.
పుష్ప సీక్వెల్ మీద అనేక వివాదాలు… జాప్యం, దర్శకుడితో విభేదాలు, కంపోజర్ పంచాయితీలు, రీషూట్లు… అన్నింటికీ మించి అడ్డగోలు టికెట్ రేట్లు…
ఈమధ్యకాలంలో ఇంత హైప్ క్రియేట్ చేయబడిన సినిమా మరొకటి లేదేమో… సరే, ఆ కథలన్నీ ఎలా ఉన్నా… సినిమా ఎలా ఉంది… సినిమాలో చెప్పుకున్నట్టు ఇంటర్నేషనల్ వైల్డ్ ఫైర్ రేంజులో ఉందా..?
Ads
ఎంత వద్దనుకున్నా ఖచ్చితంగా పుష్ప ఫస్ట్ పార్ట్‌తో పోలిక తప్పకుండా వస్తుంది… దానికి సీక్వెలే కదా ఇది… స్థూలంగా సినిమా హిట్… ప్రీమియర్లు చూసిన ప్రేక్షకులు కూడా ఖుష్… పక్కా కమర్షియల్ సక్సెస్… డౌట్ లేదు… ఐతే..? ఫస్ట్ పార్ట్ ఇచ్చిన థ్రిల్ ఇందులో కాస్త తక్కువే…
ఈ సినిమా మొత్తం బన్నీయే… తనను ఆకాశానికి ఎత్తడానికి మిగతా పాత్రలన్నీ వీక్ చేసేశాడు దర్శకుడు… ఫస్ట్ పార్టులో చివరలో వచ్చిన ఫహాద్ ఫాజల్ పాత్ర కూడా వీకే… ఫస్టాఫ్ మొత్తం ఫహాద్, బన్నీల నడుమ టామ్ అండ్ జెర్రీ బాపతు సో సో కథనం… ఇంట్రవెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్ ఇంకాస్త ఇంట్రస్టింగుగా నడిపించాడు దర్శకుడు కథను…
నో డౌట్… అల్లు అర్జున్ మంచి పర్‌ఫార్మర్… ఓ రేంజులో అదరగొట్టేశాడు ఆ పాత్రకు తగిన యాక్షన్‌ను… నిజానికి ఫస్ట్ పార్టుతో పోలిస్తే ఇందులో పెద్ద కథేమీ లేదు… కాకపోతే ఎప్పటికప్పుడు హై తీసుకురావడంలో దర్శకుడు సక్సెసయ్యాడు… హైప్‌కు తగిన సరుకు ఇచ్చాడు…
అవును, మొన్నామధ్య ఎవరో నిర్మాతో దర్శకుడో అన్నాడు కదా… స్టార్ హీరోల సినిమాలకు కథలెందుకు అని..! పుష్ప సీక్వెల్ కూడా పుష్ప, బన్నీ బ్రాండ్‌తో నడిచిపోతుంది… బన్నీ లేకపోతే ఈ సినిమా లేదు… పుష్పరాజ్ అనే కేరక్టర్ స్మగ్లర్… దాన్ని ఓ డ్రగ్‌లాగా ఎక్కించాడు సుకుమార్… డ్రగ్స్ మంచివి కావు, కానీ కిక్కు వస్తుంది కదా… ఈ కేరక్టరూ అంతే…
యాక్షన్ సీక్వెన్సులే కాదు, జాతర, క్లైమాక్సుల చిత్రీకరణలో సుకుమార్ ప్రతిభ, బన్నీ నటన ఈ సినిమాకు ప్రాణం… రష్మిక మంధనకు కూడా కీలకమైన ఎపిసోడ్ జాతరే… కాకపోతే కథాపరంగా క్లైమాక్స్ అసంపూర్తిగా ముగించి, పుష్ప-3 కోసం ఓ అస్పష్టమైన లీడ్ వదిలారు అనిపించింది… అది అంత కిక్ ఇచ్చేలా లేదు…
ఫస్ట్ పార్ట్ పాటలతో పోలిస్తే ఈ సీక్వెల్ పాటలు అంత బాగాలేనట్టు అనిపించినా నాసిరకం అయితే కాదు… దెబ్బలు పడతయిరో పాటలో రచయిత ఏం చెప్పాలనుకున్నాడో ఆ ఆస్కారుడికే ఎరుక పాఫం… స్టెప్పులు వేయడంలో రష్మిక బన్నీతో అక్షరాలా పోటీపడింది… కానీ సుకుమార్ ఓ పాటలో మరీ ఆమెను పచ్చిపచ్చిగా చూపించాడు… (ఐనా యానిమల్‌లో ఆ రేంజులో కనిపించింది, ఇదెంత..?)
బీజీఎం మీద కదా హీరో, దర్శకుల అసంతృప్తి, అందుకే కదా వేరేవాళ్లను పెట్టుకున్నది… బీజీఎం అదిరిపోయింది… దర్శకుడి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు బీజీఎం చేసిన సంగీత దర్శకుడు ఎవరో గానీ… (సీఎస్ శామ్..?)
దెబ్బలు పడతయిరో ఐటమ్ సాంగ్‌లో శ్రీలీల మసాలా స్టెప్పులు బాగానే ఉన్నాయి… స్వతహాగా ఆమె మంచి డాన్సర్… ఆమెతో పోటీ ఏ హీరోకైనా కష్టమే… మొత్తానికి ఇది బన్నీ బ్రాండ్ సినిమా… కథాలోపాలు, కథనలోపాలు గట్రా పట్టించుకోవద్దు… పక్కా ఓ కమర్షియల్ మూవీ కదా, లెంత్ ఎక్కువైనా సరే… జస్ట్, అలా చూస్తూ ఉండిపోవాలి… మరి పుష్ప అంటే ఫ్లవర్ కాదు కదా… అసలే ఇప్పుడు ఇంటర్నేషనల్ వైల్డ్ పైర్…!!
Share this Article