.
ప్రతీ మనిషి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ఆ లక్ష్యసాధన దిశగా తన జీవిత గమనాన్ని నిర్దేశించుకుంటాడు. లక్ష్యం ఎంత కష్టసాధ్యమైనా, దానిని సాధించడానికే ఉత్తమ పురుషులు కృషి చేస్తారు. మధ్యలో లక్ష్యాన్ని వదిలేసి పోరు.
‘ప్రజాకవి కాళోజీ’ సినిమా నిర్మాణం నా స్వప్నం. ఒక మహోన్నతమైన, శిఖరసమానుడైన వ్యక్తికి, బయోపిక్ అంటే అతని నిజ జీవిత సినిమా రూపంలో నీరాజనం సమర్పించాలని గత ఆరేళ్ళుగా తపిస్తున్నాను. నా దగ్గరేమో వనరులు తక్కువ. ముందున్నదేమో కొండంత ఆశయం.
Ads
అసలు కథే లేని సందర్భం. కాళోజీ గారి జీవితం పది సినిమాల పెట్టు. అంత అనుభవ సారాన్ని ఒక సినిమాలోకి కుదించడం అసాధ్యమనిపించింది. కాళోజీ గారి మిత్రబృందంలో వేలాది మంది ఉన్నారు. అందులో అనేక సిద్ధాంతాలకు కట్టుబడి వారున్నారు. వేలాది మందితో ఆయనకు అపురూపమైన అనుభవాలు ఉన్నాయి.
ఏ ఒక్కరిని వదిలేసినా, ఏ సంఘటనను మిస్ చేసుకున్నా కాళోజీ గారి వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా దర్శింప చేయలేము. అందు కోసం, స్క్రీన్ ప్లే రాసుకోవడానికి సుమారు సంవత్సరం పట్టింది. అనేక మంది సమకాలీనులను ఇంటర్వ్యూ చేసాను.
ఎందుకంటే, కాళోజీ గురించి ఒక వ్యాసం రాయడం సులభం. కానీ, ఆయనను దృశ్య రూపంలో చూపించాలంటే ఆంగికం, అభినయం, బాడీ లాంగ్వేజ్, వివిధ రకాల మనస్తత్వాలున్న మనుషులతో ఆయన ప్రవర్తన, మాట తీరు, హాస్య ప్రియత్వం వంటి లక్షణాలతో కూడిన ఒక మూర్తిని, దర్శకుడిగా ముందు నేను నా మనసులో ఊహించుకోవాలి.
అందుకోసమని, అనేక మందిని ఇంటర్వ్యూ చేయవలసి వచ్చింది. బయోపిక్ నిర్మాణంలో అతి ముఖ్యమైన వనరు, మనం ఎవరి గురించైతే సినిమా తీయబోతున్నామో, ఆ మహాపురుషుని పోలికలతో ఉన్న నటుడిని వెతికి పట్టుకోవడం.
అనేక ప్రయత్నాల తర్వాత అటువంటి నటుడిని వెతికి, వేసారి, విసుగు చెంది చివరకు సాధించాను. ఆ నటుడు అంతకు ముందు, తరువాత కూడా చిన్న చిన్న పాత్రలు వేసుకునే జూనియర్ ఆర్టిస్ట్. అతన్ని సానబట్టి, వర్క్ షాప్ నిర్వహించి, నాకు కావలసిన విధంగా మలుచుకున్నాను.
ఈ ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్ లో అనేక ముఖ్య పాత్రలు ఉన్నాయి. కాళోజీ గారి బాల్య మితృడు పీవీ నర్సింహరావు; అగ్రజుడు రామేశ్వరరావు; సమకాలీన కవి శ్రీశ్రీ వారిలో ముఖ్యులు. ఆ పాత్ర కోసం పీవీ నర్సింహరావు గారి సోదరుడు 83 ఏళ్ళ పీవీ మనోహర రావు గారిని బ్రతిమిలాడి ఒప్పించాము.
సినిమా కొంత షూటింగ్ జరుపుతున్న తరువాత కరోనా మహమ్మారి ప్రభంజనం వల్ల, మా ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఎవరు ఉంటారో, ఎవరు పోతారో తెలియని దుస్థితి. అదృష్టవశాత్తు అందరూ క్షేమంగా ఉన్నారు. 2022 లో సినిమా నిర్మాణం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత 13.11.2023, కాళోజీ గారి వర్థంతి రోజున, క్లీన్ ‘U’ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది.
అప్పటి నుండి సినిమా విడుదలకు, నానా కష్టాలు పడ్డాను. నా ఆత్మాభిమానాన్ని, వయసును మరిచి కొంత మంది కాళ్ళు పట్టుకున్నంత పని చేసినా గానీ అప్పటి ప్రభుత్వ పెద్దలు గానీ, పరిశ్రమ పెద్దలు గానీ కరుణించ లేదు.
ఎక్కడికి వెళ్ళినా నిరాశే ఎదురయింది. ‘ఇటువంటి సినిమాలు చూడరండీ’ అన్నదే సమాధానం. లేదంటే, మనమే ఎదురు డబ్బులు చెల్లించి, థియేటర్లకు రెంటు కట్టి సినిమాను నడిపించుకోవలసిన పరిస్థితి. అది నాకు ఇష్టం లేదు.
తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవనానికి మూల పురుషుడైన మహాకవికి, తెలుగు నేల మీదనే ఆదరణ లేదనే విషయం ముల్లులా గుచ్చుకుంటుండేది.
తమిళనాడులో మహాకవి ‘సుబ్రహ్మణ్య భారతి’ జీవిత చరిత్రను సినిమాగా తీస్తే, ప్రజలు కళ్ళకు అద్దుకుని తండోపతండాలుగా వచ్చి చూసి, తమ భక్తిని చాటుకున్నారు. రిక్షా నడిపే సోదరులు రిక్షాలను రాత్రింబవళ్ళు నడిపి, ఓవర్ టైమ్ చేసి, ఆ వచ్చిన డబ్బులతో, సినిమా చూసి సుబ్రహ్మణ్య భారతికి నివాళులు అర్పించారు. యూట్యూబులో, ఆ సినిమా ఉంది చూడండి.
సాంకేతిక విలువల పరంగా అత్యంత నాసిరకంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య భారతిగా నటించిన నటుడు ఎవరో తెలుసా? ‘శియాజీ షిండే’… తమిళమే రాని, మరాఠీ నటుడు, డబ్బింగు చెప్పించిన సినిమా అయినా, ఆ మహాపురుషుడి మీద ఉన్న అభిమానం వల్ల సూపర్ డూపర్ హిట్ అయింది.
మన తెలుగు సినిమా రంగ దౌర్భాగ్యం ఏమిటంటే, ఇక్కడ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత, ప్రముఖులను గౌరవించుకునే విషయంలో సందిగ్ధత ఏర్పడింది. యస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రపంచ ప్రఖ్యాత గాయకుడికే సరైన నివాళి అర్పించలేకపోయాయి అప్పటి రెండు ప్రభుత్వాలు. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు, ఆయన తమ వాడేనని తీర్మానించి శిలాఫలకాలు, వీధులకు పేర్లు పెట్టుకుని సత్కరించుకున్నాయి.
ఇటువంటి దుస్థితి టాలీవుడ్ లో నెలకొన్న సమయంలో ఒక ఆశాకిరణం కనిపించింది. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారు, వేం నరేందర్ రెడ్డి సినిమాలోని కొన్ని పాటలను చూసి, నచ్చి, మెచ్చి వెంటనే రంగంలోకి దూకారు.
మొట్టమొదట, రోజుకు ఒక షో చొప్పున వేద్దామని, ప్రేక్షకుల స్పందనను చూసి తదుపరి కార్యక్రమాన్ని ఆలోచిద్దామని ఒక ప్రతిపాదన చెప్పారు. దానికి అదనంగా, నేను నిరాశ చెందకూడదని, పాఠశాల విద్యార్థులకు సినిమా చూపించడం వల్ల కాళోజీ ఔన్నత్యం వారికి తెలుస్తుందని సలహా ఇచ్చారు.
డిసెంబర్ 5 న పుష్ప- 2 సినిమా రిలీజ్ ఉండడం, తర్వాత సంక్రాంతి, తరువాత వేసవి సెలవుల కారణంగా థియేటర్లు దొరకడం సాధ్యం కాదని తెలియడంతో, ఈ నెల 29 నుండి వారం రోజుల పాటు ‘ప్రజాకవి కాళోజి’ సినిమా తెలంగాణలోని 25 థియేటర్లలో మార్నింగ్ షో మాత్రం ప్రదర్శించబడుతుంది.
మితృలు, శ్రేయోభిలాషులూ చూసి ప్రోత్సహిస్తే, నాకు మరిన్ని మంచి సినిమాలు తీసే ధైర్యం వస్తుంది. ఈ సినిమాకు ఆయువుపట్టు వంటి కెమెరా పనితనాన్ని అందించిన రవికుమార్ నీర్ల సినిమా రిలీజ్ కాకముందే దురదృష్టవశాత్తు మరణించారు. ఆయన ఆత్మకు కూడా, శాంతి కలుగుతుంది.
‘ప్రజాకవి కాళోజీ’ గారు ఎక్కడున్నా మన క్షేమం కోరుతూనే ఉంటారు.
‘పుట్టుక_ నీది … చావు_ నీది … బ్రతుకు_ దేశానిది’
ఈ సందేశం కేవలం ఉట్టి మాటలు కాదు. ఈ సందేశాన్ని అణువణువునా, ఆచరించి ఒక్క రూపాయి సంపాదించుకోకుండా మరణించి, దేవలోకంలో కొన్ని ప్రజాసమస్యలున్నాయని, వాటిని పరిష్కరించడానికి అవనికేగిన మహా మనీషి కాళోజీ. తన పార్థివ దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి, ప్రయోగ నిమిత్తం డొనేట్ చేయమని చెప్పిన మానవతా మూర్తికి, నా సినిమా ద్వారా ఘన నివాళిని అర్పిస్తున్నాను…… ప్రభాకర్ జైనీ
Share this Article