.
ఈరోజు ఆసక్తికరం అనిపించిన వార్త… మలేసియాలోకెల్లా మూడో అతిపెద్ద ధనవంతుడి కొడుకు… సర్వం విడిచి సన్యాసం స్వీకరించడం… అంత వైరాగ్య భావన ఎలా సాధ్యపడిందో మరి…
,
Ads
ముందుగా ఈ వార్త చదవండి… (నిజానికి పాత వార్తే)… తన పేరు వెన్ అజాన్ సిరిపన్నో… మలేషియాకు చెందిన బిలియనీర్ ఆనంద్ కృష్ణన్‌కు ఈయన ఏకైక సంతానం… తండ్రికి దాదాపు 40 వేల కోట్ల ఆస్తులున్నాయి…
మనం చాలామంది ధనికుల పిల్లల్ని చూస్తుంటాం కదా… అధికారం, డబ్బు, ప్రలోభాలు, వ్యామోహాలు, విలాసాలతోపాటు అసాంఘిక ధోరణులు కూడా… అన్ వాంటెడ్ ఎలిమెంట్స్ అవుతుంటారు సొసైటీకి…
కానీ అజాన్ 18 ఏళ్లకే ఆధ్యాత్మికమార్గం పట్టాడు… తల్లి కుటుంబానికి నివాళి అర్పించడానికి మొదట థాయ్‌లాండ్ వెళ్లిన తను అక్కడే తన జీవనమార్గాన్ని నిర్దేశించుకున్నాడు… ఐహిక సుఖాల అనుభవంకన్నా ఆధ్యాత్మిక పయనమే మేలనుకున్నాడు…
సన్యాసం స్వీకరించాడు… తండ్రి కూడా తన నిర్ణయాన్ని గౌరవించాడు… నీ ఇష్టం అన్నాడు… అజాన్ అప్పటి నుంచీ ఇతర బౌద్ధ భిక్షువుల్లాగే అత్యంత సాధారణ జీవితం గడుపుతూ… బౌద్ధ, థాయ్ అటవీ, పాత సంప్రదాయాల్ని ప్రచారం చేస్తున్నాడు… ఎప్పుడో ఓసారి తండ్రి వద్దకు వెళ్లి వస్తుంటాడు…
… ఇదీ వార్త… బౌద్ధంలో సన్యాస జీవనం సాధారణమే… ఐహిక సుఖాల్ని, వాంఛల్ని వదిలేసుకుని భిక్షువుగా మారమని బోధిస్తుంది… జైనుల్లో కూడా అనేక మంది ఒక వయస్సు రాగానే అన్నీ వదిలేస్తారు… సన్యాసం స్వీకరిస్తుంటారు… అత్యంత ధనికులు కూడా… తమ సిరిసంపదల్ని తృణప్రాయంగా వదిలించుకుంటారు…
కఠినమైన ఆహార నియమాలు, అత్యంత నిరాడంబర జీవనం… హైందవం కూడా వానప్రస్థాశ్రమం గురించి చెబుతుంది… రాజ్యాలు, వైభోగాలు, అధికార లాలస, ఇతర సుఖాల్ని కూడా వదిలేసుకున్న ఉదాహరణలు బోలెడు కనిపిస్తాయి…
కొందరు యువకుల్లో కూడా యవ్వనంలోనే ఈ సన్యాసత్వ సంకల్పం కలగడం విశేషం… అది రకరకాల ప్రలోభాలకు గురయ్యే వయస్సు… ఐనా అజాన్ వంటి కొందరు వైరాగ్యాన్ని సాధిస్తున్నారు… అదెలా అనేది సరిగ్గా బోధపడదు… డిటాచ్‌మెంట్ అనేది మామూలు విషయం కాదు… సులభమూ కాదు…
చాలామంది యోగులు, సన్యాసులకే సాధ్యం కావడం లేదు… బంధాల్ని తెంచుకోలేకపోవడం అనే బలహీనత నుంచి బయటపడలేకపోతున్నారు… నేను చెప్పేది పీఠాలు, సోకాల్డ్ ఆశ్రమాధిపతుల గురించి కాదు… వ్యక్తులుగా ఒక దశ దాటాక అన్నింటితో డిటాచ్ కావడం గురించి..!
అజాన్ కథే తీసుకుంటే… తనలో సొంతంగా ఆ కోరిక పుట్టిందా..? ఎవరైనా మార్గదర్శనం చేశారా..? ఇంకేమైనా అనుభవాలు తనను ఆ దారిలోకి మళ్లించాయా తెలియదు… కానీ యవ్వనంలో సన్యాస స్వీకరణ కథలు ఎప్పుడూ ఆసక్తికరమే… అజాన్ కథ కూడా అదే…
Share this Article