.
ధర్మం శరణం గచ్ఛామి! కుహనా లౌక్యం
ఏమైతుందంటే! తిరుపతి లడ్డూ వ్యవహారంలో సుప్రీం కోర్టు ఇలా అన్నది, అలా చీవాట్లు పెట్టింది అంటూ ఎవరికి ఎలా నచ్చితే, అలా అన్వయించుకుంటున్నారు! ఆ మాటలు ఫలానా వాళ్లకు ప్రతికూలం, ఇంకొకళ్లకు అనుకూలం అని ఎవరికి తోచిన వివరణలు వాళ్లు ఇచ్చేస్తున్నారు!
Ads
వాళ్లకు నచ్చిన రాజకీయ నాయకులకు ఒకరకంగా, నచ్చని వాళ్లకు మరొక రకంగా కోర్టు పరిశీలనలను ఆపాదిస్తున్నారు! కానీ, ఒకటి మాత్రం నిజం! ఈ కేసులో ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ సుబ్రమణ్యస్వామి సైతం ఇన్వాల్వయి ఉన్నాడని మరవద్దు! న్యాయపరంగా తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో ఆయన రాజకీయాలకు అతీతంగా అక్రమార్కుల తిత్తి తీయడం ఖాయం! అత్యున్నత న్యాయస్థానం మొన్నటి ఆదేశాల్లో స్వామీ ఆధిపత్యం, పైచేయి కొట్టొచ్చినట్లు కనిపించాయి!
ఐతే, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు పునాది లాంటి సనాతనధర్మాన్ని అకారణంగా వదిలేసి రాసుకున్న లౌకిక రాజ్యాంగం అన్నిటికీ మూలం! ఆ రాజ్యాంగబద్ధ సంస్థలు కచ్చితంగా అలాగే ఉంటాయి, అందుకు తగ్గట్టుగానే పని చేస్తాయి! ప్రస్తుత వ్యవస్థలో లౌక్యంగా వ్యవహరించడం వాటి విధి!
గాంధీ, నెహ్రూ లాంటి నేతలు అనుసరించి మనకు నేర్పిన కుహనా ప్రజాస్వామ్య రాజకీయాలనే ఈనాటికీ మనం అనుసరిస్తున్నాం! అందుకే, ఇవాళ హైందవ సమాజంలోని వ్యక్తుల మనస్తత్వాలు వాస్తవాలను మరచి, వాటిపై పోగయ్యే గబ్బు రాజకీయ రాశిని పట్టుకొని వేలాడుతున్నాయి! ఇది శోచనీయమే కాదు గర్హనీయం కూడా!
కానీ, విచక్షణ కలిగిన వ్యక్తులుగా, రాజకీయాలకు అతీతంగా జరిగిన తప్పును గుర్తించడం ధర్మం! అందుకనుగుణంగా స్పందించడం కర్తవ్యం! ఆ తరవాతే రాజకీయాలైనా, నచ్చిన వాళ్లకు సమర్థింపుల చదివింపులైనా అన్నట్లు ఉండాలి వ్యవహారం! దురదృష్టవశాత్తు పరిస్థితి అలా లేదు! అసలు నిజాన్ని తొక్కిపెట్టి, దాని చుట్టూ కొసరు విషయాలను అల్లుతూ జనం దృష్టి మళ్లించే రాజకీయ పార్టీలు, నేతల కుట్రలు సఫలం ఔతున్నాయి!
ప్రజలు కూడా ధర్మాధర్మ విచక్షణ కోల్పోయి వాళ్ల మాటల ఒరవడిలో కొట్టుకుపోతున్నారు! వాళ్లకు నచ్చిన రాజకీయ నేతలే దేవుళ్లన్నట్లు అమితమైన భక్తి ప్రపత్తులను ప్రదర్శిస్తున్నారు! ఇంకా పచ్చిగా చెప్పాలంటే, ఫక్తు గొఱ్ఱెల్లా ఆ ట్రాప్ లో పడిపోతున్నారు! ఇది ముమ్మాటికీ కుహనా లౌక్యమే! అలా కాకుండా, ధర్మం వైపు వెళ్లడమే సమంజసం, సర్వదా ఆచరణీయం! హెన్స్, మై డియర్ ఫ్రెండ్స్, మన అప్రోచ్ ఆల్వేస్ ధర్మం శరణం గచ్ఛామి అన్నట్లే ఉండాలి! …… [ సూరజ్ వి. భరద్వాజ్ ]
Share this Article