అమరన్… ఈ సినిమా కథ ఓ అమరజవాను కథ… ఓ సాహసి కథ… మరి ఇందులో ఆ జవాను భార్య పాత్రకు ప్రాధాన్యం ఏముంటుంది..? సాయిపల్లవి తన పాత్రకు పెద్ద ప్రాధాన్యం లేకపోతే దాని జోలికి పోదు కదా… పైగా తన పోర్షన్ ప్రాధాన్యాన్ని తగ్గించవద్దని ముందే దర్శకుడి నుంచి లిఖితపూర్వకంగా హామీ తీసుకున్నదీ అనే వార్త చదివాక ఆసక్తి ఏర్పడింది…
సినిమాా చూస్తే ఆమె పాత్ర ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది… అశోకచక్ర, మేజర్ ముకుంద్ వరదరాజన్ ధీరోదాత్త ఆపరేషన్ సాగిన తీరు మాత్రమే కాదు… దర్శకుడు ఓ ఆర్మీ ఆఫీసర్ భార్య, సైనికుల కుటుంబాల్లో సంఘర్షణ అనే కోణంలో కథను నడిపించాడు… అదీ నచ్చింది…
ఒక ప్రేమకథ… ఆర్మీ ఆఫీసర్ అనగానే అమ్మాయినివ్వడానికి పేరెంట్స్ అభ్యంతరాలు… పెళ్లి… వాళ్ల బంధం… అతని మరణం… ఆమె వేదన… సమాంతరంగా దేశభక్తి… అన్ని రకాల ఎమోషన్స్ ప్లస్ ఆర్మీ ఆఫీసర్ తాలూకు ఆపరేషన్ యాక్షన్… కశ్మీర్‌లో పరిస్థితులు, ఉగ్రవాదంతో ఆర్మీ పోరాటం… అన్నీ కథలో చక్కగా కుదిరాయి…
Ads
సెకండాఫ్‌లో కాస్త కథ స్లో అయినా సరే, క్లైమాక్స్ దశకొచ్చేసరికి సాయిపల్లవి తన నటనతో సినిమాను పైకి లేపింది… శివ కార్తికేయన్ అయితే తన కెరీర్ బెస్ట్ సినిమాల్లో దీన్ని కూడా చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో… నటిగా సాయిపల్లవి మరో మెట్టు ఎక్కింది… ఎందుకు ఈ కథను ఎంచుకుందో, ఆమె ఆ పాత్రలో ఎలా ఒదిగిందో చక్కగా అర్థమవుతుంది…
ఎప్పుడైతే ఆర్మీ ఆఫీసర్ భార్య కోణంలో కథను రాసుకుని, వాళ్ల ప్రేమ దగ్గర నుంచి కథను ఎత్తుకున్నాడో… అసలు ఆపరేషన్‌లో క్రియేటివ్ ఫ్రీడమ్ పెద్దగా తీసుకునే అవసరం రాలేదు దర్శకుడికి..! తెలివైన ఎత్తుగడ… రాజకుమార్ పెరియస్వామి మరోసారి తన ప్రజెంటేషన్ మెళకువ, నైపుణ్యాల్ని ప్రదర్శించాడు… నిర్మాతగా కమలహాసన్ కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు…
నిర్మాణ విలువలు…. నేపథ్యసంగీతం ఎక్కువా కాలేదు, తక్కువ లేదు… ఇందు రెబెకా వర్గీస్ పాత్ర ఏమంటుందంటే… నా బాధ సరే, అది నా వ్యక్తిగతం, నా భర్త ధైర్యాన్ని, త్యాగాన్ని గుర్తించండి అనడుగుతుంది… భర్తకిచ్చిన మాట కోసం కన్నీటిని ఆపుకుని, బాధను దిగమింగి కనిపిస్తుంది… తనకు ఎదురైన ఈ చాలెంజింగ్ పాత్రను సాయిపల్లవి తన నటనా ప్రతిభతో మెప్పిస్తుంది…
ఆమె గత సినిమాల పరాజయాన్ని మరిచిపోవచ్చు… ఈ సినిమా తనకు మరింత మంచి పేరు తీసుకొస్తుంది… తెలుగు ప్రేక్షకుడు కూడా శివ కార్తికేయన్ వైపు నుంచి గాకుండా సాయిపల్లవి వైపు నుంచే చూస్తాడు… ఆ పాత్ర కేరక్టరైజేషన్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, బంధం బాగా కుదిరాయి… రాజకుమార్ పెరియస్వామి కశ్మీర్‌లో చేసిన ఈ ఆపరేషన్ సక్సెస్..!!
Share this Article