టోల్ గేట్లు మాయం!
కానీ టోల్ ఫీజు యథాతథం!!
——————–
గుళ్లో దేవుడి దర్శనం అయ్యాక బయటికి వచ్చే ముందు ఆ గుడి మంటపంలో ఒక్క సెకెను అయినా కూర్చోవాలి. అదొక ఆచారం. అనాదిగా పాటిస్తున్న సంప్రదాయం. అలా కూర్చున్నప్పుడు కోరుకోవాల్సిన కోరిక-
“అనాయాసేన మరణం
వినా దైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం”
Ads
భగవంతుడా! నాకు ఎలాంటి నొప్పి లేని చావు ఇవ్వు. ఒకరిదగ్గర చెయ్ చాచాల్సిన లేదా దయనీయమయిన రోజులు రానివ్వకు. మృత్యువు నన్ను పలకరించే రోజుల్లో నేను సదా నీ సన్నిధిలో ఉండేలా- దీవించు అని మూడు డిమాండ్లు. ఇది ఆధ్యాత్మిక చర్చ కాదు కాబట్టి “అనాయాసేన మరణం” అన్న మొదటి డిమాండుకే పరిమితమవుదాం.
——————-
“టోల్ బూత్ లు తొలగిస్తాం”
అన్న శీర్షిక చదవగానే సగటు భారతీయుడు ఏమనుకుంటాడు? ఓహో! పబ్లిక్- ప్రయివేట్ భాగస్వామ్యంలో వేసిన రోడ్లకు పెట్టిన పెట్టుబడికి అసలు, చక్రవడ్డీతో కలిపి టోల్ డబ్బులు టోటల్ గా వచ్చినట్లున్నాయి- ఇక దేశంలో టోల్ గేట్ల దగ్గర జనం తోలు తీయాల్సిన అవసరం లేదు- పోనీలే ఇన్నేళ్లకయినా టోల్ గేట్ల యాతన పీడ శాశ్వతంగా విరగడ అవుతోంది- అనుకుంటారు. కానీ కేంద్ర ఉపరితల రవాణా మంత్రి ప్రకటన సారాంశమది కాదు. “టోల్ గేట్ల స్థానంలో జి పి ఎస్ ఆధారిత వసూలు ప్రవేశ పెడుతున్నాం” అని. అంతే.
నిజమే. టెక్నాలజీ ఇంతగా పెరిగిన ఈరోజుల్లో ఓల్డ్ మాడల్ గేట్లు, రాడ్లు, అడ్డు గోడలు దేశానికి నామోషి. ఎంచక్కా జి పి ఎస్ రియల్ టైమ్ మానిటరింగ్ లో కూర్చున్న చోట కూర్చున్నట్లే నెలకు పది వేల కోట్ల రూపాయల వాహనాల దారి రుసుములు వసూలు చేసుకోవచ్చు. శ్రమ తక్కువ. పెట్టుబడి తక్కువ. రాబడి అధికం. ఫలితం అమిత వేగం. నొప్పి లేని వసూలు. తప్పించుకోలేని వసూలు.
—————–
ఇప్పుడు తెలిసింది కదా- గుడిలో కూర్చున్నప్పుడు నొప్పిలేని చావు అడగడంలో ఆంతర్యం! భగవంతుడు కరుణామయుడు. మనమేది అడిగితే అదే ఇస్తాడు. కాకపోతే చాలాసార్లు ఆయన ఇచ్చినవాటిని మన మాంస నేత్రాలు గుర్తించలేవు.
——————-
ఇప్పుడు నొప్పిని మరచిపోవడానికి కొన్ని సామెతలు. వాడుక మాటలు.
# పిచ్చి కుదిరింది. రోకలి తలకు చుట్టండి.
# పెనం మీది నుండి పొయ్యిలో పడ్డట్టు.
# లైఫ్ ట్యాక్స్ కంటే టోల్ పీజే ఎక్కువ
# తేనెటీగలా నొప్పి తెలియకుండా జుర్రుకోవాలి
# మన బండి రోడ్డు మీదికి వెళ్లినా- రోడ్డే మన బండి మీదికి వచ్చినా ఫీజు మనమే కట్టాలి.
# గత జన్మల్లో తిరిగిన దారులు, ప్రయాణించిన దూరాలు, ఎగ్గొట్టిన టోల్ ఫీజులను తాజాగా జి పి ఎస్ లెక్కకడుతోంది.
# ఏదీ వెంటరాదు. చేసుకున్న పాపం- పుణ్యం ఒక్కటే వెంట వచ్చేది. జి పి ఎస్ టోల్ వసూలు కూడా ఇప్పుడు వెంట వస్తుంది.
# చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా! వెహికిల్లో తిరిగినవాడికి తిరిగినంత టోల్ ఫీజు రోడ్డుదేవా!
-పమిడికాల్వ మధుసూదన్
Share this Article