కేటీయార్ బావమరిది ఫామ్‌హౌజులో డ్రగ్స్ రేవ్ పార్టీ అని నిన్నంతా ప్రచారం, పోలీసుల దాడులు, రాజ్ పాకాల మీద కేసు, ఎవరో ఆయన దోస్తుకు పరీక్షలు చేస్తే పాజిటివ్, హైకోర్టుకు వెళ్లిన రాజ్, అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు…
ఇవి కక్షసాధింపులు, అక్రమ కేసులు, సర్కారు వైఫల్యాల నుంచి డైవర్షన్ టాక్టిక్స్, బీఆర్ఎస్ పుంజుకుంటుంటే ఓర్వలేనితనం అని బీఆర్ఎస్ నేతల ప్రతిఘటన, ఎదురుదాడి… ఫ్యామిలీ పార్టీ మీద రేవ్ పార్టీ ముద్ర వేస్తారా..? పిల్లలు, వృద్ధులు, మహిళలు కూాడా ఆ పార్టీలో ఉన్నారని తెలుసా అని విమర్శలు… ఇవన్నీ వరుసగా చకచకా జరిగిపోతున్నాయి…
ఆ పరిణామాల జోలికి, వాటి విశ్లేషణలకు ఇక్కడ ప్రయత్నించడం లేదు… కానీ జర్నలిస్టులతో ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే (కోరుట్ల) కల్వకుంట్ల సంజయ్ మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరం… అలాంటి మాటలు బీఆర్ఎస్‌ను మరింత దెబ్బతీస్తాయి తప్ప… తెలంగాణ ఆత్మాభిమానం, స్వపాలనే ధ్యేయంగా నడిచిన బీఆర్ఎస్ పార్టీ మౌలిక భావనలకే అవి వ్యతిరేకం… పైగా అదే కేసీయార్ ఇంటి పేరు ఈయనది కూడా…
Ads
తోటి ప్రజాప్రతినిధులతో వెళ్లి పోలీసులను ప్రతిఘటించారు… అదంతా రాజకీయాల్లో భాగమే… అది కాదు, ఎవరో లేడీ జర్నలిస్ట్ ఏదో అడిగితే… మీరు తెలంగాణ వాళ్లు కాదా..? మీ ఇంట్లో మందు తాగరా అని కోపంగా ఉల్టా దబాయిస్తున్నాడు ఆయన… తరువాత జర్నలిస్టులందరూ ఒక్కసారిగా విరుచుకుపడేసరికి, సారీ, విత్ డ్రా చేసుకుంటున్నాను అని దిగొచ్చాడు…
ఒక ప్రజాప్రతినిధి, బాధ్యత కలిగిన నాయకుడు అలవోకగా తెలంగాణ సంస్కృతి మీద చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆక్షేపణీయం… బీఆర్ఎస్ పార్టీ తనను చూసి గర్వపడుతోందా..? అసలే సినిమా వాళ్లు తెలంగాణ అంటేనే తాగుడు అన్నట్టుగా చిత్రీకరిస్తూ, తరాల తెలంగాణ ద్వేషాన్ని పదే పదే ప్రదర్శిస్తున్నారు… వాళ్ల సరసన చేరిపోయాడా ఈ తెలంగాణ పార్టీ ప్రతినిధి..?
తెలంగాణ సంస్కృతి అంటే తప్పకుండా తాగాలా..? ఇదెక్కడి భావదరిద్రం..? ఇప్పుడు తెలంగాణ, ఏపీ మద్యం ఆదాయం, అమ్మకాల లెక్కలేమైనా తెలుసా ఈయనకు..? ఎన్ని కులాలు తాగుడు జోలికి వెళ్లవో తెలుసా..? తాగడం తెలంగాణ కుటుంబ సంస్కృతా…? ఇలాంటోళ్ల దృష్టిలో తెలంగాణ అంటేనే కక్క ముక్క…
సరే… తెలంగాణ సంస్కృతి మీద ఆయనకున్న అపారమైన జ్ఞానానికి ఆనందిద్దాం… కానీ కనీసం బహిరంగంగా, అదీ మీడియా ఎదుట ఏది పడితే అది మాటతూలడమేనా..? మాట మీద అదుపు లేకపోతే ఎలా..? ఏదో నోరు జారడం, వాళ్లు విరుచుకుపడేసరికి, వెంటనే సారీ చెప్పేయడం… అందుకే ప్రజాప్రతినిధులు ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆచితూచి మాట్లాడాలి… మనమూ ఏపీ పాలిటిక్స్ మురికి, బురద రాజకీయాల బాటలోకి వేగంగా వెళ్తున్నట్టుంది చూడబోతే..!!
Share this Article