.
అంతుచిక్కని రహస్యం… ఆ పర్వతం!
మార్మికత.. తెలుసుకోవాలనే ఉత్సుకతను రేకెత్తిస్తుంది.
Ads
ఏ ఒక్క మతమో మాత్రమే ఆరాధించే ప్రదేశమైతే మిగతావారికి అంత ఆసక్తి ఉండకపోవచ్చు. కానీ, నాల్గు మతాలు ఆరాధించి, భక్తితో కొల్చే ఆధ్యాత్మికత ఆ పర్వత సొంతం. అంతుచిక్కని క్యూరియాసిటీతో పర్యాటకులను ఆకర్షించండంలో ఆ పర్వతం ఓ అయస్కాంతం.
మానవ నిర్మితం కాదు… కానీ, ఎవరో సుప్రసిద్ధ శిల్పి తీర్చిదిద్దినట్టు.. ఈజిప్ట్ పిరమిడ్స్ ను పోలి త్రిభుజాకారంలో ఆ పర్వతం ఓ చూడముచ్చటైన దృశ్యం. ఇప్పటికే పురాణాలు, ఇతిహాసాల్లోనూ చెప్పిన ఆ 6 వేల 718 మీటర్ల ఎత్తున్న కైలాస పర్వత కథేంటో ఒక్కసారి తెలుసుకుందాం. ఆ మార్మికతేంటో ఓసారి ఆ మూలాల్లోకి వెళ్లొద్దాం.
మౌంట్ కైలాస్ రహస్యాన్ని శోధించేందుకు.. ఓ రష్యన్ వైద్యుడి ప్రయత్నం!
ఈమధ్య కల్కి 2898 AD అనే సినిమా చూసే ఉంటారు. అందులో శంబాలా అనే ప్రాంతం పేరుంటుంది. సుప్రీం యాస్కిన్ కమల్ హాసన్ కాంప్లెక్స్ లో ప్రాజెక్ట్ కే కోసం గర్భం దాల్చే అవకాశాలున్న అమ్మాయిల సీరమ్ తో ప్రయోగాలు చేస్తుంటాడు. అందులో సుమతీ (దీపికా పదుకొనె) ఒకరు. రేపటి కోసం శంబాలా అని అక్కడి ప్రజలు ఓ తల్లి కోసం ఎదురుచూసే క్రమంలో… సుమతే తమ తల్లిని నమ్ముతుంటారు. అదిగో ఆ శంబాలా పేరు మనకు కైలాస పర్వత ప్రాంతంలోనూ వినిపిస్తుంది. రష్యన్ రచయిత నికోలస్ రోరిచ్.. మౌంట్ కైలాస్ పర్వతం గురించి పరిశోధించి రచనలు చేయడంతో పాటు, కొన్ని పెయింటింగ్స్ కూడా వేశారు.
ఆ క్రమంలో కైలాస పర్వతంపైన ఒక రహస్యమైన ఆధ్యాత్మిక రాజ్యం ఇంకా ఉందని.. ఆ మర్మదేశం శంబాలా అని కూడా ఆయన బలంగా నమ్ముతూ కొన్ని వాదనలను ముందుకు తెచ్చారు. అక్కడ చావులేని చిరంజీవులే జీవిస్తారని.. దాన్ని హిందువులు కపాపా అని పిలుస్తుంటారనీ ఆయన తన రచనల్లో వెల్లడించారు.
సముద్ర మట్టానికి 6718 మీటర్ల ఎత్తనేది ఇప్పటికీ ఈ పర్వత ఎత్తుకు సంబంధించి ఓ అంచనా మాత్రమే. ఇప్పటివరకూ ఈ పర్వతాన్ని ఎవ్వరూ సరిగ్గా కొలవలేకపోయారు. ఎన్నో పర్వతాలను అధిరోహించిన వారెందరో టిబెట్ లో ఉన్న ఈ కైలాస పర్వతాన్ని మాత్రం చిట్టచివర వరకూ ఇప్పటివరకూ చేరుకోలేకపోయారు. ప్రయత్నించివారెందరో నామారూపాల్లేకుండా అదృశ్యమైపోయారు. ఇక్కడి మార్మిక రహస్యాలు అంతుచిక్కక ఇటు భారత్, టిబెట్, అటు చైనా వంటి దేశాలన్నీ కూడా మౌంట్ కైలాస్ పర్వతాధిరోహణను పూర్తిగా నిషేధించాయి.
కానీ, రష్యాకు చెందిన కొందరు పరిశోధకులు మాత్రం కైలాస పర్వతాన్ని సందర్శించారు. ఇది పురాతన మానవ నిర్మిత పిరమిడ్ అంటూ కొత్త సిద్దాంతాన్నీ ముందుకు తెచ్చారు. దీని చుట్టుపక్కల ఉన్న పిరమిడ్స్ తోనూ ఈ కైలాస పర్వతానికి సంబంధముండి ఉంటుందని వెల్లడించారు. ఈజిప్ట్ లోని గిజా… సెంట్రల్ మెక్సికోలోని టియోటిహుకాన్ లలోని పిరమిడ్స్ తో ఈ పిరమిడ్ కు మధ్య ఏదో సంబంధముండి ఉంటుందన్న ఓ అంచనాకొచ్చారు.
కానీ, హిందువులతో పాటు, బౌద్ధులు, జైనులు, బాన్ మతస్థులకు ఈ కైలాస పర్వతమంటే అత్యంత భక్తి. ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ కైలాస పర్వతంపైనే ఆ భోళాశంకరుడు తపస్సు చేస్తూ కూర్చున్నాడని హిందువులు నమ్మితే.. చక్రసంవర, డెమ్ చోగ్ అనే బౌద్ధారాధకులు ఈ పర్వతంపై నివశిస్తున్నట్టు టిబెటన్ బౌద్ధులు నమ్ముతారు. ఈ పర్వతాన్ని వారు కాంగ్ రిన్ పోచే అని.. లేదా గ్యాంగ్ రిన్ పోచే అని పిలుస్తుంటారు.
అలాగే, టిబెటన్ సన్యాసి మిలరేపా కూడా ఇక్కడి కైలాస పర్వతంతో సంబంధి కల్గి ఉన్నాడని.. చుట్టపక్కల గుహల్లో ధ్యానం చేసినట్టు వీరి నమ్మకం. ఇక జైనులకు సంబంధించి రిషభదేవుడు విముక్తి పొందిన ప్రదేశంగా జైన గ్రంథాల్లో ఈ కైలాస పర్వతం గురించి విడమర్చి చెప్పారు. అందుకే, వారీ పర్వతాన్ని అష్ఠపద అని పిలుస్తుంటారు. బౌద్ధ మతానికంటే కూడా పురాతనమైనదిగా టిబెట్ లో కనిపించే బాన్ తెగ కూడా ఈ కైలాస పర్వతాన్ని ఆధ్యాత్మిక ప్రదేశంగా కొలుస్తారు. వారికి సంబంధించిన ఎన్నో ఆచారాలకూ, వేడుకలకు ఈ కైలాస పర్వతం ఓ వేదిక.
కైలాస పర్వతం ఎంత మార్మికమైందంటే… వైజ్ఞానిక ప్రపంచాన్నీ అబ్బురపరుస్తూ అంతుచిక్కనంతది. ఇక్కడి వివిధ మతాల సెంటిమెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని… చైనా, టిబెట్ వంటి దేశాలు ఇక్కడ పర్వాతారోహణనే నిషేధించాయి. కానీ, ఈ విషయంలో మన భారతీయుల్లాగే, రష్యన్స్ కు మాత్రం ఏముందో తెలుసుకోవాలని, శోధించాలనే ఒకింత క్యూరియాసిటీ మాత్రం విశేషంగా కనిపిస్తూనే ఉంది.
ఆ ఉత్సుకతతో ముందడుగు వేసి ఈ పర్వాతాధిరోహణకు యత్నించిన ఎందరో ఒక పాయింట్ వద్దకు చేరుకోగానే తమ ప్రాణాలను కోల్పోయిన ఘటనలు కొల్లలు. 19వ శతాబ్దపు చివరి రోజులు.. 20 శతాబ్దపు తొలిరోజుల్లో రష్యన్ పర్వాతాధిరోహకులు ఎందరో ఈ పర్వతాన్ని కొలవడానికి వెళ్లి మాయమైపోయిన ఘటనలూ ఉన్నాయి. ఒక సైబీరీయన్ పర్వతారోహకుడు ఈ పర్వతాన్ని కొంత అధిరోహించిన క్రమంలో.. పర్వతం మొత్తం ఎక్కాలని ప్రయత్నించినవారికి వృద్ధాప్య ఛాయలు పైబడి.. తనకు తెలిసినవారు ఒక్క సంవత్సం లోపే మరణించారని చెప్పడంతో.. ఈ మిస్టీరియస్ పర్వతమంటే ఇప్పుడు కేవలం ఆధ్యాత్మిక భావనే మినహా.. ఈ పర్వత అధిరోహణ, పరిశోధనకు ఇంకెవ్వరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది.
యుఫాకు చెందిన రష్యన్ నేత్ర వైద్యుడు డాక్టర్ ఎర్నెస్ట్ ముల్డాషెవ్ ఈ టిబెట్ లోని కైలాస పర్వతం ఒక మానవ నిర్మిత పిరమిడ్ అంటూ కొత్త సిద్ధాంతంతో ముందుకొచ్చాడు. 1999లో ఎర్నెస్ట్ ముల్డాషెవ్ కైలాష్ పర్వత రహస్యాల కోసం.. భూగర్భశాస్త్ర, భౌతికశాస్త్ర.. అలాగే, చారిత్రక పరిశోధనకుల బృందంతో టిబెట్ యాత్రకు వెళ్లాడు. ఎర్నెస్ట్ ముల్డాషెవ్ బృందం టిబెట్ లోని ఎందరో బౌద్ధలామాలను కలుసుకుంది. ఈ పర్వతం చుట్టూ చాలా నెలలు గడిపి పలు పరిశోధనలు కూడా చేసింది.
మరి మానవ నిర్మిత పిరమిడ్ అంటూ తమ పరిశోధనల్లో వెలిబుచ్చిన డాక్టర్ ముల్డాషెవ్ బృందం ఇంకేమేం చెప్పింది..?
వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం! …….. పార్ట్ -2 (రచన :: రమణ కొంటికర్ల)
Share this Article