.
స్నేహమేరా జీవితం…!
దిల్ చాహ్తా హై…!
Ads
ఆకాష్, సమీర్, సిద్దార్థ్ ముగ్గురు స్నేహితులు. కలిసుంటారు, విడిపోతారు, కలుసుకుంటారు. సినిమా కథ ఇంతే..!
కానీ….,
ఆ మూడు గంటల మూడు నిమిషాల సినిమాలో ఓ మూడు నిండు జీవితాల చరిత్రంతా ఉంటుంది..!
విడిపోవన్న భరోసా ఉన్న బంధాలు చాలా ధృడంగా ఉంటాయి. ప్రపంచం మొత్తానికీ వాళ్ల స్నేహపు గాఢత తెలుసు. ఐనా ఒకర్నొకరు వెక్కిరించుకుంటారు; ఎగతాళి చేసుకుంటారు; “చంపేస్తారొరేయ్..!” అంటూ బెదిరించుకుంటారు. ఒకరికోసం ఒకరు అలవోకగా చావడానికి సిద్ధపడుతున్నంత ప్రేమ కలిగిఉంటారు.
ఎగువ మధ్యతరగతి సిద్ధార్థ్ పరధ్యానంగా ఉన్నట్టు కనిపించే స్థిరమైన అభిప్రాయాలున్న వ్యక్తి. అరుదు మాటల నిలువెత్తు గుంభనం. తన గుంభనత్వం నిక్షిప్తీకరించబడ్డ తన వర్ణచిత్రాల లోగుట్టును విశదీకరించిన, తనకన్నా పదిహేనేళ్లు పెద్దదైన తారాజైస్వాల్ తో గెరంటోఫీలియాకీ; ఈడిపస్ కాంప్లెక్స్ కీ అతీతమైన ఓ ఆరాధనతో ఉంటాడు.
ధనవంతుడైన సమీర్ ప్రతి ఆకర్షణనీ ప్రేమలా భ్రమించే టీనేజీ మనసు దాటని యువకుడు. కానీ మిగిలిన ఇద్దరి మధ్య వారధి తనే..! తనో చుప్పారుస్తుమ్ కూడా..! పెద్దలు కుదర్చాలనుకున్న పెళ్లిని వదులుకోబోయి, ఆ అమ్మాయితోనే ప్రేమలో పడి, ఆనక అష్టకష్టాలూ పడి, తనని స్వంతం చేసుకుంటాడు.
ఐశ్వర్యవంతుడైన ఆకాష్ మల్హోత్రా జీవితాన్ని అనుక్షణం అనుభవించాలనే ఆకాంక్ష ఉన్న వ్యక్తి. మాటల పోగు. ప్రేమంటే నమ్మకం లేనట్టు కనిపించి పీకల్లోతు ప్రేమలో కూరుకుపోతాడు. ప్రేమ పంజరంలో కూరుకుపోయి ఉన్న శాలినికి కనిపించిన తొలి పరపురుషుడైన తను నచ్చుతాడు. ప్రణయ విరహం పూడుకుపోయిన గొంతులో చేరి నాగుపాములా బుసకొడుతుంటే పసిపిల్లాడిలా దుఃఖిస్తాడు. వందలమంది సమక్షంలో వెళ్లి పెళ్లికూతురుకి ప్రేమప్రతిపాదన చేస్తాడు.
**
నవ్విస్తూ ఆలోచింపజేసే సినిమాలు అద్భుతంగా ఉంటాయి..!
ముగ్గురివీ వాస్తవప్రేమలు. వాళ్లు వలచిన ఆడవాళ్లక్కూడా ప్రేమకథలుంటాయి. ఒకామె పెళ్లై, ఓ కూతురుండి విడాకులు తీసుకున్న మహిళ. ఇంకో ఆమెకి తెల్లారితే పెళ్లి. మరొకామె ఇంకోడితో ప్రేమలో ఉంటుంది.
ఆకాష్, సిద్ధార్థ్ ల మధ్య వచ్చిన పొరపొచ్చాలకు కారణం కూడా ఆకాష్ కి సిద్ మీదున్న ప్రేమే…!
ముగ్గురూ వాళ్ల వాళ్ల తల్లిదండ్రులకు చాలా గౌరవం ఇస్తారు. ఆ తల్లిదండ్రులు కూడా సంప్రదాయాలను గౌరవించే ఆధునికులు. రికామీగా తిరుగుతున్న ఆకాష్ ని ఆస్ట్రేలియాలో పనిచేయడానికి “నేన్నిర్ణయం తీసేసుకున్నానంటూ” పంపిన అతని తండ్రి, చెప్పకుండానే కొడుకు సమస్య పసిగట్టి వెనక్కి పిలుస్తాడు. అతని సమస్యని తీర్చుకునే ధైర్యాన్నిస్తాడు.
సినిమాలో ప్రతీఫ్రేమూ పాత్రల్ని పరిచయం చేయడానికో, కథని ముందుకు తీసుకుపోవడానికో తప్ప వృధాగా ఉండదు. ప్రతి మాటా, ప్రతి పాటా అద్భుతం.
1) గోవాలో ఆకాష్ ని ఇష్టపడుతున్న అమ్మాయి తో సిద్ధార్థ్ చెప్పే ” ఇసకని గుప్పిట్లో ఎంత గట్టిగా బంధించాలనుకుంటే, అంతగా వేళ్ల సందుల్లోంచి జారిపోతుంది. మనుషులూ అంతే..!” అనే అనునయ వాక్యాలు;
2) “నేనా రోజు అదృష్టవంతుణ్ని, ఓ దెబ్బతో బైటపడ్డాను. షాలినీ నాతో ఉండి, ఎవడైనా తనతో పిచ్చిగా నేను ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తే, వాళ్ల ప్రాణాలు తీసేవాణ్ని..!” అంటూ భోజనాల దగ్గర ఆకాష్ చెప్పే మాటలూ;
3) “చాలాసార్లు మనుషుల ప్రవర్తన మన అంచనాలకూ, ఆలోచనలకూ అతీతంగా ఉంటుంది” అనే ఆకాష్ తండ్రి మాటలూ;
4) మేమెక్కడికి వెళ్లినా మా ఇంద్రజాలం కనిపిస్తుంది, యువతకు ప్రేమపాఠాలు నేర్పగలమనే పాటా..,
5) శాలినీకి ఆకాష్ ఒకే ప్రేమ ప్రకటనల మాటని మొదట్లో అల్లరిగా, తర్వాత ఆర్తిగా చెప్పే తీరూ..,
6) సమీర్, క్రిస్టీన్ తో ఊహించుకున్న ప్రేమకథా, తర్వాత ప్రహసనం..,
7) వయసొచ్చినా స్థిరపడకపోవడం వల్ల, తన మేనకోడలు శాలినికి సహాయం చేయలేని మహేశ్ అంకుల్ నిస్సహాయతా..,
8) తారాజైస్వాల్ పుట్టినరోజు సన్నివేశం..,
9) “నువ్వు ప్రశ్నలడగక పోవచ్చు, కానీ తానడుగుతాడు, సమాధానం ఆశిస్తాడు..!” అంటూ ఆకాశ్ శాలినీతో పెళ్లి గురించి మాట్లాడే తీరూ..
10) సమీర్- పూజ- రూల్స్ సుబోధ్ ల ట్రయాంగిల్ లవ్ ప్రహసనం..
అన్నీ బావుంటాయి. జీవనవేదాంతాన్ని అంతర్లీనంగా చెబుతాయి.
మిత్రులు ముగ్గురూ గోవా వెళ్లినప్పుడు ఓ సముద్రతీరంలో జరిగే సంభాషణ సినిమా ఆత్మని చెబుతుంది. ప్రతి సంవత్సరం గోవాకి ఒక్కసారైనా రావాలని సమీర్ ఆశ పడితే, పదేళ్లకోసారైనా కలుస్తామో లేదో అంటూ సిద్ధార్ధ్ అంటాడు. మనం బతికున్నంత కాలం స్నేహితులమే, మనం కలిసుండాలన్న ఆలోచనంటూ ఉంటే అది తప్పక జరుగుతుంది అంటూ ఆకాశ్ ముక్తాయిస్తాడు.
అదే కథ..!………… (గొట్టిముక్కల కమలాకర్)
Share this Article