ఆఫ్టరాల్ ప్రేక్షకులు…
మీకు మాట్లాడే హక్కెక్కడిదిరా!
ఒక్కొక్కడికి ఎముకలు విరగ్గొడతా!
నిజమే కదా!
ఆ వినిర్మాత అన్నదాంట్లో తప్పేముంది?
ఈ భూప్రపంచంలో సామాన్యులకు సినిమా తప్ప ఇంకేదీ వినోదం కానప్పుడు, లేనప్పుడు ఒక సినిమాకు ఒక కుటుంబానికి ముష్టి పదిహేను వందల రూపాయలు పెట్టలేరా?
Ads
ప్రభుత్వాలే బెనిఫిట్ ఆఫ్ వినోదం కింద బెనిఫిట్ షోలకు సూర్యుడు లేవకముందే తెరలేపడానికి ప్రత్యేక జి ఓ లు జారీ చేసి అనుమతులిస్తున్నప్పుడు-
మొదటి వారం, మొదటి పదిరోజుల్లో రెండింతలు, మూడింతలు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పరమ ఉదారంగా ప్రత్యేక జి ఓ లు ఇస్తున్నప్పుడు-
ఈ వినిర్మాత చాలా పొదుపుగా పదిహేను వందలు అన్నాడు కానీ…అది పదిహేను వేలయినా తక్కువే!
తెలుగు పలకని హీరోయిన్ కే పది కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి…
తెలుగు వచ్చినా పలకని హీరోకు యాభై కోట్లు ఇచ్చి…
చిన్న పిల్లలు స్మార్ట్ ఫోన్లో చేసే గ్రాఫిక్స్ కే డెబ్బయ్ అయిదు కోట్లు ఇచ్చి…
హీరోకు ఒక ఏరియా సినిమా రైట్స్ ఇచ్చి…
నానా చావులు చచ్చి సినిమా తీస్తే…
సినిమాలో కథ లేదంటారా?
ఎనభైల్లో కాటికి కాళ్లు చాచిన హీరో పక్కన ఆయన మనవరాలికంటే చిన్నవయసు చిన్నది హీరో ఇన్ గా ఉండకూడదంటారా?
తెలుగు పాటల్లో ఇంగ్లీషు సాహిత్యం ఉండకూడదంటారా?
తెలుగు పాటలు తమిళమయం చేయకూడదంటారా?
మనకు తెలిసిన పాత సినిమా కథలను కాపీ కొట్టకూడదంటారా?
మీరసలు మనుషులేనా?
మీకు మానవత్వం లేదా?
తన ముద్దుల మనవరాలి ముమ్ముద్దుల కూతురి బారసాలకు ఇండియా వెళ్లాలని ఉన్నా…వినిర్మాత డబ్బు వృథా చేయడం ఇష్టం లేక… హిమాలయాన్ని తన ఎడమకాలి చెప్పుకింద నిత్యం తొక్కి పెట్టే దైవాంశసంభూతుడైన మా పర్వతసమాన హీరో ఆ రోజు స్విట్జర్లాండ్ ఆల్ఫ్స్ పర్వతాల మీద ఫస్ట్ ఇంటర్ చదివే హీరో ఇన్ తో మంచు మీద కాలు జారిన విషయం మీకు తెలుసా? బెణికిన కాలుతోనే జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ తో కనిపించే హీరో ఇన్ చుట్టూ తిరుగుతూ…”నీ చీర కొంగు బంగారమే…నువ్ చేర సింగారమే…”
అన్న అసందర్భ గీతానికి చేసిన డ్యాన్స్ న భూతో. న భవిష్యతి. పాట లిరికల్ రిలీజ్ యూ ట్యూబ్ లో విడుదల చేస్తే…రెండ్రోజుల్లో పాతిక కోట్ల వ్యూస్ వచ్చాయి. భూగోళం మీద తెలుగు జనాభా కంటే ఇది మూడింతలు ఎక్కువ. ఈ పాటను మైనస్ ముప్పయ్ డిగ్రీల గడ్డకట్టే చలిలో చేసినందుకైనా మీరు కనీసం ఒక్కొక్కరు మూడు సార్లు ఈ సినిమా చూడాలి కదా!
మీరు పెట్టే ముష్టి పదిహేను వందలకు మేము పదిహేను లక్షల విలువైన వినోదం ఇస్తున్నాము కదా? నోరు మూసుకుని వచ్చి సినిమా చూసి వెళ్లలేరా? ఒక్కొక్కడికి నోరు లేస్తోందే! ఖబడ్డార్!
థియేటర్లలో పార్కింగ్ దోపిడీ. తినుబండారాల దోపిడీ అంటారా? మీ మెడకాయమీద తలకాయ ఉందా అసలు? బతకడానికి రోజూ మూడు పూటలా తినడానికి ఖర్చు పెట్టట్లేదా? అలాగే సినిమాల్లేకుండా బతగ్గలరా? ప్రాణంకంటే విలువైన సినిమా దగ్గరికొచ్చేసరికి లెక్కలు మాట్లాడతారా?
నిన్ననే రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులను కలిసి వచ్చాను. ఇకపై నెలలో ప్రతి శని, ఆదివారాల్లో సినిమా థియేటర్లకు రానివారు ప్రభుత్వ పథకాలు పొందడానికి అనర్హులుగా ప్రకటించమని అడిగాను. దానివల్ల వినిర్మాతగా నాకు వచ్చేది పదిహేను వందలే అయినా…ప్రభుత్వాలకు అంతకంటే ఎలా ఆదాయం వస్తుందో వివరించాను. వీలైతే శని, ఆదివారాల్లో రెండు రాష్ట్రాల్లో మొత్తంగా టీ వీ, ఇంటర్నెట్ కట్ చేసే అంశాన్ని కూడా పరిశీలించామన్నాను. అప్పుడు చచ్చినట్లు జనానికి థియేటర్ తప్ప ఇంకో దిక్కు మొక్కు ఉండదు. ఇది మంత్రి మహోదయులకు భలే నచ్చింది. ఈ ఐడియా తమకు రానందుకు సిగ్గుతో కాసేపు అవనతశిరస్కులయ్యారు. తరువాత దించిన తలలు ఎత్తి సానుకూలంగా స్పందించారు.
డబ్బులెవరికీ ఊరికే రాదు.
వినోదం ఎవరికీ ఊరికే రాదు.
ప్రతివాడూ మాట్లాడేవాడే. అర్థం లేని సినిమా తీయడానికి మేము పడే కష్టాన్ని ఒక్కడైనా అర్థం చేసుకోడే! ఆ సినిమా అంత అర్థరహితంగా తీయడానికి మేము ఆర్థికంగా అంత నష్టపోయినప్పుడు…సగటు ప్రేక్షకులుగా మీరు ఆర్థికంగా మమ్మల్ను అంతగానే ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత లేదా? నేనిలా ఇంత సంస్కారరహితంగా మిమ్మల్ను బెదిరించడంలో ఎంతో జాతి విశాల ప్రయోజనాన్ని చూడలేరా? నా మెదడు అంతగా మోకాట్లో కూడా నిలవక…జారి…చివరికి అంతటి అరికాల్లో కూడా లేదంటారా? ధనమదాంధులు, నడమంత్రపు వినిర్మాతలు ఇంతలా నోటికేది వస్తే అది మాట్లాడతారంటారా?
ప్రజలకోసం, వలన, కొరకు, పట్టి, యొక్క, కిన్, కున్ ప్రజలెన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాలే మొదటి ఆటలకు దోచుకోండి- అని అంతగా అధికారిక ఉత్తర్వులిస్తుంటే…ప్రజలంటే బాధ్యతలేని మమ్మల్ని ఇంతలా దోచుకోవద్దని ఎలా అడ్డుకుంటారు?
ప్రేక్షకులంటే ఏ టీ ఎం మిషన్లు- అంతే. మిషన్లకు మెదడు, సొంతమైన అభిరుచులు, ఇష్టాయిష్టాలు ఉండకూడదు. ఉన్నా నోరు విప్పకూడదు. విప్పితే నేనిలాగే దుడ్డుకర్ర తీసుకుని ఒక్కొక్కడి కాళ్లు విరగ్గొట్టి చేతిలో పెడతా.
ప్రేక్షకులంటే మౌన ప్రేక్షకులు- అంతే.
ఒక టికెట్టే పదిహేను వందలు చేసినా…నోరు మూసుకుని పడి ఉండాల్సిందే. నోరు లేచిందో…నోటి పళ్లు ఊడగొట్టి చేతిలో పెడతా.
ఇంతకూ ఇంతలా మాట్లాడుతున్న నా వింత పేరు చెప్పనేలేదు కదా!
చెప్పను. చెప్పాల్సిన పనిలేదు.
ఎవడికి ప్రేక్షకులంటే పురుగులకంటే నీచమన్న అభిప్రాయం నరనరాన ఉంటుందో…వాడే నేను. ఎవడికి భారతదేశంలో నెలకు పాతికవేలు, అంతకంటే తక్కువ జీతానికి పని చేసేవారు కోట్లమంది ఉంటారన్న కనీస సామాజిక అవగాహన కూడా ఉండదో…వాడే నేను!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article