ఏమాత్రం సందేహం, సంకోచం అక్కర్లేదు ఈ మాట అనడానికి…! కొండా సురేఖ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు పరమ వికారంగా, ఏవగింపు కలిగించేలా ఉన్నాయి… ఒక సగటు సోషల్ మీడియా ట్రోలర్ స్థాయిలో ఉన్నాయి… తెలంగాణ రాజకీయాలు చివరకు ఇంత వెగటు, కంపు వాసన కొడుతున్నాయనే నిజం కలవరపెడుతోంది కూడా… ఈ స్థాయి ఒక గగుర్పాటు..!!
ఎస్, కొండా సురేఖ మీద చాలా నీచమైన స్థాయిలో ట్రోలింగ్ సాగింది… తెలంగాణ రాజకీయాల్లో ఆ క్షుద్ర, సోషల్ మంత్రగాళ్లను ఉసిగొల్పేదెవరో, ఎన్నిరకాల ట్రోల్ బలగాల్ని పోషిస్తున్నారో అందరికీ తెలుసు… అదొక మూసీ మురికి ప్రవాహం… సురేఖ కన్నీళ్లు పెట్టుకుంది, మీడియా ఎదుట తన ఆవేదనను వెళ్లగక్కింది… నిజం, ఆమె బాధలో అర్థముంది…
హరీష్ రావు ఈ ధోరణిని ఖండిస్తున్నాను అన్నాడు… ఎందుకు..? ఆమె చూపించిన ట్రోలర్ల ఖాతాలకు హరీష్ రావు ప్రొఫైల్ పిక్స్ ఉన్నాయట… తనే చేయిస్తున్నాడనే సంకేతాలు జనంలోకి వెళ్తాయని అనుకుని ఖండించాడు… కానీ కేటీయార్ ఆమాత్రం స్పందన కూడా కనబర్చలేదు… పైగా దొంగ ఏడుపులు, పెడబొబ్బలు అని ఎద్దేవా చేశాడు… అదీ అభ్యంతరకరమే… మొరటుతనం… పరోక్షంగా ఆమెపై ట్రోలింగుకు ఓ నీచ సమర్థన… దీంతో ఇక ఆమె కేటీయార్ మీద ఈ విమర్శల దాడికి దిగింది…
Ads
తను హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయించి, వాళ్లను బెదిరించి, వాడుకుని, డ్రగ్స్ అలవాటు చేయించేవాడనే ఓ తీవ్ర విమర్శ చేసింది… చివరకు చైతన్య, సమంత విడాకులకు కూడా ఈ కేటీయార్ పోకడే కారణమని ఆరోపించింది… సురేఖకు కడుపు మండితే కేటీయార్ మీద విమర్శ చేస్తే వోకే… కానీ దానికి కొన్ని పరిమితులుంటాయి, సంస్కారపరమైన హద్దులుంటాయి… అవీ దాటేసింది… అన్నింటికీ మించి సమంతను బజారుకు లాగడం దేనికి..? సురేఖ తాజా వ్యాఖ్యల వెనుక ఏ రాజకీయ కారణాలు, వ్యూహాలున్నా సరే, అవేవీ సమర్థనీయం కాదు…
ఒకవేళ సురేఖ చెప్పిందే నిజమైతే… సమంత బాధితురాలు కదా, మళ్లీ బజారుకు లాగి, రచ్చ చేసి, బదనాం చేసి… కుళ్లబొడవడం కాదా ఇది..? ఇదెలా సమంజసం..? పైగా ఓ మహిళా మంత్రి తను… ప్రతి మాట ఎంత సెన్సిబుల్‌గా ఉండాలి, ఎంత సెన్సిటివ్ మ్యాటర్ ఇది..? సమంత చెప్పింది అక్షరాలా నిజం… మంచి భాషలో స్పందించింది… మహిళను వస్తువుగా మాత్రమే చూసే ఇండస్ట్రీలో నిలబడటానికి, నిలదొక్కుకోవడానికి ఎంత పోరాటం చేయాలో, ఎంత కష్టమో అందరికీ తెలిసిందే… కేటీయార్ మీద కోపముంటే, నడుమ ఈమెను బజారులో నిలబెట్టడం ఏమిటి..? తప్పే, ఈ తప్పుకు ఏ కారణాలు చెప్పినా సరే అది సమర్థన కాదు, కాలేదు…
ఒకటి… నిజంగానే సురేఖ మీద ట్రోలింగ్ చాలా నీచమైన స్థాయిలో సాగింది… బట్, ఆమె ప్రభుత్వంలో ఉంది… ట్రోలర్లను శిక్షించలేదా ఈ ప్రభుత్వం..? అంత చేవచచ్చిపోయి ఉందా..? చేత కాదా..? రెండు… ఒకవేళ కేటీయార్‌ను టార్గెట్ చేయాలనుకుంటే తన మీదే ఫోకస్ చేయాలి, అంతే తప్ప పాపం, సమంతల్ని లాగడాన్ని ఏమనాలి..? కేటీయార్ మరీ అరాచకాలకు పాల్పడి ఉంటే, ఫోన్ ట్యాపింగ్ మీద ఎలాగూ విచారణ సాగుతోంది కదా… తనను ఫిక్స్ చేసిందెక్కడ..? దర్యాప్తు ఎందుకు ఆగిపోయింది..? ఈ వైఫల్యానికి సమంతల్ని బలిచేస్తే ఎలా..? మేము ఫలానా కేటీయార్ కారణంగా ఇలా మోసపోయాం అని ఎవరైనా కంప్లయింట్ చేశారా..? మరెందుకు ఈ వాచాలత..?
ఎప్పుడూ ఇలాంటి సందర్భాల్లో కూడా బయటికి రాని అక్కినేని అమల తొలిసారి మీడియా తెర మీదకు వచ్చింది… బీఆర్ఎస్ వాళ్లే కాదు, తటస్థులు, సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా సురేఖ ధోరణిని ఏకిపారేస్తున్నారు… సోషల్ మీడియా అయితే ఇక చెప్పక్కర్లేదు… చివరకు కాంగ్రెస్ ప్రభుత్వ సమర్థకులు కూడా..!! అవునూ, ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ స్పందన ఏమిటి..? సురేఖను సమర్థిస్తుందా..? అబ్బే, ప్రజెంట్ రాజకీయాల్లో ఈ బురద మామూలే అని మౌనంగా ఉంటుందా..?! పోనీ, ఆమె చెబుతున్నది వాజీబే అనుకుంటే కేటీయార్ మీద ఈ కోణంలోనూ విచారణ సాగిస్తుందా ఈ ప్రభుత్వం..?!
Update… :: సమంతకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పినట్టు ట్వీట్లు కనిపించాయి… కానీ అది ఆమె అఫిషియల్ అకౌంట్‌గా కనిపించలేదు…
Share this Article