శ్యాం బెనగల్ సినిమా ఎలా ఉండాలో అలాగే ఉంటుంది ఈ సూపర్ ఫ్లాప్ సినిమా . అయిననూ చూడవలె . వాణిశ్రీ నట విరాటరూపాన్ని ఆవిష్కరించిన సినిమా . నట విరాట రూపమంటే పేజీల పేజీల డైలాగులు చెప్పి , గంటలు గంటలు ఏడుస్తూనో ఎగురుతూనో నటించటం మాత్రమే కాదు . డైలాగులు ఎక్కువ లేకపోయినా , అటూఇటూ ఎగురకుండా కళ్ళతో , పెదాలతో , మొహంతో నటించటాన్ని నట విరాటరూపం అంటారు , అనాలి .
ఈ సినిమా సమయానికి వాణిశ్రీ పెద్ద స్టార్ . సావిత్రి తర్వాత అంతటిి స్టార్‌డమ్ ఎంజాయ్ చేసిన నటి వాణిశ్రీ . అంతటి మహానటి ఈ అనుగ్రహం సినిమాలో భర్త బలవంతంగా ఆక్రమించుకునే సీన్లో శ్యాం బెనగల్ మోడల్లో నటించటం చాలా గొప్ప విషయం . బహుశా అనుగ్రహం వంటి ఓ ఆర్ట్ ఫిలింలో , శ్యాం బెనగల్ దర్శకత్వంలో నటించాలన్న కోరిక మేరకు నటించి ఉండాలి . ఆకాంక్ష ఏదయినా వాణిశ్రీ నటన సూపర్బ్ . మేకప్ లేకుండా , డైలాగులు తక్కువగా ఉన్నా ఎఫెక్టివ్ గా నటించిన వాణిశ్రీకి హేట్సాఫ్ .
Ads
1978 జూన్‌లో విడుదలయిన ఈ సినిమా ఏ పీరియడుకి సంబంధించిందో దర్శకుడు చెప్పలేదు . బహుశా ఓ వంద సంవత్సరాల కింద కధ అయిఉండాలి . ఉత్తరాంధ్ర లోని విజయనగరం , శ్రీకాకుళం ప్రాంతానికి సంబంధించినది అయిఉండాలి . సినిమాలో అనంత్ నాగ్ అన్న ఎవరో ఒక ధనికుడు విజయనగరం నుండి వచ్చి చాలాసేపు వేచి వెళ్ళిపోయారని అంటాడు . ఆ దేవిడి , ప్రజల కట్టు బొట్టు వగైరా ఉత్తరాంధ్ర లోని ఏదో మారుమూల గ్రామం అయిఉండాలి . అయితే ఆ దేవాలయం , పరిసర ప్రాంతం చాలా బాగుంటుంది . సినిమా కధకు కరెక్టుగా మేచ్ అవుతుంది .
మరాఠీ భాషలో ప్రముఖ రచయిత చింతామణి త్రయంబక్ ఖానోల్కర్ వ్రాసిన కొండురా అనే నవల ఆధారంగా శ్యాం బెనగల్ , గిరీష్ కర్నాడ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే తయారు చేసుకున్నారు . ఆరుద్ర డైలాగులను వ్రాసారు . హిందీ , తెలుగు భాషల్లో ఒకేసారి తీసారు . నిర్మాత కె వెంకటరామిరెడ్డి .
ప్రధాన పాత్రల్లో నటించిన అనంతనాగ్ , స్మితాపాటిల్ , వాణిశ్రీలు రెండు భాషల్లోనూ నటించారు . భైరవమూర్తి పాత్రధారి రావు గోపాలరావు తెలుగులో మాత్రమే నటించారు . వాణిశ్రీ తర్వాత నటన పరంగా మెచ్చుకోవలసింది ఈ ముగ్గురినే . చాలా బాగా నటించారు . వీరు నలుగురు కాకుండా మనకు బాగా తెలిసిన వారు నిర్మలమ్మ , ఝాన్సీ . వీరిద్దరికీ ఇలాంటి సపోర్టింగ్ పాత్రలు కొట్టిన పిండే . తెలుగు సినీ రంగంలో ఝాన్సీ గుర్తింపు రాని గొప్ప నటి . ఆమె గొప్ప నటనను శంకరాభరణం వంటి సినిమాలలో కూడా చూడవచ్చు . ఇంకా మరెంతో మంది జూనియర్ ఆర్టిస్టులు , ఇతర భాషా నటులు నటించారు .
షూటింగ్ కూడా ఉత్తరాంధ్రలోనే జరిగినట్లు ఉంది . ఆ ప్రాంతం అధికారులకు , ఆర్టిస్టులకు టైటిల్సులో ధన్యవాదాలు చెప్పారు . పంచదార్ల భజన మండలి వారి పేరు కూడా టైటిల్సులో వేసారు . బహుశా ఈ భజన మండలి ఆ ప్రాంతానిది అయిఉండాలి .
వన్రాజ్ భాటియా సంగీత దర్శకత్వంలో ఆరుద్ర వ్రాసిన పాటల్ని సుశీలమ్మ , బాల సుబ్రమణ్యం పాడారు . సీతను కోరెను రావణ హస్తము పాట బాగుంటుంది . మిగిలిన పాటలు ఇది వరమో శాపమో పుణ్యఫలమో , ఓయమ్మ ఇది నీ శ్రీమంతము , ఎవ్వరో మ్రోగించిరి గుడిలో గంట , ఇది చెయ్యని తప్పుల శిక్ష కూడా థియేటర్లో బాగుంటాయి .
వాణిశ్రీ అభిమానులు చూసి ఉండకపోతే అర్జెంటుగా చూసేయండి . ఆఫ్ బీట్ సినిమాలను , ఆర్ట్ ఫిలింలను మెచ్చేవారు అయితే తప్పక చూడండి . అలా కాని వారయితే చూడకండి . వారికి నచ్చదు . నేను థియేటర్లో చూడలేదు కానీ టివిలో చూసాను . యూట్యూబులో ఉంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు………… (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
కొన్నాళ్ల క్రితం ఇదే సినిమాకు సంబంధించిన ఇతర విశేషాలతో ముచ్చట పబ్లిష్ చేసిన కథనం లింక్ ఇదుగో…
స్మితా పాటిల్, వాణిశ్రీ కలిసి నటించిన విశేషం… ఆరుద్ర, శ్రీశ్రీల నడుమ మంట…
Share this Article