.
నువ్వే నువ్వమ్మా … సరిగమా… నీ సరి ఎవరమ్మా..?
క్లాసికల్లైనా… జానపదమైనా… జాజ్ బీటైనా మరేదైనా… ఏ పాటైనా పాడేయడమే కాదు… ఎవరీవిడ అని చూడాలనిపించే క్యూరియాసిటీ కలిగించిన గాయని తను.
Ads
పేరు వాణీ జయరామ్. అందెల రవళిది పదములదా …. స్వర్ణకమలం … తెలుగు సినిమాలను చక్కటి సంగీతంతో అలంకరించిన కన్నడ దేశ జంట సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర. ఎవిఎమ్ వారు తీసిన నోము, పూజ చిత్రాలకు వారే సంగీతం అందించారు.
పూజ చిత్రం కోసం దేశ్ రాగంలో ఓ భక్తి గీతాన్ని కంపోజ్ చేశారు రాజన్ నాగేంద్ర. దాశరథి సాహిత్యం … పూజలు చేయ పూలు తెచ్చాను …వాణీ జయరాం గాత్రంలో వినిపించే ఈ పాట నడక చూస్తేనే అర్దమౌతుంది.
ఇది ఖచ్చితంగా హిందుస్తానీ రాగమే అని.
https://www.youtube.com/watch?v=7TF3BvD31cg&ab_channel=RoseTeluguMovies
వాణీ జయరామ్ పుట్టింది తమిళనాడు వేలూరులో సంగీత కుటుంబంలోనే. అక్కడ శాస్త్రీయ సంగీతమే తప్ప ఇంకే సంగీతానికీ ప్రవేశం లేదు. కానీ వాణికి లలిత, సినిమా సంగీతం మీద మక్కువ ఎక్కువ.
దొంగచాటుగా విని ప్రాక్టీస్ చేసి సినిమా సంగీతానికే ఆభరణం అయ్యారు. వాణీ జయరామ్ గాత్రంలో ప్రత్యేకత ఏమిటంటే … ఏ భావాన్నైనా బలంగా పలుకుతుంది. చక్రవర్తి స్వరకల్పనలో వచ్చిన ఈ మల్లెపూవు గీతంలో విరహభక్తిని వాణీ గాత్రంలో పలికించిన తీరు నిజంగానే అబ్బురపరుస్తుంది.
https://www.youtube.com/watch?v=GbgXC-73Boc&ab_channel=OldTeluguSongs
నువ్వు వస్తావనీ బృందావని ఆశగా చూసేనయ్యా … మల్లెపూవు… వాణి జయరామ్ గాన సరస్వతీ మాత్రమే కాదు… చదువుల తల్లి కూడా. క్వీన్స్ మేరీ కాలేజ్ నుంచి ఎకనమిక్స్ లో డిగ్రీ తీసుకున్న వాణి కొద్దికాలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశారు.
వోకల్ లో కర్ణాటక, హిందుస్థానీ సంగీతాలతో పాటు సితార్ ఇన్స్ ట్రిమెంట్ మీద కూడా వాణి పట్టు సాధించారు. పాట చెప్పేటప్పుడు స్వరం రాసుకుని పాడే గాయనీ గాయకులు చాలా అరుదు అలాంటి వారిలో వాణీ జయరామ్ ఒకరు అని ఎమ్మెస్ విశ్వనాథన్ అంతటి సంగీత దర్శకుడు కితాబు ఇచ్చారంటే మామూలు విషయం కాదు.
https://www.youtube.com/watch?v=IN5ZaWVd04E&ab_channel=TeluguOne
ఎమ్మెస్వీ స్వరాలు కూర్చిన ఈ ఆత్రేయ గీతం వినండి … విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేననీ… మరో చరిత్ర… 1969లో ముంబైలో తొలి కచ్చేరీ చేసిన వాణీని బాలీవుడ్ అక్కున చేర్చుకుంది. ఆ తర్వాత సంవత్సరమే గుడ్డీ సినిమాలో పాట పాడేసింది.
వసంత్ దేశాయ్ సంగీత దర్శకత్వంలో మొత్తం మూడు పాటలూ తనే పాడేసింది. ఆ తర్వాత అనుకోకుండా … ముంబై నుంచీ చెన్నై మారారు … కానీ తను పాడిన హిందీ పాటలు నిజంగా అద్భుతం. గుడ్డీలో బోలోరే బపీ పాట…
వాణీ జయరామ్ గాత్రం తెలుగు సంగీత దర్శకుడు కోదండపాణికి తెగ నచ్చేసింది. అభిమాన వంతుడు సినిమాలో ఎప్పటి వలె కాదురా స్వామీ అనే సెమీ క్లాసికల్ సాంగ్ పాడించి తెలుగువాళ్లకి వాణిని పరిచయం చేశారు.
https://www.youtube.com/watch?v=Ik-1fg4gXbk&ab_channel=v9Videos
ఆ తర్వాత ఎన్నో పాటలు… ముఖ్యంగా.. ఇళయరాజా సంగీతంలో… వయసు పిలిచింది లాంటి చిత్రాల్లో వాణి పాట విని తన్మయులైపోయారు. నువ్వడిగిందీ ఏనాడైనా లేదన్నానా… వయసు పిలిచింది… తమిళంలో బాలచందర్ అపూర్వరాగంగళ్ మూవీ వాణీకి పేరు తెచ్చింది. ఆ పని తెలుగులో శంకరాభరణం చేసింది.
ఈ రెండు సినిమాలతో వాణీ జయరాం రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని పురస్కారాలు అందుకున్నారు. మహదేవన్ ఏ ప్రభావాన్ని ఆశించి స్వరం కట్టారో దాన్ని నూరుశాతం సాకారం చేశారు వాణీ జయరామ్.
దొరకునా ఇటువంటి సేవా పాటలో ఆవిడ ఎమోషన్స్ పలికించిన తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది … శాస్త్రీయ సంగీతాధారంగా పాటలు కూర్చేప్పుడు మహదేవన్ కు ఉన్న ధైర్యం వాణీ జయరామ్ గారే. స్వాతికిరణం కోసం సిరివెన్నెల రాసిన ఓ గీతం వాణీ జయరామ్ గాత్రంలో అద్భుతంగా పలుకుతుంది … వాణీ జయరామ్ పాడుతుంటే …. సంగీత సాహిత్యాలు సమపాళ్లల్లో కలిసి శ్రోతల ముందు ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కృతం అవుతాయి.
శ్రోతలు ఒక్కసారి పాట వింటే పదే పదే వినాలనిపించేలా అనిపిస్తుంది …. సంగీత సాహిత్యాలను భావగర్భితంగా సమ్మేళనం చేయడం అనే ఫీస్ట్ వాణీ జయరామ్ చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. ప్రణతి ప్రణతి… స్వాతికిరణం…
https://www.youtube.com/watch?v=60o5a7KTA8w&ab_channel=TeluguFilmnagar
కె.వి.మహదేవన్ కు ఎందుచేతో వాణీ జయరామ్ గాత్రం అంటే చాలా చాలా ఇష్టం. ముఖ్యంగా వాణీ గాత్రంలో పలికే గమకాలను మహదేవన్ ఇష్టపడేవారు. అందుకే కొన్ని ప్రత్యేకమైన గీతాలను ఆయన ఖచ్చితంగా వాణీ జయరామ్ తోనే పాడించుకునేవారు. అలాంటి గీతాల్లో శృతిలయలులో ఆలోకయే శ్రీ బాలకృష్ణమ్ ఒకటి.
వాణీ జయరామ్ అన్ మాచ్డ్ నైటింగేల్ ఆప్ ఇండియా అంటారు సంగీత ప్రియులు. సోలోలూ సంగీత ప్రధాన గీతాలే కాదు… డ్యూయట్లూ చాలా స్పెషల్ గా పాడతారు వాణీ జయరామ్. సినిమా సంగీతానికీ శాస్త్రీయసంగీతానికీ ఉన్న లింకులు సమగ్రంగా తెల్సిన గాయని కావడంతో పాట తన గాత్రంలో వింత సొగసులు అద్దుకుంటుంది. ఒక బృందావనం సోయగం… ఘర్షణ
https://www.youtube.com/watch?v=-fo2uSRA7RU&ab_channel=NiharikaMovies
భక్తి కావచ్చు, రౌద్రం కావచ్చు… ఏ రసాన్నైనా తన్మయం చెందినప్పుడు పలికే రాగం నాట రాగం. త్యాగరాజు కూర్చిన జగదానందకారకా కీర్తన నట రాగంలోనే వినిపిస్తుంది. రెండు మూడు తెలుగు సినిమాల్లో ఈ కీర్తన వినిపిస్తుందిగానీ… రసభంగం కాకుండా పాడినది మాత్రం బాపు గారి పెళ్లిపుస్తకంలో వినిపిస్తుంది. మహదేవన్ సంగీత దర్శకులు కావడం ఒకటి, వాణీ జయరాం గానం చేయడం మరోటి ఈ పాట అంత ప్రత్యేకంగా ఉండగలగడానికి కారణాలు.
నాట రాగం పాడడానికి లంగ్ పవర్ చాలా ఆవసరం. అంత ఆషామాషీ వ్యవహారం కాదు. జగదానంద కారక ఓ సారి వాణీ జయరామ్ పద్దతిలో పాడగలిగితేగానీ పాడ్డం ఎంత కష్టమో అర్ధం కాదు ఎవరికీ. తెలుగు తమిళ మళయాళీ హిందీ గుజరాతీ ఇలా పద్నాలుగు భాషల్లో ఎనిమిది వేలకు పైగా పాటలు పాడిన సంపూర్ణ భారతీయ గాయని వాణీ జయరామ్.
వాణీ సంగీత యానంలో ఎమ్మెస్వీ పాత్ర చాలా ప్రత్యేకమైనది. వారిద్దరి కాంబినేషన్ లో తమిళంలోనే కాదు… తెలుగులోనూ అనేక అపురూప గీతాలు పురుడు పోసుకున్నాయి. నువ్వే నువ్వమ్మా… నవ్వుల పువ్వమ్మా… నీ సరి ఎవరమ్మా….
శాస్త్రీయ రాగాలతో ప్రయోగాలు చేయడంలో దిట్ట ఇళయరాజా మణి రత్నం ఘర్షణ కోసం ఓ డ్యూయట్ ను అమృతవర్షిణిలో స్వరం చేశారు. కురిసేను విరిజల్లులే అంటూ సాగే ఆ పాట వాణీ జయరాం బాలు ఆలపించారు. ఆకులపై వాలు హిమబిందువు వోలే నా చెలి ఒడిలోన పవళించనా అంటూ సాగుతుంది రాజశ్రీ డబ్బింగ్ కలం. ఏమైనా ఒక్కటే మాట… నువ్వే నువ్వమ్మా…. నీ సరి ఎవరమ్మా…. (భరద్వాజ రంగావఝల)
Share this Article