ముందుగా ఓ పోస్టు చదవండి… చాలామంది దీన్ని చాన్నాళ్లుగా పోస్ట్ చేస్తున్నారు… పలు భాషల్లో కూడా… కోరా వంటి వేదికలపై దీనిపై చర్చలు కూడా సాగాయి… సోషల్ మీడియాలో చాలామంది పిచ్చోళ్లు ఉంటారు, మేమేం రాసినా చదువుతారు అనే భావన కావచ్చు లేదా తామే పిచ్చోళ్లలాగా రాయడం కావచ్చు… భలే వింతగా ఉంటాయి ఇలాంటి పోస్టులు…
ప్రతి సంవత్సరం దసరా తర్వాత సరిగ్గా 21 రోజుల తర్వాత దీపావళి ఎందుకు వస్తుంది..?
మీరు నమ్మకపోతే, క్యాలెండర్‌ను తనిఖీ చేయండి. రామచంద్రుడి సైన్యం శ్రీలంక నుండి కాలినడకన అయోధ్య చేరుకోవడానికి 21 రోజులు (504 గంటలు) పట్టిందని వాల్మీకి మహర్షి రామాయణము లో చెప్పారు ! కాబట్టి 504 గంటలను 24 గంటలు విభజించినచో, సమాధానం 21.00 అంటే… 21 రోజులు… నేను ఆశ్చర్యపోయాను… దీనిని ధృవీకరించడానికి, నేను ఉత్సుకతతో గూగుల్ మ్యాప్‌లో శోధించాను.
Ads
శ్రీలంక నుండి అయోధ్యకు కాలినడకన దూరం 3145 కి.మీ మరియు నడవడానికి తీసుకున్న సమయం 504 గంటలు అని. నేను షాక్ అయ్యాను !! ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్ పూర్తిగా నమ్మదగినది. సంప్రదాయం ప్రకారం, త్రేతాయుగం నుండి మనము దసరా మరియు దీపావళిని జరుపుకుంటాము.
మీరు నన్ను నమ్మకపోతే, గూగుల్ సెర్చ్ చేయండి మరియు ఈ సమాచారాన్ని ఇతరులతో పంచుకోండి. వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎంతో ఖచ్చితత్వంతో రాశాడు. మన హిందూ సంస్కృతి ఎంత గొప్పది. హిందూ సంస్కృతిలో జన్మించినందుకు గర్వపడండి! జై శ్రీ రామ్
దీనికి ఓ ఫోటో కూడా జతచేసి మరీ వైరల్ చేస్తుంటారు… ఆ మ్యాప్ చిత్రం ఇదుగో…
దసరా అంటే విజయదశమి… అంటే రావణాసురుడిని హతమార్చిన రోజు… (రామాయణం ప్రకారం)… దీపావళి అంటే అమావాస్య… ఆరోజున అయోధ్యకు తిరిగివచ్చిన రాముడికి స్వాగతోత్సవాలు… ఇదే కదా మనం పదే పదే చెప్పుకునే కథాక్రమం… ఎందుకు సరిగ్గా ఈ 21 రోజుల గ్యాప్ అనే అంశానికి కొందరి వివరణలు అన్నమాట… వాళ్లే వాల్మీకిని మించిన రచయితలైపోతుంటారు అన్నమాట…
1) రావణవధ తరువాత శ్రీరాముడు, వానరసేన ముఖ్యులతో కలిసి పుష్పక విమానంలోనే అయోధ్యకు తిరిగి వెళ్తాడు… సరిగ్గా వనవాసం పూర్తయ్యే సమయానికి రాముడు గనుక రాకపోతే ప్రాయోపవేశం చేసుకుంటానని భరతుడు హెచ్చరించి ఉన్నాడు గనుక… మీ వనవాసం పూర్తయ్యేలోపు అయోధ్య చేరాలంటే పుష్పకవిమానంలో వెళ్దాం, తోడుగా నేనూ వస్తానని విభీషణుడు రాముడికి చెప్పి ఒప్పిస్తాడు… సో, రాముడి సేన కాలినడకన 21 రోజుల్లో అయోధ్యకు చేరాకే పట్టాభిషేక ఉత్సవాలు అనేది అసత్యం…
2) పోనీ, మాతో మీరు విమానంలో రావొద్దు, కాలినడకన రండి, మీరొచ్చాకే నా పట్టాభిషేకం అని వానరసేనకు చెప్పాడు అనుకుందాం… కానీ ఆ సేన కొలంబో నుంచి దక్షిణానికి వెళ్లి, మళ్లీ తూర్పు మీదుగా ఉత్తరానికి వెళ్లి, అక్కడి నుంచి అయోధ్యకు వచ్చారా..? అబ్సర్డ్… రావణవధ జరిగింది కొలంబోలో కాదు కదా… అది తలైమన్నార్‌లో… అంటే తమిళనాడు ధనుష్కోటి నుంచి రాముడు రామసేతు మీదుగా లంకలో అడుగుపెట్టిన స్థలం… అక్కడే రావణవధ…
3) అదే తలైమన్నార్ నుంచి 25-30 కిలోమీటర్ల రామసేతు మీదుగా ధనుష్కోటి చేరుకోవడానికి ఒక రోజు, అక్కడి నుంచి అయోధ్యకు వెళ్లాలంటే 2450 కిలోమీటర్లు… అదే గూగుల్‌లో చేయండి ధనుష్కోటి నుంచి అయోధ్య అని… 22 రోజులు… మరిక 21రోజుల వ్యవధి అనే వాదనకు బేస్ ఏది..? పైగా రావణవధ జరిగిన వెంటనే విమానం ఎక్కలేదు రాముడు… సీత అగ్నిప్రవేశం, విభీషణుడి పట్టాభిషేకం అయ్యాక బయల్దేరతాడు… అయోధ్యకు నేరుగా వెళ్లడు… భరద్వాజ ఆశ్రమం చేరతాడు…
4) తరువాత భరతుడు నివసిస్తున్న నందిగ్రామం చేరతాడు… అక్కడి నుంచి అయోధ్యకు వెళ్తాడు… ఆ తరువాత సుముహూర్తం చూసి పట్టాభిషేకం, ఉత్సవాలు… సో, 21 గ్యాప్ ఇందుకోసమే అని సోషల్ మీడియాలో నయా వాల్మీకులు, పురాణకర్తలు చెప్పేది, రాసేది రాంగున్నర…
5) పైన సోషల్ వాల్మీకులు ప్రచారం చూస్తున్న గూగుల్ మ్యాపే చూడండి… కొలంబో నుంచి అయోధ్య అంటే… రామసేతు మీదుగా కాదు… చుట్టూ తిరిగి, అందులో ఫెర్రీ రూట్ కూడా ఉంది… మరిక కాలినడకతో 21 రోజులు అనే ప్రచారానికి విలువేముంది..?
….. ఆలయాల స్థలపురాణాల్లాగే మన నవలాకారులు, మన సినిమావాళ్లు, మన సోషల్ రచయితలు ఏదైనా చెప్పగలరు… నమ్మేందుకు మనం ఉన్నాం కదా ఎడ్డోళ్లం… కీచకుడిని సద్గుణవంతుడిని చేస్తారు, సీతారామరాజుకు కాషాయం పంచె కట్టిస్తారు, రామదాసుతో కబీర్‌ను కలుపుతారు, కుమ్రం భీమ్, సీతారామారాజును కలిసి పోరాటం చేయిస్తారు, కల్కిలో కర్ణుడు, అశ్వత్థామలకు కొత్త కథలు అద్దుతారు… ఏదైనా చేస్తారు… అదుగో, పైన చదివిన పోస్టులాగే… అనేకం… అనేకం…
Share this Article