హఠాత్తుగా కారు ఊగుతోంది… అటూ ఇటూ లాగుతూ, అదుపు తప్పుతోంది… కారు ఆగింది, అందులో నుంచి ఒకావిడ దిగింది… బహుశా నలభై ఉంటాయేమో…
దిగి చూసింది, ఒక టైర్ పంక్చర్… స్టెపినీ ఉంది, కానీ తనకు వేయడం రాదు, ఆమెకు అదంత సులభమూ కాదు… అటూఇటూ చూస్తోంది… ఎవరైనా సాయం చేస్తారేమోనని… ఒక్కరూ ఆగడం లేదు… చేయి ఊపుతోంది…
ఎవరి వేగం వాళ్లది… ఎవరి టైమ్ వాళ్లది… రోడ్డు పక్కన ఆగిన కారు, చేతులూపుతూ అభ్యర్థిస్తున్న ఓ మహిళ… ఐనా సరే, ఎవరూ ముందుకు రావడం లేదు… సమయం గడుస్తోంది… సాయంత్రమైంది… నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి…
Ads
ఆమెలో ఆందోళన పెరుగుతోంది… ఒక్కతే… తోడెవరూ లేరు… దగ్గరలో ఇళ్లు కూడా కనిపించడం లేదు… సిగ్నల్స్ లేవు, మొబైల్ మూగబోయింది… మరెలా..? గంటసేపు దాటింది… భయం మొదలైంది… తోడుగా చలి… ఒక బైక్ తనను దాటేసి స్పీడ్‌గా ముందుకెళ్లింది…
బైక్ మళ్లీ వెనక్కి వచ్చింది… తను బైక్ దిగి ఆమె వద్దకు వస్తున్నాడు… ఆమెలో మరో భయం… తనొక్కతే… అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకుంటున్నాడేమో… ఏం చేస్తాడు..? ఏం చేయాలి తను..?
ఆమెలోని భయాన్ని అతను గ్రహించాడు… చిరునవ్వాడు… కారు వైపు చూశాడు… కారు పంక్చర్ తెలుస్తూనే ఉంది…
‘నా పేరు బ్రియాన్, భయమక్కర్లేదు, సాయం చేస్తాను, స్టెపినీ ఉందా’ అనడిగాడు… భయంభయంగానే ఉందన్నట్టుగా తలూపింది…
‘నేను దగ్గరలోని మెకానిక్ షాపులో పనిచేస్తాను, నేను స్టెపినీ మారుస్తాను, కారులో కూర్చొండి’ అంటూ ఢిక్కీ తెరిచి, తనకు అవసరమైన పరికరాలు తీసుకుని, పనిలో మునిగిపోయాడు… మెకానిక్ కదా, అలవోకగా, వేగంగా టైర్ మార్చేశాడు… తారు రోడ్డు గీచుకుని చేతులకు రక్తపు గీతలు కనిపిస్తున్నాయి…
వెళ్లండి, ఇక పర్లేదు అన్నాడు… ఆమె డబ్బు ఇవ్వబోయింది, వద్దన్నాడు… ‘వద్దనకండి, మీరు సాయం చేయకపోతే ఏమయ్యేదో..’ అందామె… మరోసారి చిరునవ్వాడు… ‘నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సాయం చేస్తారు, మీరూ ఎవరికైనా సాయం చేయాలనిపిస్తే, ఎవరైనా కష్టాల్లో ఉంటే సాయం చేయండి, ఆ సాయం చేసినప్పుడు నన్నోసారి తలుచుకొండి, ఆ పుణ్యం నాకే’ అని బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు…
హమ్మయ్య, థాంక్ గాడ్, గట్టెక్కించావు అనుకుంటూ కారు స్టార్ట్ చేసి, నడుపుకుంటూ వెళ్తోంది… అకస్మాత్తుగా ఆకలేస్తోంది… తను వెళ్లాల్సిన దూరం ఇంకా ఉంది… రోడ్డు పక్కన ఓ చిన్న హోటల్ కనిపించింది… ఏదో ఒకటి కడుపులో పడాలి… కారు ఆపిందామె…
ఓ మహిళ కస్టమర్లకు సర్వ్ చేస్తోంది… గర్భిణి… నీరసంగానే కనిపిస్తోంది… వర్కర్స్ వేరే ఉన్నట్టు లేదు… బరువుగా నడుస్తూనే అన్ని పనులూ చేస్తోంది… ఆర్డర్ తీసుకోవడం, సర్వ్ చేయడం, బిల్ తీసుకోవడం, తిరిగి చిల్లర ఇవ్వడం… కానీ ఆమె మొహం ప్రశాంతంగా ఉంది… తను కూర్చున్న టేబుల్ వద్దకు వచ్చింది, ఏం కావాలమ్మా అనడిగింది…
భోజనం ఉందా అనడిగింది తను… ఉంది, సర్వ్ చేస్తాను, చేతులు కడుక్కుని రండి అన్నదామె… ఆకలిగా ఉంది, ఆమె పెట్టింది రుచిగానే ఉంది… కడుపు నిండింది, 1000 రూపాయల నోటు ఇచ్చింది, ఆమె చిల్లర తేవడానికి వెళ్లింది… తిరిగి వచ్చేసరికి తను కనిపించలేదు… గ్లాసు కింద ఓ కాగితం ఉంది… దాంతోపాటు నాలుగు 1000 నోట్లు కూడా…
అందులో ఇలా ఉంది… “చిరునవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టుగా తేటగా ఉంది… నువ్వు నిండు నెలలతో కూడా పని చేస్తున్నావు అంటే … నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది… నాకు ఒక మిత్రుడు సహాయపడినట్టే అతడిని తలచుకుంటూ … తను చెప్పినట్టుగానే నేను నీకు సాయపడుతున్నాను… నువ్వూ ఇలాగే ఇతరులకు సహాయపడు…”
హోటల్ మూసేశాక ఇంటికి వచ్చింది… అప్పుడే ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది… గీసుకు పోయిన చేతులు రక్తపు చారలతో ఉంది… అతడి పక్కన మంచం మీదకు చేరుతూ …
“మనం దిగులుపడుతున్నాం కదా … డెలివరీకి డబ్బులెలాగా అని… ఇక ఆ బెంగ తీరిపోయిందిలే, బ్రియాన్! భగవంతుడే మనకు సాయం చేశాడు…
ఆయనకి కృతజ్ఞతలు” అంది ప్రశాంతంగా… లేటయ్యిందేం అనీ అడిగింది… త్వరగానే బయల్దేరాను, రోడ్డు పక్కన ఓ మహిళ కారు ఆగిపోయి ఉంటే, దానికి స్టెపినీ వేసి వచ్చేసరికి లేటయ్యింది అన్నాడు తను…
సాయం రకరకాలు… మనం చేసే సాయం ఏదో ఓ రూపంలో తిరిగి మననే చేరుతుంది… (యండమూరి వీరేంద్రనాథ్)
Share this Article