.
భర్తకు మరో భార్య దొరికితే ‘శుభలగ్నం’… మరి భార్యకు మరో భర్త దొరికితే?
… చిన్నప్పుడు తెలియలేదు కానీ, కాస్త ఎదిగి సాహిత్యాన్ని, సమాజాన్నీ అంతో ఇంతో చదివిన తర్వాత మరోసారి ‘శుభలగ్నం’ సినిమా చూశాను. విషయం అర్థమైంది. డబ్బు కోసం భార్య తన భర్తకు విడాకులిచ్చి మరో అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తుంది. లాభం రూ.కోటి.
Ads
ఈ కథంతా మనకు తెలిసిందే! ఒకవేళ అదే పరిస్థితిలో భర్త ఉండి, భార్యను మరో వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తానంటే ఆ కథ మనకు నచ్చేదా? మనం అంత హిట్ చేసేవాళ్లమా?
… ‘‘ఆ అమ్మాయి పెద్దింటి పిల్ల. తనతో కాస్త సుకుమారంగా ప్రవర్తించండి’’ అంటుంది ఆమని జగపతిబాబుతో. ఎప్పుడూ? తొలిరాత్రి ముందు. అదే డైలాగ్ మగవాడికి పెట్టి, ‘ఆయన సుకుమారుడు. కాస్త జాగ్రత్త’ అని భార్యతో చెప్తే మనం యాక్సెప్ట్ చేస్తామా? భర్త డబ్బు కోసం తన భార్యకు రెండో పెళ్లి చేస్తే సరే అంటామా?
నిజానికి అలాంటి సినిమాలు (‘కన్యాదానం’) వచ్చినా సరే, చివరకు భర్త మంచివాడిగా మారి తన భార్యను ప్రేమికుడి దగ్గరకు పంపడమో, లేదా తనే దగ్గరకు తీసుకునేలానో తీశారు తప్ప మగవాళ్లను విలన్లుగా చూపే ప్రయత్నం చేయలేదు. నెపాన్ని పరిస్థితుల మీదకు తోశారు. అదే భార్య చేస్తే మాత్రం అది ఆమె ఆశ, కోరిక, డబ్బు మీద వ్యామోహం.
… సరే! ‘శుభలగ్నం’ కంటే ముందే ‘ఓ భార్య కథ’ తీశారు. 900 నవలలు రాసిన తమిళ రచయిత్రి అనురాధా రమణన్ రాసిన కథ ఈ సినిమాకు ఆధారం. మంచి మంచి సినిమాలు తీసిన ‘మౌళి’ గారు దర్శకుడు. నిరుపేదరికంలో ఉన్న భర్త తన భార్యను మరొకరికి భార్యగా నటించేందుకు పంపుతాడు. భర్త బలవంతం మీద కొంత, అవతల ఓ ముసలాయన ప్రాణం నిలుస్తుందన్న నమ్మకం కొంత తోడై ఆ ముగ్గురు పిల్లల తల్లి అందుకు ఒప్పుకుంటుంది.
దానికి తగ్గట్లు ఆ భర్తకు డబ్బు ముడుతుంది. అంతస్తు పెరుగుతుంది. కానీ ఇక్కడ లోకం ఆమెకు లేచిపోయిందన్న ముద్ర వేస్తుంది. దానికంటే చచ్చిపోయిందనడం మేలనిపించి, ఆమె బతికుండగానే ఫొటోకు దండ వేసి, పిండం పెడతాడు భర్త. సమాజం దృష్టిలో భార్య చనిపోయిన భర్తగా మిగులుతాడు. ఎమ్మెల్యేగా ఎదుగుతాడు.
… హీరోహీరోయిన్ల కాస్ట్యూమ్స్, మేకప్ చూసి ఇవాళ బోల్డ్ అంటున్నామే, అలాంటిది కాదిది. కథే చాలా బోల్డ్ కథ. సినిమా కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ అయినట్లు లేదు. కానీ ఉషాకిరణ్ వాళ్లు తీసిన సినిమాల్లో ఎంచతగ్గ మంచి సినిమా. జయసుధ, చంద్రమోహన్, శరత్‌బాబు.. ఎవరి యాక్టింగ్ తక్కువని అంటాం?
హిందీ నటి ఊర్మిళకు బహుశా ఇదే తొలి తెలుగు సినిమా కావొచ్చు. నటి సూర్యకాంతం గారు చంద్రమోహన్ అక్క పాత్ర వేయడం విశేషం. సినిమా యూట్యూబ్‌లో ఉంది. చూడాలనుకున్నవారు చూడొచ్చు. – విశీ (వి.సాయివంశీ)
Share this Article