Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మన డిగ్రీలు, మన పీజీలు, మన డాక్టరేట్లు… కొన్ని చేదు నిజాలు…

November 1, 2024 by M S R

ఒక ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో తెలుగులో యుజిసి ఫెలోషిప్‌తో పిహెచ్‌డి చేస్తున్న ఇద్దరు యువకులు మోహన్ , రమేష్ మొన్న ఒకరోజు మా ఆఫీస్‌కు వచ్చారు. మోహన్‌ది మా హిందూపురం. నాకు చాలాకాలంగా పరిచయం. వస్తూ వస్తూ తన మిత్రుడు మహబూబ్‌నగర్ రమేష్‌ను వెంటబెట్టుకు వచ్చాడు.

సాహితీ విమర్శలో మోహన్ మునిగి తేలుతున్నాడు. తను ఈమధ్య రాసిన సాహిత్య వ్యాసాల జెరాక్స్ ప్రతులిచ్చాడు. నాకోసం కొన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చాడు. సాహిత్యం మీది నుండి చర్చ బతుకుదెరువు మీదికి మళ్ళింది. రచనను ఒక వృత్తిగా ఎంచుకునే వాతావరణం ఉందా? అని మోహన్ సూటిగానే అడిగాడు. సినిమా రచన తప్ప ఇంకే రచన కూడు పెడుతున్నట్లు లేదని నేను అంతే సూటిగా చెప్పాను.

వెబ్ సైట్లు, బ్లాగుల్లో రాస్తే ఎంతొస్తుందని అడిగాడు రమేష్. ఏమీ రాదని చెప్పాను. తెలుగులో పిహెచ్‌డి అయ్యేనాటికి వీళ్ళిద్దరికి ముప్పయ్యేళ్ళ వయసు వస్తుంది. ప్రస్తుతం 28, 29 దగ్గరున్నారు. ఇప్పుడొచ్చే యూజిసి ఫెలోషిప్ నెలకు యాభై వేలు కూడా ఆగిపోతుంది. పోటీ పరీక్షలు ఎండమావుల్లా ఉన్నాయట.

Ads

టీచర్ కొలువులకో, జూనియర్ లెక్చరర్ పోస్టులకో పోటీపడడం వారిద్దరికీ ఇష్టం ఉన్నట్లు లేదు. సాహిత్య విద్యార్థులుగా తమకున్న రచనాసక్తిని కెరీర్‌గా మలుచుకోవాలని వారికి ఉంది. అందులో ఉన్న మంచి చెడుల గురించి మాట్లాడ్డానికే వచ్చారు వారు.

భాష మీద అభిమానం కొద్దీ రాస్తే రాయండి తప్ప… రాయడాన్ని వృత్తిగా ఎంచుకోకండి అని చెప్పి… ఎందుకో కారణాలు వివరించాను. తెలుగులో పిహెచ్‌డి అయిపోయాక వారికి అంతా శూన్యంగా కనిపించడం నాక్కూడా గుచ్చుకుంది. “కనీసం ఇప్పుడొచ్చే యాభై వేలైనా సంపాదించకపోతే మా చదువుకు విలువేముంది సార్!” అన్న రమేష్ ప్రశ్న నన్ను వెంటాడుతోంది. “ఇంటి నుండి పైసా తెప్పించుకోకుండా మా బతుకు మేము బతకడానికి దారులు వెతుక్కుంటున్నాం సార్” అన్న మోహన్‌కు ఏ దారి చూపాలో నాకు అర్థం కావడం లేదు.

ఇద్దరూ చక్కగా రాయగలరు. సామాజిక అంశాల మీద సెల్‌ఫోన్‌తోనే షార్ట్ ఫిలిమ్స్ తీశారు. సాహిత్యాన్ని ఒక శాస్త్రంగా అధ్యయనం చేస్తున్నారు. ఈకాలం యువకులకుండే ఇతరేతర అలవాట్లు లేవు. ఇలాంటివారు “సాహిత్యం కూడు పెట్టదు” అని సాహిత్యాన్ని వదిలేస్తే సాహిత్యానికి, తెలుగు భాషకే నష్టమన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

“ఇంగ్లిష్, హిందీ, ఫ్రెంచ్ చివరికి ఎవరూ మాట్లాడని సంస్కృతం డిగ్రీలు చేసినవారు కూడా దర్జాగా ఉద్యోగాలు తెచ్చుకుని… బతకగలిగి… ఇన్ని కోట్లమంది రోజూ మాట్లాడే/రాసే తెలుగు డిగ్రీలు, పీజీలు, పిహెచ్‌డీలు చేసినవారు మాత్రం నిరుద్యోగులుగా… ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా దేశం మీద పడి పొట్టకూటి కోసం ఎందుకు తిరగాల్సి వస్తోంది? భవిష్యత్తులో ఎవరూ తెలుగును ఒక శాస్త్రంగా చదవకపోతే, అధ్యయనం చేయకపోతే… నష్టమెవరికి?” అన్న మోహన్ ప్రశ్న- తెలుగు తల్లి చెవుల్లో రింగుమని మారుమోగుతోంది!

ఇలా ఒక్కో యూనివర్సిటీలో ఎందరో తెలుగు విద్యార్థులు మోహన్‌లు. ఇలా యూనివర్సిటీలు దాటాక నాలుగు రోడ్ల కూడలిలో ఎటు వెళ్ళాలో తెలియక నిలబడిన ఎందరో తెలుగు పరిశోధక రమేష్‌లు! – పమిడికాల్వ మధుసూదన్  9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions