సాటి మహిళల సమస్యలే ఎజెండా! కన్యాకుమారి టూ కశ్మీర్… ఓ నారీ జర్నీ!!
WOMB.. WOMEN OF MY BILLION. అమెజాన్ ప్రైమ్ లో డాక్యుమెంటరీగా తెరకెక్కిన ఈ కథనం ఇప్పుడో చర్చ. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆడియన్స్ అవార్డ్ గెల్చుకుని.. ఆగస్టులో జరుగబోయే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లోనూ ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. ఎందుకు WOMB గురించి మరి చర్చ అంటే… సృష్టి బక్షి కన్యాకుమారి నుంచి కశ్మీర్ జర్నీ గురించి తెలుసుకోవాలి.
సృష్టిబక్షి మాటల్లోనే కాస్త చెప్పుకుందాం: నేను చాలాకాలం మహిళల సమస్యలపై గొంతు చించుకునేదాన్ని. మహిళలపై జరిగే హింసకు సంబంధించిన కథనాలు వచ్చినప్పుడు చలించిపోయేదాన్ని. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫైర్ అయ్యేదాన్ని. 2017లో ఓసారి హైవే నంబర్ 91పైన… భర్త ఎదుటే ఓ భార్య, అతడి కూతురిని సామూహిక అత్యాచారం చేసిన ఘటన నన్ను తీవ్రంగా వెంటాడింది. ఒక దేశం మహిళల రక్షణ విషయంలో ఎంత భద్రంగా ఉందో చెప్పడానికి ఇలాంటి ఘటనలు భారతదేశంలో కొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఘటనలకు చెక్ పెట్టడం నా ఒక్కదానివల్ల అయ్యే పని కాకపోవచ్చు.. కానీ, నేనూ ఆ సంస్కరణలో భాగస్వామి కావాలనుకున్నాను. అప్పుడే ఏదైనా చేయాలన్న సంకల్పానికి నాలో బీజం పడింది.
Ads
మా నాన్న ఆర్మీ ఉద్యోగి. ఆయన దేశానికెంతో చేస్తున్నాడు. కాబట్టి, నేనూ ఏదో చేయాలనుకున్నా. ఆ తలంపుతోనే.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ కాలినడకను ప్రయాణిస్తూ.. మార్గమధ్యంలో వీలైనంత మందిని చైతన్యపర్చాలని నిర్ణయించుకున్నా. అయితే, అదే సమయంలో నేను తలపెట్టిన పాదయాత్ర ఎప్పటికీ గుర్తుండేవిధంగా.. మరెందరికో స్ఫూర్తి నింపేవిధంగా.. దాన్ని డాక్యుమెంట్ చేయాలనుకున్నా. కానీ నిర్మాతైన నా సోదరి అపూర్వ బక్షి.. ఆ డాక్యుమెంట్ చేసినదాన్ని ప్రపంచానికి చూపిద్దామన్న సూచనతోనే.. ఇప్పుడు WOMB..WOMEN OF MY BILLIONగా తెరకెక్కింది.
240 రోజుల కాలినడక.. 3800 కిలోమీటర్ల పాదయాత్ర.. ఎన్నో సవాళ్లు!
మహిళా పక్షపాతిగా.. మహిళల సమస్యల పట్ల పాలకులను, సమాజాన్ని ఆలోచింపజేసేందుకు.. ఓ సుదీర్ఘమైన ప్రయాణాన్ని నేనెంచుకున్నాను. ఆ ప్రయాణమే ఎంత కాలం పడుతుందో నాకు సరిగ్గా తెలియదు. అయితే, బహుదూరపు బాటసారిగా నేను బయల్దేరేకంటే ముందు ఓ ఏడాదిపాటు.. అందుకోసం శిక్షణ కూడా పొందాను. నాకు నేను ఈ ఫీట్ సాధించేందుకు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసే ఈ మారథాన్ ఆలోచించినంత వీజీ కాదని నాకూ తెలుసు. అందుకే శారీరకంగా, మానసికంగా సిద్ధమయ్యాను. అలా జర్నీ ప్రారంభమైంది.
రోజూ 30 నుంచి 40 కిలోమీటర్లు నడవాలన్నది నా లక్ష్యంగా పెట్టుకుని ప్రయాణాన్ని ప్రారంభించాను. నా ప్రయాణం కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు… నా జర్నీలో ఎదురయ్యే మహిళలను కలుస్తున్నప్పుడు.. వారు చెప్పే వారి వ్యథలు, కథలు కదిలిస్తుంటే… వాటి గురించి ఆలోచనలు మెదట్లో సుడులై తిరిగి మానసికంగానూ ఒకింత ఒత్తిడికి గురి చేసేవి. అయితే అదే సమయంలో నాలో ఒక చిన్న ఆశ చిగురించడానికి గల కారణమేంటంటే… నేను చెప్పేవాటిని దారి పొడవునా వినే ఎందరో మహిళల్లో.. చాలామంది ఇకపై వారు హింసను సహించేది లేదన్న చైతన్యంతో కనిపించినప్పుడు.. నా బాధను మర్చిపోయేదాన్ని. నా ప్రయాణం విజయవంతంగా సాగుతోందనే నమ్మకం నాలో నాకు కల్గి.. ముందుకెళ్లేదాన్ని.
మహిళా భద్రత, అభ్యున్నతి కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర అనే ప్రాజెక్ట్ నా బ్రెయిన్ చైల్డ్. అయినప్పటికీ… మరెందరో మహిళల జీవన స్థితిగతులను చూసినప్పుడు, అరాచకాలు కళ్లకు కట్టినప్పుడే కదా… ఈ ఆలోచనకు బీజం పడింది.. కాబట్టి దీని వెనుక ఎందరో మహిళల వ్యధలున్నాయనే భావన నా గమ్యాన్ని, లక్ష్యాన్ని ఎప్పటికప్పుడూ నాకు గుర్తు చేస్తూ ఉండేది. ప్రారంభంలో ఒంటరిగా సుమారు 4 వేల కిలోమీటర్ల ఈ పాదయాత్ర నేనెలా చేయగలననుకునేదాన్ని. కానీ, ప్రయాణంలో ఎందరో నాతోపాటు కలిసిన సన్నివేశాలు.. వారితో గడిపిన సమయం.. ముచ్చట్లు ఇవన్నీ నా జర్నీని సులభతరం చేశాయి. నా ఈ జర్నీలో ఎదురైన మూడు కీలకమైన స్టోరీస్ ను మీరు WOMB డాక్యుమెంటరీలో చూడొచ్చు.
ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ కు సంబంధించైనా, లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివలైనా… నా డాక్యుమెంటరీని ప్రదర్శించడమే కాకుండా.. నా డాక్యుమెంటరీలో పాత్రధారులైన మహిళలకు న్యాయం, సాయమందేలా చూడాల్సిన బాధ్యత వాళ్లకుంది. ఎందుకంటే అలాంటి అంశాలెన్నింటినో ఎంతో బాధ్యతతో నేను జర్నీలో విన్నాను.. వాటిని డాక్యుమెంట్ చేశానంటోంది సృష్టి బక్షి.
WOMB డాక్యుమెంటరీతో.. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు సృష్టి సందేశం మరి చేరుతుందా..?
నా జర్నీయే మహిళా అభ్యున్నతి, వారి రక్షణ కోసం. కాబట్టి మారుమూల ప్రాంతాల్లో సైతం మహిళలనుభవిస్తున్న వ్యథలను తెలుసుకోవడంతో పాటు.. ఎందరో సక్సెస్ స్టోరీస్ ను కూడా ఉదాహరణలుగా చూపించేందుకే నేను యాత్ర చేపట్టాను. వాటిని డాక్యుమెంట్ చేశాను. ఇప్పుడు డాక్యుమెంటరీగా కూడా అంతర్జాతీయంగా ప్రదర్శించబడుతోంది. ఇక సందేశం చేరేదెలా అంటే… ఇది విస్తృతమైన చర్చకు తెర తీయాలి. టాక్ ఆఫ్ ద మౌత్ కావాలి. అప్పుడే తన లక్ష్యానికి.. ఈ డాక్యుమెంటరీ కూడా తోడైనట్టు అంటోంది సృష్టి.
తన జర్నీలో కలిసిన మహిళల స్పందన గురించి.. సృష్టి ఏమంటుందంటే..?
వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేందుకు చాలాచోట్లా సాధారణంగానే ముందుకు రారు. ఆ క్రమంలో మా వర్క్ షాప్స్ లో మేం చైతన్యపర్చే ప్రయత్నం చేశాం. మేం కల్పించాలనుకున్న అవగాహనకు మంచి స్పందన వచ్చింది. చాలా మంది మహిళలు ముందు కొంత మొహమాటపడ్డా.. ఆ తర్వాత మహిళలుగా తామెదుర్కొన్న బాధలు, వ్యథలను నిర్భయంగా ముందుకొచ్చి చెప్పారు. తమకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరుగొద్దనే భావనను మహిళలు ముందుకొచ్చి వెలిబుచ్చేందుకు.. ఈ అవగాహనా సదస్సులు దారివెంట ఎంతో ఉపయోగపడ్డాయి.
నేను ఆర్మీ ఆఫీసర్ కూతురిగా… దాదాపు దేశమంతటా తిరిగాను.. వివిధ చోట్ల పెరిగాను. నేను హాంకాంగ్‌లో ఉన్నప్పుడు నా తోటివారి కంటే నాకే ఎక్కువ తెలుసనుకునేదాన్ని. కానీ, నేను భారతదేశంలోని గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను కలిసినప్పుడు అర్థమైంది. నేను తెలుసుకోవాల్సింది చాలా ఉందని. నాకింకా ఏం తెలియదో, ఎంత తెలియదో అప్పుడర్థమైందంటుంది. అలా తన కన్యాకుమారి నుంచి కశ్మీర్ జర్నీలో.. ఎన్నో కథలు, వ్యథలు, సక్సెస్ స్టోరీస్, ఎన్నో ఆవిష్కరణలతో… తానో కొత్త భారతాన్ని కనుగొన్నానంటోంది బహుదూరపు బాటసారి సృష్టి బక్షి…. (Article By రమణ కొంటికర్ల)
Share this Article