నిన్న శ్రీమాన్ చంద్రబాబు గారు ఎక్కడో సెలవిచ్చారు కదా… తిరుమలలో వీఐపీ కల్చర్ తగ్గాలి అని..! తను పరిపాలించిన రోజుల్లో ఇదెందుకు గుర్తుకురాలేదో అడగొద్దు సరే… లడ్డూ వివాదం మొదలయ్యాకే ఈ వీఐపీల హడావుడి బెడద వంటి దుర్వాసనలు కనిపిస్తున్నాయి సారు గారికి…
డిప్యూటీ సీఎం గారేమో సనాతన ధర్మం అంటూ మొదలెట్టాడు… తన పొలిటికల్ కెరీర్ మొదట్లో సెక్యులర్ డైలాగులు బాగా కొట్టేవాడు, అది వేరే సంగతి… సరే, తిరుమల విషయానికే వస్తే చంద్రబాబు పాలన కాలంలోనే కొండ మీద వీఐపీ కల్చర్ మొదలైందని చెబుతారు… అనేక స్వార్థ సమీకరణాలతో రాజకీయ నాయకులను, వ్యాపారులను పాలకమండలిలోకి తీసుకోవడం కూడా తన హయాంలోనే బాగా పెరిగింది…
సరే, జగన్ అనేకానేక మందితో నింపాలని అనుకున్నాడు… భూమన, వైవీ, ధర్మారెడ్డి… తిరుమలను ఇష్టారాజ్యంగా, తమ రాజ్యంగా పాలించారు… పైకి కనిపిస్తున్నది కేవలం జంతు కొవ్వు నూనెల కల్తీ నెయ్యి మాత్రమే… తిరుమల అంటే కేవలం లడ్డూ మాత్రమే కాదు కదా… చంద్రబాబుకు ఇప్పుడు అకస్మాత్తుగా తిరుమల పవిత్రత గుర్తొచ్చి ఉద్దరిస్తాను అంటున్నాడు కదా…
Ads
ఫస్ట్ చేయాల్సిన పని… తిరుమలలో మీడియా కెమెరాలను అనుమతించకూడదు… ప్రతి అడ్డమైనవాడూ దర్శనం కాగానే బయటికొచ్చి మీడియా ముందు ఏవేవే అంశాల్ని వాగుతున్నారు… దేవుడి దగ్గర కూడా పొలిటికల్ వాగుళ్ల దుర్వాసనలే… మీడియా పాయింట్‌ను అర్జెంటుగా ఎత్తిపారేసి, ఒకవేళ ఎవరైనా దొంగచాటుగా చిత్రీకరింపజేసుకుని సోషల్ మీడియాలో, మీడియాలో గనుక వచ్చేలా చేసుకుంటే, వాళ్లను తిరుమలలో ప్రవేశం లేకుండా కొన్నాళ్లు నిషేధం పెట్టాలి…
ప్రముఖులు వస్తే వాళ్లకు ఆశీర్వచనాలు ఇస్తున్న ఫోటోలను దేవస్థానమే ఎందుకు మీడియాకు ఇవ్వాలి… అసలు దేవుడి ఎదుట ప్రముఖులు ఎవరు..? సామాన్యులు ఎవరు..? వాళ్లు వచ్చారని ప్రచారం చేస్తే దేవుడికి విలువ పెరుగుతుందా..? ప్రత్యేకించి జడ్జిల ఫోటోలు… బోర్డును రాజకీయ పునరావాసం కింద మార్చేశారు కదా, ముందు అది మార్చాలి…
ఏ మత సంస్థల్లో ఆ మతస్తులే పనిచేసేలా చట్టం తీసుకొస్తాను అన్నాడు మొన్నామధ్య… నిజంగా ఆ సంకల్పం ఉంటే దాన్ని అమలు చేయాలి… తిరుమలలో అన్యమతస్తుల బెడదే అసలు సమస్య… చంద్రబాబు చేయగలడా..? స్వామి వారి ఆస్తులు, సంపాదన, కంట్రాక్టులు, కొనుగోళ్లు, అర్చన పద్ధతులు, కొండ మీద ఆధ్యాత్మిక వాతావరణం విషయంలో కీలక నిర్ణయాల్ని వెలువరించేలా ఓ ధార్మిక బోర్డును పెట్టగలడా..?
అసలు తిరుమలను రాజకీయ కబంధ హస్తాల నుంచి మొత్తంగా తప్పించేంత సాహసం తను కలలో కూడా చేయడు గానీ… బోర్డులో రాజకీయ నాయకులు గాకుండా… దేవుడి మీద భక్తి ఉన్నవాళ్లను వేయగలడా..? తమ సంపాదనలో అధిక భాగాన్ని సొసైటీకి తిరిగి వెచ్చిస్తున్న బోలెడు మంది ఉన్నారు… ధర్మవర్తనులు… వాళ్లతో పాలకమండలిని వేస్తే సగం దరిద్రం వదులుతుంది… ఎలాగూ ఏపీ సర్వీస్ ఉన్నతాధికారుల్నే వేస్తారు కాబట్టి ఏపీ సర్కారు పెత్తనానికి వచ్చిన ఢోకా కూడా ఏమీ ఉండదు…
ఆర్జిత సేవల్ని సరళీకరించడం, సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం వంటివే కాదు… అసలు ప్రోటోకాల్ దర్శనాల్నే ఎత్తేస్తే… అప్పుడు కొండ మీద ఆధ్యాత్మిక వాతావరణం ఖచ్చితంగా ఏర్పడుతుంది… ఎటొచ్చీ… చంద్రబాబు మాటలే తప్ప వీఐపీ కల్చర్ తగ్గించే దిశలో ఏమీ చేయడు… తన క్రెడిబులిటీ అది..!!
Share this Article