.
Destiny… Her death was a tragedy …
చిత్ర పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం… అందులోకి వెళ్ళాలి అని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. కొందరికి మాత్రమే అవకాశాలు దొరుకుతాయి. దొరికిన వారు కూడా స్థిరపడతారా అంటే ? అది కూడా సందేహమే. టాలెంట్ ఉండి కూడా నిలదొక్కుకోలేక పోయిన వారు ఎందరో ఉన్నారు. అవకాశాలు దొరికిన నటీనటులు మంచి జీవితాన్ని గడుపుతూ ఉంటారు.
Ads
కానీ ఎప్పుడైతే అవకాశాలు తగ్గిపోతుంటాయో అప్పుడే ఇక అసలు సమస్యలు మొదలవుతాయి. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. సంపాదించిన సొమ్ము దాచుకోకపోతే … తర్వాత కాలంలో ఇబ్బందుల పాలవుతారు. చిత్ర పరిశ్రమలో అలా ఇబ్బంది పడిన వారు ఎందరో ఉన్నారు. దుర్భర పరిస్థితుల్లో మరణించిన వారు కూడా ఉన్నారు. నటి మాలతి కూడా అంతే. యంగ్ జనరేషన్ కి ఆమె గురించి అంతగా తెలియక పోవచ్చు.
నటి మాలతి అసలు పేరు సూర్య కుమారి.. గుంటూరు లో 1926 లో పుట్టారు. తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. తల్లి తో కలసి బంధువులున్న ఏలూరు వచ్చారు. తల్లి నానా కష్టాలు పడి సూర్యకుమారిని చదివించారు. సంగీతం కూడా నేర్పించారు. అప్పట్లో చిన్నవయసులోనే పెళ్లిళ్లు జరిగేవి.
సూర్యకుమారికి అలాగే పెళ్లి అయింది. భర్త వీరాచారి మంచివాడే. ఈమె ప్రతిభను గుర్తించి నాటకాలలో స్త్రీ పాత్రలు వేయమని ప్రోత్సహించాడు. కొన్ని నాటకాల్లో కూడా ఆమె నటించారు. అతను కూడా ఒక నాటక సంస్థకు మేనేజర్ గా చేసేవాడు. కొందరు మిత్రులు సూర్యకుమారి సినిమాల్లో చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని సలహా ఇచ్చారు.
దీంతో ఆయన భార్యను తీసుకుని మద్రాస్ వెళ్ళాడు. ప్రొడక్షన్ సంస్థల చుట్టూ తిరిగాడు. ఒక చిన్న అవకాశం దొరికింది. 1939 లో ఉషాపరిణయంలో పార్వతి పాత్రలో నటించింది. అయితే వెంటనే అవకాశాలు రాలేదు. ప్రముఖ దర్శకుడు బీఎన్ రెడ్డి దృష్టిలో పడింది. ఆయన సుమంగళిలో ఒక ముఖ్య పాత్ర ఇచ్చారు. ఆ సినిమాలో ‘వస్తాడే మా బావ’ అనే పాట కూడా పాడారు. ఆ సినిమా బాగా ఆడటంతో ఆమె వాహిని సంస్థలో ముఖ్య తారగా మారింది.
తర్వాత భక్తపోతనలో కూడా నటించారు. 1943 లో ప్రముఖ నటుడు నాగయ్య సరసన నాయికగా గృహలక్ష్మిలో నటించారు. అలా వరుసగా మాయా మశ్చీంద్ర, యువరాణి, గుణసుందరి కథ చిత్రాల్లో నటించారు. ప్రతిభగల నటిగా పేరు సంపాదించారు. ఆ తర్వాత ‘పాతాళభైరవి’ లో రాకుమార్తె పాత్ర చేశారు. అందులో ఎన్టీఆర్ సరసన చేశారు. పాతాళభైరవి సూపర్ హిట్ అయింది. అయినా కూడా మాలతికి పెద్దగా అవకాశాలు రాలేదు. తర్వాత కాలంలో ఎన్టీఆర్ పక్కన సోదరి పాత్రల్లో కూడా నటించారు.
పాతాళ భైరవి తర్వాత సారధి వారి పేరంటాలు, గోపీచంద్ తీసిన అగ్నిపరీక్ష, కాళహస్తీశ్వర మహాత్యం వంటి చిత్రాలలో నటించారు. ఆ తర్వాత ఆమెకు హీరోయిన్ పాత్రలు రాలేదు. అల్లాఉద్దీన్ అద్భుత దీపం, పతిభక్తి, అన్నాతమ్ముడు, దైవబలం,పెళ్లికానుక, ఇంటికి దీపం ఇల్లాలు, ఆమె ఎవరు ? మర్యాద రామన్న, పూలరంగడు, శ్రీరామకథ తదితర చిత్రాల్లో నటించారు. చివరిగా ఆమె 1979లో వచ్చిన ‘శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం’లో నటించింది.
భర్త మరణించాక మాలతి మద్రాసు నుంచి హైదరాబాద్‌కు వచ్చేసారు. వేషాలు బాగా తగ్గిపోయాయి. అప్పట్లో కాచిగూడలో ప్రభాస్ థియేటర్ ఉండేది. ఆ థియేటర్ వెనక రేకులషెడ్డులో మాలతి ఒంటరిగా ఉండేవారు. రోజూ పక్కనే ఉన్న గుడికి వెళ్లి రెండుపూటలా పూజారి పెట్టే ప్రసాదంతో కడుపు నింపుకునేది. తను నటిని అన్న విషయం ఎవరికీ చెప్పేది కాదు మాలతి.
1979 నవంబర్ 25న పెనుగాలులు వీచిన క్రమంలో ప్రభాస్ థియేటర్‌కు చెందిన 20 అడుగుల గోడ కూలి మాలతి ఇంటి పైకప్పుపై పడింది. దాంతో రేకుల షెడ్డు నేలమట్టమైంది. శిథిలాల కింద చిక్కుకున్న మాలతిని గుర్తించి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అయితే ఈలోపే ఆమె కన్నుమూసారు. ఇంట్లో ఉన్న ట్రంకుపెట్టె తెరచి చూస్తే ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫోటోలు కనిపించాయి. అప్పుడు అందరు తనను పాతాళభైరవి హీరోయిన్ మాలతి అని గుర్తుపట్టారు. అంత దుర్భర స్థితిలో ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. విధివిలాసం..! ( KN Murthy … tharjani.in )
Share this Article