.
ఉన్నారు, ఇంకా అక్కడక్కడ !
ఇపుడు 55 ఏళ్ల వయసు కలిగిన సుధాకరన్ కు 2014 లో 45 ఏళ్ళ వయసు. ఆయన ఉత్తర కేరళలోని కన్హన్ ఘాడ్ లో cool drinks, sweets తో పాటు లాటరీ టికెట్లు కూడా అమ్ముతాడు.
Ads
ఆయన దుకాణం పేరు శ్రీ మూకాంబిక. నెలకు 10 వేల రూపాయల కంటే ఎక్కువ సంపాదన చూడలేదు.
దైవభక్తుడు. తక్కువగా మాట్లాడతాడు. కోపం రాదు. సహనం పోదు. పెద్దగా చదువుకోలేదు (అదృష్టం కొద్దీ !). జీవితంలో ఏవో పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోలేదు.
సాధారణ జీవితం. ఆ జీవితంలో కొన్ని పాటిస్తూ వస్తున్నాడు : తల్లితండ్రులు చెప్పే వాటిలో మంచి వుంటే, దాన్ని పాటించాలి, ఎవరినీ మోసం చేయరాదు, డబ్బు వున్నా, లేకపోయినా ఒకే విధంగా వుండాలి, ఎంతమందిని మోసం చేసినా, ఎన్ని తంటాలు పడినా, యమ భటులో, దేవ దూతలో వచ్చినపుడు, నేను ఇక్కడి నుండీ ఆవగింజను కూడా తీసుకెళ్లలేను…
ఒక రోజు తన దుకాణానికి దాదాపు ప్రతి రోజూ వచ్చే అశోకన్ అనే వ్యక్తి, సుధాకరన్ కు ఫోన్ చేసి ” నాకు 10 లాటరీ టికెట్లు పక్కన పెట్టు. డబ్బు మళ్ళీ ఇస్తాను ” అన్నాడు. ఈయన సరేనని 10 టికెట్లు పక్కన పెట్టి మిగతావి అమ్మేసాడు. మరుసటి రోజు లాటరీ టికెట్ల ఫలితాలు వచ్చాయి. సుధాకరన్ తాను అశోకన్ కోసం ఎత్తి పెట్టిన టికెట్లను తీసికొని చూస్తే వాటిలో ఒక టికెట్ లాటరీ గెలుచుకొంది. డబ్బు ఎంత? 10 Million rupees. అంటే ఒక కోటి రూపాయలు.
2014 లో ఒక కోటి రూపాయలు.
అశోకన్ కోసం ఎత్తి పెట్టిన లాటరీ టికెట్ల నంబర్లు తనకు తప్ప, ఎవరికీ తెలియదు. ఆ టికెట్లకు అశోకన్ ఇంకా డబ్బు కూడా ఇవ్వలేదు, ఏదో ఒక మాట చెప్పి ఆ కోటి రూపాయలు తాను తీసుకోవచ్చు. అలానే చేశాడా ? లేదు.
ఫోన్ అందుకొని తండ్రికి కాల్ చేసి, జరిగిన విషయం చెప్పి ” ఏమి చేయమంటారు? ” అని అడిగితే ఆయన ” ఇందులో ఆలోచించేందుకు ఏముంది? అశోకన్ కు ఫోన్ చేసి నీవు ఒక కోటి రూపాయలు గెలుచుకొన్నావు ‘ అని చెప్పి, ఆ లాటరీ టికెట్ అతనికి ఇచ్చేయి ” అన్నాడు.
సుధాకరన్ మరో ఆలోచన కూడా చేయలేదు. తండ్రి చెప్పినట్టే చేసాడు.
“అంత డబ్బు చూసాక, మీరు దాన్ని మీ సొంతం చేసుకోవాలి అనిపించలేదా? అశోకన్ కు ఆ నంబర్ తెలియదు కదా? ఇతరులకు కూడా ఆ టికెట్ నంబర్ గురించి తెలియదు కదా? ” అని ఒక జర్నలిస్ట్ అడిగితే ” అసలు అలా అనిపించలేదు. నా తల్లితండ్రులు నాకు నిజాయితీగా బ్రతుకు అని చెప్పారు. ‘ నీకు డబ్బు అవసరం వుంటే, అడుక్కు తిను కానీ ఇతరుల డబ్బును తీసుకువద్దు ‘ అని వాళ్ళు నాకు చిన్నప్పటి నుండీ నేర్పించారు, ” అన్నాడు సుధాకరన్.
ప్రపంచంలో 99% మంది ఎందుకు, ఎలా జీవిస్తారో అలా కాకుండా 1% మంది మరి దేనికోసమో జీవిస్తారు. ధర్మాన్ని వదలరు. అబద్దం చెప్పరు. సత్యాన్ని తప్పరు. ఆ ఒక్క శాతం మనుషులే ఈ భూమికి అందం, ఈ లోకానికి అలంకారం…. రమణాకర్ పత్తిపాటి
Share this Article