఎల్ ఆర్ ఈశ్వరి లాంటి టాలెంటెడ్ సింగర్లు మనకి ఎంతో మంది ఉన్నారు.
సంజయ్ కిశోర్ లాగా ముందుతరాల కోసం ఏమన్నా చేయాలన్న సంకల్పం, పట్టుదల మనవాళ్లకు ఏకోశానా లేవు.
ఈ మాటల్ని ఎవరూ పట్టించుకోరనీ, ఇది అరణ్యరోదనే అని తెలుసు. అయినా, దిగులుపడకుండా, బెంగపడకుండా ఉండలేం కదా! “ఆశా నిరాశేనా”…… – తాడి ప్రకాష్. 9704541559
https://telangana.thefederal.com/…/savitri-classics…
Share this Article