.
చంద్రబాబును సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నా… నీ తల్లిదండ్రులెవరో రాష్ట్ర ప్రజలకు ఏనాడైనా చూపించావా..? వాళ్లతో కలిసి ఉన్నావా..?
రాజకీయంగా నువ్వు ఎదిగాక వాళ్లను ఏనాడైనా పిలిచి భోజనం పెట్టావా..? వాళ్లిద్దరూ కాలంచేస్తే కనీసం తలకొరివి పెట్టావా..? ఎలాంటి మానవతా విలువలు లేని వ్యక్తివి నువ్వు….
Ads
….. పైన పంక్తులు మాజీ సీఎం జగన్ చంద్రబాబును ఉద్దేశించి వేసిన ప్రశ్నలు… రెండున్నర పేజీల సాక్షి కవరేజీని పైపైన చూస్తూ వెళ్తే… రాజకీయంగా తను ఏవేవో ఆరోపణలు చేస్తాడు, సహజమే కానీ సరిగ్గా ఈ పంక్తుల దగ్గర కళ్లు ఆగిపోయాయి…
ఏపీ రాజకీయాల్లో విమర్శలు చివరకు ఈ తల్లిదండ్రులకు కొరివి అనే అంశం దాకా చేరుకున్నాయా అనేది కాదు… వందల కోట్ల అద్భుతమైన తన జుబ్లీ హిల్స్ ప్యాలెస్ లోపల ఎలా ఉందో ఈరోజుకూ జనానికి తెలియదనే సబ్జెక్టు కూడా కాదు… తల్లిదండ్రుల్ని పట్టించుకోలేదు, తనతోపాటు ఉండనివ్వలేదు అనే కోణం కొత్తది… ఆ నారావారిపల్లెలో వాళ్లు అలాగే తమ పాత బతుకులనే గడిపారు తప్ప చంద్రబాబు ఎదుగుదల ప్రభావం వారిపై లేదు అనేది జగన్ విమర్శ సారాంశం…
ఓసోస్… ఈమాత్రం దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలా..? మేం కౌంటర్ చేయలేమా..? జగన్ నోరుంది కదాని ఏదో అనేస్తే… మన పెన్నుంది కదాని ఏదో రాసేస్తే పోలా అనుకున్నట్టుంది ఆంధ్రజ్యోతి… కొన్ని అంశాల్లో చంద్రబాబు సరిగ్గా విశ్లేషించుకోలేడు, చెప్పుకోలేడు గానీ ఆంధ్రజ్యోతి చేయగలదు… అందుకే ఇలా రాసుకొచ్చింది…
చంద్రబాబు 1975 ప్రాంతంలో విద్యార్థి సంఘనేతగా రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత యూత్ కాంగ్రెస్ నేతగా, అలా… అలా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. కుమారుడి విజయాలకు తల్లిదండ్రులు లోలోపల ఆనందించి ఉంటారు గానీ పేరొందిన నాయకుడి తల్లిదండ్రులుగా వారెప్పుడూ భావించలేదు. చంద్రబాబు 1995 సెప్టెంబరు 1న సీఎంగా ప్రమాణం చేశారు. ఆయన తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేద్దామని తిరుపతి నుంచి విలేకరులు నారావారిపల్లె వెళ్లారు.
తల్లి అమ్మణ్ణమ్మ ఇంటి దగ్గర లేరు. తండ్రి ఖర్జూర నాయుడు మాత్రం నిద్రిస్తున్నారు. ఇరుగుపొరుగువారిని అడిగితే ఆమె పొలానికి వెళ్లారని చెప్పారు. అటు వెళ్లిన మీడియా ప్రతినిధులకు చంకలో బుట్ట పెట్టుకొని గట్టుపై నడుస్తూ ఆమె కనిపించారు. ‘‘అమ్మ… బాబన్న సీఎం అయ్యారు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు’’ అని అంటే ‘‘ఇవ్వాళ్ల కూలోల్లు రాలేదయ్యా. ఏడ పని అక్కడే ఆగిపోయింది.
పోయి పనిచేసుకోవాలా’’ అంటూ ఆమె ముందుకు నడిచారు. ‘‘అదేమిటి? బాబన్న హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మిమ్ములను పిలుచుకొని వెళ్లలేదా’’ అని అడిగితే… ‘‘వాడు రమ్మన్నాడయ్యా. అంత పెద్ద ఊరులో మేం ఉండలేం. మీ తాతకు (చంద్రబాబు తండ్రి) ఇల్లు ఇడిసిపెట్టి బయటకు పోవడం ఇష్టం ఉండదు’’ అని ఆమె సింపుల్‌గా తేల్చేశారు.
చంద్రబాబు సీఎం కాకముందు మంత్రిగా, కర్షక పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. అప్పుడు కూడా ఆయన తల్లిదండ్రులు, తోబుట్టువులు అతి సాధారణ జీవితమే గడిపారు. ఆ కుటుంబంలో ఎవరూ తాము సీఎం బంధువులమని వీర్రవీగనూ లేదు. ఏ హడావుడీ చేయలేదు. వారు తన వద్దకు రారు కాబట్టే చంద్రబాబే వారి వద్దకు వెళ్తుంటారు. సంక్రాంతికి ఇంటికి వెళ్లి కుటుంబంతో గడపడానికి ఆయన ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం కూడా ఇదే…
అక్షరం తేడా లేకుండా సరిగ్గా ఇదే ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిన వార్త… కొన్ని వార్తలో, సంపాదకీయాలో, అభిప్రాయాలో, కౌంటర్లో తెలియవు కదా… ఏయ్, జగనూ నోరుంది కదాని పారేసుకోకు అన్నట్టుగా కౌంటర్ వేసింది…
ఐతే జగన్ విమర్శలో ఉన్న ఓ పాయింట్‌కు ఇందులో కౌంటర్ లేదు, వివరణ లేదు ఎందుకో… జగన్ విమర్శించింది నిజమేనా అనే సందేహం కూడా ఉంది… తల్లిదండ్రులు కాలంచేస్తే తను తలకొరివి పెట్టకపోవడం ఏమిటి..? మరి పెట్టింది ఎవరు..? మొన్న మరణించిన రామ్మూర్తినాయుడు తన తమ్ముడు… ఐనా కొరివి పెట్టాల్సింది పెద్ద కొడుకే కదా…
నిజంగానే ఆంధ్రజ్యోతి చెప్పినట్టు నోరుంది కదాని జగన్ ఏదేదో అనేశాడా..? లేక తన వార్తలో దాన్ని కూడా ఓ కథలా రాయడానికి ఆంధ్రజ్యోతికి సమయానికి ఏ కథా గుర్తుకురాలేదా..? సమాధానమే లేదా..? ఏమో… అంతా జగన్మాయ… బాబు మాయ…!!
తమ్ముడు చనిపోతే… ఊరికి వెళ్లి… తను స్వయంగా పాడె మోశాడు చంద్రబాబు… పైన ఫోటోయే సాక్ష్యం… అలాంటిది పాపం, ఆంధ్రజ్యోతి భాషలో చెప్పాలంటే… తను తల్లిదండ్రులకు కొరివి పెట్టలేదంటూ… నోరుంది కదాని అనేస్తే ఎలా జగన్ బాబూ..!! ఏమైనా ఆధారాలున్నాయా…!!
Share this Article